ఢిల్లీ: కొత్త ఏడాది 2024లోనూ ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొనడానికి భారత్ రాజకీయంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉందని చెప్పారు. తాను రాసిన నూతన పుస్తకం 'Why Bharath Matters' ఆవిష్కరణ సందర్భంగా ఈ మేరకు మాట్లాడారు. దేశ స్వాంతంత్య్రం తొలినాళ్లలో మాజీ ప్రధాని నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాలను జైశంకర్ విమర్శించారు.
భారత ప్రయోజనాలకే నెహ్రూ అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉంటే చైనాతో బంధంపై ఆశలు పెంచుకునేవాళ్లం కాదని జై శంకర్ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, పండిట్ నెహ్రూకు మధ్య చైనా అంశంపై జరిగిన లేఖల మార్పిడి ఇందుకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. చైనా అంశంలో నెహ్రూకు, పటేల్‌కు మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని జైశంకర్ తెలిపారు.
భద్రతా మండలిలో చైనాకు చోటు దక్కేలా నెహ్రూ వ్యవహరించారని జైశంకర్ అన్నారు. ‘‘భద్రతా మండలిలో ముందుగా చైనా చోటు దక్కించుకోనివ్వండి’’ అని ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖ కూడా ఉందని పేర్కొన్నారు. చైనాతో యుద్ధం విషయంలో అమెరికా సహాయాన్ని నెహ్రూ నిరాకరించారని గుర్తుచేశారు. పటేల్‌కు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉందని జై శంకర్ అన్నారు. "మనం అమెరికాపై ఎందుకు అపనమ్మకంతో ఉన్నాం.. మన ప్రయోజనాల దృష్టిలోనే చూడాలి. చైనా-అమెరికా బంధం కోణంలో కాదు." అని పటేల్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..?
Comments
Please login to add a commentAdd a comment