షీ జిన్‌పింగ్–మోదీ
సాక్షి, హైదరాబాద్ : భారత–చైనాల సంబంధాల్లో నూతన అధ్యాయం దిశలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఉపయోడుతుందా ? ఈ రెండు దేశాధినేతల మధ్య చైనాలో ముగిసిన ‘అనధికార’ శిఖరాగ్రసమావేశం నుంచి సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. డోక్లామ్ వద్ద సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఘర్షణాత్మక వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు నెమ్మనెమ్మదిగా చల్లబడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాల పటిష్టానికి, పరస్పర సహకారానికి మోదీ పర్యటన ఎంతవరకు ఉపయోగపడుతుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుతం రెండుదేశాల మధ్యనున్న ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణాన్ని చల్లబరిచేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్–మోదీల అనధికార భేటీ బాగానే దోహదపడిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో భాగంగా వీరువురు ఆయా ముఖ్యమైన అంశాలపై ముఖాముఖి చర్చలు జరిపిన దృష్ట్యా, మోదీ పర్యటనతోనే ఇవి ఆగిపోకుండా రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని భేటీలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తోంది.
ప్రధానంగా...
1) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడంతో పాటు ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను జిన్‌పింగ్–మోదీ గుర్తించారు. దీనిలో భాగంగా పరస్పరం అర్థం చేసుకుని, విశ్వాసం ప్రోదిగొల్పే దిశలో ‘సమాచార మార్పిడి’ పటిష్టం చేసేందుకు తమ తమ దేశాల సైన్యాలకు వ్యూహాత్మక మార్గదర్శనం చేస్తారని భావిస్తున్నారు. ఇరుదేశాలు కూడా ఉమ్మడిగా పరస్పర నమ్మకం పెంపొందించే చర్యలు చేపడతాయి.
2) అమెరికాతో సహా వివిధ పశ్చిమదేశాలు తమ అంతర్గత అంశాలపై దృష్టి నిలుపుతున్న నేపథ్యంలో ... ప్రపంచస్థాయిలో కీలకపాత్ర నిర్వహణ దిశలో భారత్–చైనా ముందడుగు వేసేందుకు ముందుగా ఈ రెండింటి మధ్య సత్సంబంధాలు ఏర్పడాలి. రెండుదేశాలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగేలా మరింత మెరుగైన భాగస్వామ్యబంధం ఏర్పడాలి.
3) కీలకమైన అంశాలపై తరచు ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు, దీర్ఘకాలిక ప్రయోజనాల పరిరక్షణకు రెండుదేశాల మధ్య విస్తృతస్థాయిలో చర్చలకు మార్గం ఏర్పడాలి. విభేదించే అంశాలను శాంతియుత పద్థతుల్లో చర్చల ద్వారా దూరం చేసుకునే పరిణితి,తెలివితేటలు ప్రదర్శించే విషయంలో మోదీ–జిన్‌పింగ్ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సరిహద్దు సమస్యలు సమసిపోయేలా న్యాయబద్ధమైన ఒప్పందం కుదిరేందుకు ఇరుదేశాలు నియమించనున్న ప్రత్యేక ప్రతినిధులు కీలకపాత్ర పోషించనున్నారు.
4) రెండుదేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య నున్న సానుకూల అంశాలను ఉపయోగించి ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లే అంగీకారం కుదిరింది. స్వయం అభివృద్ధి సాధన దిశలో అన్ని దేశాలు స్వేచ్ఛగా పాల్గొనేలా సమాన అవకాశాలు కల్పించేందుకు బహుళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏర్పడాల్సిన ఆవశ్యకతను వీరిద్దరూ మరోసారి ప్రస్తావించారు. దీని ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని పేదరికం, అసమానతలు దూరం చేసేందుకు దోహదపడొచ్చని అభిప్రాయపడ్డారు.
5) ఇరుదేశాలకు తీవ్రవాదం వల్ల తలెత్తే ప్రమాదాన్ని మోదీ–జిన్‌పింగ్ గుర్తించారు. సరిహద్దు తీవ్రవాదం విషయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. అయితే ఏయే అంశాలపై సహకారం, మద్దతు ఇచ్చిపుచ్చుకోవాలనే అంశంపై మాత్రం ఈ భేటీలో లోతైన చర్చేమి జరగలేదని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment