She jinping
-
జిన్‌పింగ్ అంటే మోదీకి జంకు
న్యూఢిల్లీ/త్రిసూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలహీనమైన వ్యక్తి అని, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో చైనా వరుసగా నాలుగోసారి అడ్డుతగిలిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘బలహీనమైన మోదీ షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారు. భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే.. మోదీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చైనాతో నమో దౌత్య సంబంధం ఎలా ఉంటుందంటే.. 1.మోదీ జిన్‌పింగ్‌తో కలసి గుజరాత్లో పర్యటిస్తారు. 2.ఢిల్లీలో జీని కౌగిలించుకుంటారు. 3. చైనాలో జీ ముందు తలవంచుతారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చేస్తున్న మన ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతోంది. ఇక ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసి తిరగడం వల్ల ఒరిగింది ఏంటన్న ప్రశ్న ప్రతి భారతీయుడిలోనూ మెదులుతోంది’’ అని పోస్ట్ చేసింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో తీవ్రమైన జాతీయవాద వాతావరణాన్ని సృష్టించి మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాల నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడింది. వారికి హింసే ఆయుధం.. బీజేపీ, సీపీఎంలు హింసను ఆయుధంగా వాడుకుంటున్నాయని రాహుల్ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం సైద్ధాంతిక యుద్ధం జరుగుతోందని అన్నారు. కేరళలోని కోజికోడ్‌లో గురువారం నిర్వహించిన ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. అన్ని మతాల ప్రజలు కలసిమెలసి జీవిస్తున్న రాష్ట్రానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెడుతూ..ప్రధాని విధి తన మనసులో ఉన్నది చెప్పడం కాదని, ఇతరుల మనసుల్లో ఏముందో వినడమని హితవు పలికారు. కాంగ్రెస్ ఏదో ఒక వ్యక్తి, సంస్థ తరుఫున గళమెత్తదని, దేశమంతటికీ గొంతుక అని అన్నారు. దేనినీ కాంగ్రెస్ బలవంతంగా దేశంపై రుద్దదని, ప్రజల అభిప్రాయాలు గౌరవించి దానికి అనుగుణంగా నడుచుకుంటుందని తెలిపారు. -
ఉగ్రవాదమే పెద్ద సమస్య
బ్యూనోస్ ఎయిర్స్: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్ర«ధాని మోదీ శుక్రవారం అన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు బ్రిక్స్, జీ–20 దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జీ–20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సు కోసం మోదీ అర్జెంటీనాలో పర్యటిస్తుండటం తెలిసిందే. అక్కడ బ్రిక్స్ దేశాధినేతల మధ్య జరిగిన భేటీలో మోదీ ప్రసంగించారు. ఆర్థిక నేరగాళ్ల వల్ల ప్రపంచం ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు ఎదురవుతోందనీ, మోసాలు చేసి స్వదేశాల నుంచి పరారైన నేరగాళ్లకు వ్యతిరేకంగా కూడా అన్ని దేశాలూ సహకరించుకోవాలని ఆయన సూచించారు. బ్రిక్స్ దేశాధినేతల భేటీలోనే కాకుండా ప్రత్యేకంగానూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌లతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. వాతావరణ మార్పులపై ఈ నెల 3 నుంచి పోలండ్‌లో జరగనున్న కాప్24 సదస్సులో భారత్ కీలక, బాధ్యతయుతమైన పాత్ర పోషిస్తుందని గ్యుటెరస్‌తో మోదీ చెప్పినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించిన యోగా ఫర్ పీస్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. శాంతి, ఆరోగ్యం కోసం ప్రపంచానికి భారత్ అందించిన బహుమతి యోగా అని అన్నారు. ట్రంప్ చెడగొట్టారు: పుతిన్ జీ–20 దేశాల మధ్య వాణిజ్యం, వాతావరణ మార్పులపై గతంలో ఉన్న ఏకాభిప్రాయాన్ని ట్రంప్ చెడగొట్టారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. అమెరికా ఇతర దేశాలపై ఆంక్షలు విధించడం, వ్యాపారంలో రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తుండటాన్ని పుతిన్ తప్పుబట్టారు. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో జీ–20 దేశాధినేతల తొలి సదస్సు సమయం నుంచి ఆర్థిక స్థిరత్వానికి తీసుకుంటున్న చర్యలను ట్రంప్ పాడుచేశారని పుతిన్ దుయ్యబట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పుతిన్‌తో గొంతు కలిపారు. ట్రంప్, మోదీ, అబే భేటీ మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేల మధ్య తొలి త్రైపాక్షిక భేటీ శుక్రవారం జరిగింది. ప్రపంచ, బహుళ ప్రయోజనాలున్న ప్రధానాంశాలపై వారు చర్చలు జరిపారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయడాన్ని భారత్ కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ‘జై (జేఏఐ – జపాన్, అమెరికా, ఇండియా) సమావేశం ప్రజాస్వామ్య విలువలకు అంకితం. పలు భారతీయ భాషల్లో జై అంటే విజయం అని అర్థం’ అని మోదీ అన్నారు. ‘జై’ దేశాల తొలి త్రైపాక్షిక భేటీలో పాల్గొనడం తనకు ఆనందాన్నిచ్చిందని అబే చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని వారు ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. -
సత్ఫలితాల దిశగా...
ఇరు దేశాల మధ్యా పరస్పరం అవిశ్వాసం, అపనమ్మకం అధికంగా ఉన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య చైనాలోని వుహాన్ నగరంలో రెండురోజులపాటు అనధికార శిఖరాగ్ర సమావేశం జరిగింది. ప్రకటనలు వేర్వేరుగా చేసినా ఇద్దరు అధినేతలూ ఈ సమావేశం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. డోక్లాం తరహా పరిస్థితులు తలెత్తకుండా ఇకపై తరచు పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవాలని, సంప్రదించుకోవాలని తమ తమ సైనిక దళాలకు నేతలిద్దరూ మార్గ నిర్దేశం చేశారు. ఇప్పుడున్న స్థితి నుంచి మరింత ఎదగాలని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా రూపొందాలని రెండు ఇరుగు పొరుగు దేశాలూ బలంగా వాంఛిస్తున్నప్పుడు సహజంగానే వైరుధ్యాలు ఏర్పడతాయి. అవి ఒకటి రెండు సమావేశాల వల్లనే పరిష్కారం కావు. అందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఒక కీలకమైన అంశంలో రెండూ ఏకాభిప్రాయానికొచ్చాయి. ఉగ్రవాదం, అమెరికా సేనల ఆగడాల పర్యవసానంగా సుదీర్ఘకాలం నుంచి ఘర్షణలతో అట్టుడుకుతూ శిథిలావస్థకు చేరుకున్న అఫ్ఘానిస్తాన్‌లో సంయుక్తంగా ఒక అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించాయి. ఏడేళ్లక్రితం మన దేశం చైనాకు చేసిన ఈ ప్రతిపాదనకు ఇన్నాళ్లుగా అటునుంచి సానుకూల స్పందన రాలేదు. మౌలిక సదుపాయాల రంగంలో, ముఖ్యంగా సహజ వనరులను వెలికితీయడంలో ఉమ్మడిగా కృషి చేద్దామని మన దేశం అప్పట్లో ప్రతిపాదించింది. పాక్‌కు సహజంగానే ఇది మింగుడు పడని వ్యవహారం. అసలు అఫ్ఘాన్‌లో మన ఉనికి దానికి ససేమిరా ఇష్టం లేదు. అలాగని మనకు పోటీగా భారీయెత్తున అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాలుపంచుకునే ఆర్థిక స్థోమత దానికి లేదు. కనుకనే చైనా–పాకిస్తాన్ కారిడార్‌లో అఫ్ఘాన్‌ను కూడా చేర్చి విస్తృతపరచాలని ఇప్పటికే అది ప్రతిపాదించింది. భారత్‌తో చేతులు కలపడం తన చిరకాల మిత్ర దేశానికి బాధ కలిగిస్తుందని అటు చైనాకు కూడా తెలుసు. కానీ ఆ విషయంలో దాని మాట వినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే అధికమని ఆ దేశం భావిస్తోంది. ఎందుకంటే ఆర్థికంగా మరింతగా ఎదగాలని కోరుకుంటున్న చైనాకు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న మన దేశాన్ని విస్మరించడం అంత సులభం కాదు. అలాగే పాకిస్తాన్‌తో తన మైత్రి బలపడేకొద్దీ భారత్ ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటుందని చైనాకు బాగా తెలుసు. ఇప్పటికే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మన దేశానికి అమెరికా ప్రాధాన్యమివ్వడం మొదలుపెట్టింది. అదే జరిగితే ముందూ మునుపూ ఆ ప్రాంతంలో భారత్ తనకు అవరోధంగా మారే అవకాశమున్నదని చైనాకు తెలుసు. ఈ రెండు కారణాలరీత్యా మన ప్రతిపాదనవైపే అది మొగ్గు చూపింది. వాస్తవానికి గత డిసెంబర్లో చైనా పాక్, అఫ్ఘాన్ల విదేశాంగ మంత్రులతో కలిసి త్రైపాక్షిక సమావేశం నిర్వహించింది. అందులో మనకు చోటీయలేదు. కానీ ఇప్పుడు చైనా అందుకు భిన్నమైన మార్గాన్ని అనుసరించడం దౌత్యపరంగా మనకు అనుకూలాంశం. ప్రపంచం ఇప్పుడు అయోమయావస్థలో ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలు నిలకడగా ఉండటం లేదు. ఆయన ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు, సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి దిగారు. దానికి ప్రతిగా అటు చైనా సైతం వాణిజ్యంలో తాను చేయగలిగింది తాను చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో వైషమ్యాలను సాధ్యమైనంతవరకూ తగ్గించుకోవడం శ్రేయస్కరమని చైనా భావిస్తోంది. అలాగే ప్రస్తుత అనిశ్చితిలో తాను ఎదగడానికి అందివచ్చే దేన్నీ వదులుకోకూడదని అనుకుంటోంది. అందువల్లే ప్రస్తుత అనధికార శిఖరాగ్ర సమావేశానికి కీలక ప్రాధాన్యముంది. సరిహద్దు వివాదాలను, ఇతర విభేదాలను పక్కనబెట్టి వాణిజ్య రంగంలో పరస్పరం సహకరించుకోవాలని రాజీవ్‌గాంధీ హయాంలో 1988లో రెండు దేశాలూ అంగీకారానికొచ్చాయి. కానీ గత రెండేళ్లుగా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాన్రాను పరిస్థితి దిగజారుతున్నదని, దీనికి ఎక్కడో అక్కడ ఫుల్స్టాప్ పడాలని ఇరు దేశాల నేతలూ భావించబట్టే ఇప్పుడీ సమావేశం జరిగింది. పద్ధతి ప్రకారం జరిగే శిఖరాగ్ర సమావేశాలకు చాలా లాంఛనాలుంటాయి. ఇరు దేశాల దౌత్యాధికారులు పలు సమావేశాలు జరిపి, నిర్దిష్టమైన ఎజెండా ఖరారు చేస్తారు. ఆమోదయో గ్యమైనవేవో, కానివేవో నిర్ణయించుకుంటారు. ఏ విషయంలో అంగీకారానికి రావాలన్న అవగాహనకొస్తారు. పర్యవసానంగా అధినేతల చర్చలు ఆ ఎజెండాకు పరిమితమవుతాయి. ప్రస్తుత సమావేశానికి అలాంటి ఎజెండాల జంజాటం లేదు. దేనిపైన అయినా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సంయుక్త ప్రకటన విడుదల లాంఛనం ఉండదు గనుక ఫలానా అంశంపై అవతలివారిని ఒప్పించాలన్న ఆత్రుత ఉండదు. ఇప్పుడు సమావేశం ముగిశాక అధినేతలిద్దరూ వేర్వేరుగా దానిపై తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందులో ఉగ్రవాద నిరోధంలో సహకరించుకోవడం, శాంతిపూర్వక చర్చల ద్వారా విభేదాల పరిష్కారం వగైరా స్థూల అంశాలున్నాయి తప్ప నిర్దిష్టత లేదు. అయినా ఈ తరహా సమావేశాలు అంతిమంగా మేలే చేస్తాయి. మరో నెలన్నరలో చైనాలో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) అధినేతల సమావేశం జరగబోతోంది. దానికి ఎటూ నరేంద్రమోదీ హాజరవుతారు. ఆ సందర్భంగా ఇరువురు అధినేతలూ కలుస్తారు. అయినా ఈలోగానే ఒకసారి విడిగా కలుసుకుని అన్ని అంశాలపైనా మాట్లాడుకోవాలని నిర్ణయించడం మంచిదే. చైనా సహకారం లేనిదే మనకు అణు సరఫరాదార్ల బృందంలో సభ్యత్వం లభించదు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమైనా అంతే. అలాగే మనతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే ప్రపంచంలో చైనా ప్రతిష్ట పెరుగుతుంది. దాని స్థానం సుస్థిరమవుతుంది. ఇలాంటి సమావేశాలు మున్ముందు మరిన్ని జరిగితే అవి రెండు దేశాల ఎదుగుదలకూ దోహదపడతాయి. -
కలిసి ముందుకెళదామా...!
సాక్షి, హైదరాబాద్ : భారత–చైనాల సంబంధాల్లో నూతన అధ్యాయం దిశలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఉపయోడుతుందా ? ఈ రెండు దేశాధినేతల మధ్య చైనాలో ముగిసిన ‘అనధికార’ శిఖరాగ్రసమావేశం నుంచి సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. డోక్లామ్ వద్ద సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఘర్షణాత్మక వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు నెమ్మనెమ్మదిగా చల్లబడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాల పటిష్టానికి, పరస్పర సహకారానికి మోదీ పర్యటన ఎంతవరకు ఉపయోగపడుతుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుతం రెండుదేశాల మధ్యనున్న ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణాన్ని చల్లబరిచేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్–మోదీల అనధికార భేటీ బాగానే దోహదపడిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో భాగంగా వీరువురు ఆయా ముఖ్యమైన అంశాలపై ముఖాముఖి చర్చలు జరిపిన దృష్ట్యా, మోదీ పర్యటనతోనే ఇవి ఆగిపోకుండా రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని భేటీలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానంగా... 1) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడంతో పాటు ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను జిన్‌పింగ్–మోదీ గుర్తించారు. దీనిలో భాగంగా పరస్పరం అర్థం చేసుకుని, విశ్వాసం ప్రోదిగొల్పే దిశలో ‘సమాచార మార్పిడి’ పటిష్టం చేసేందుకు తమ తమ దేశాల సైన్యాలకు వ్యూహాత్మక మార్గదర్శనం చేస్తారని భావిస్తున్నారు. ఇరుదేశాలు కూడా ఉమ్మడిగా పరస్పర నమ్మకం పెంపొందించే చర్యలు చేపడతాయి. 2) అమెరికాతో సహా వివిధ పశ్చిమదేశాలు తమ అంతర్గత అంశాలపై దృష్టి నిలుపుతున్న నేపథ్యంలో ... ప్రపంచస్థాయిలో కీలకపాత్ర నిర్వహణ దిశలో భారత్–చైనా ముందడుగు వేసేందుకు ముందుగా ఈ రెండింటి మధ్య సత్సంబంధాలు ఏర్పడాలి. రెండుదేశాలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగేలా మరింత మెరుగైన భాగస్వామ్యబంధం ఏర్పడాలి. 3) కీలకమైన అంశాలపై తరచు ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు, దీర్ఘకాలిక ప్రయోజనాల పరిరక్షణకు రెండుదేశాల మధ్య విస్తృతస్థాయిలో చర్చలకు మార్గం ఏర్పడాలి. విభేదించే అంశాలను శాంతియుత పద్థతుల్లో చర్చల ద్వారా దూరం చేసుకునే పరిణితి,తెలివితేటలు ప్రదర్శించే విషయంలో మోదీ–జిన్‌పింగ్ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సరిహద్దు సమస్యలు సమసిపోయేలా న్యాయబద్ధమైన ఒప్పందం కుదిరేందుకు ఇరుదేశాలు నియమించనున్న ప్రత్యేక ప్రతినిధులు కీలకపాత్ర పోషించనున్నారు. 4) రెండుదేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య నున్న సానుకూల అంశాలను ఉపయోగించి ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లే అంగీకారం కుదిరింది. స్వయం అభివృద్ధి సాధన దిశలో అన్ని దేశాలు స్వేచ్ఛగా పాల్గొనేలా సమాన అవకాశాలు కల్పించేందుకు బహుళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏర్పడాల్సిన ఆవశ్యకతను వీరిద్దరూ మరోసారి ప్రస్తావించారు. దీని ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని పేదరికం, అసమానతలు దూరం చేసేందుకు దోహదపడొచ్చని అభిప్రాయపడ్డారు. 5) ఇరుదేశాలకు తీవ్రవాదం వల్ల తలెత్తే ప్రమాదాన్ని మోదీ–జిన్‌పింగ్ గుర్తించారు. సరిహద్దు తీవ్రవాదం విషయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. అయితే ఏయే అంశాలపై సహకారం, మద్దతు ఇచ్చిపుచ్చుకోవాలనే అంశంపై మాత్రం ఈ భేటీలో లోతైన చర్చేమి జరగలేదని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
27న మోదీ, జిన్‌పింగ్ భేటీ
బీజింగ్: చైనాతో సుహృద్భావ సంబంధాల దిశగా మరో అడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య భేటీకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 27, 28 తేదీల్లో వారిరువురు సమావేశం కానున్నారు. చైనాలోని హుబీ ప్రావిన్సులోని వుహన్ నగరంలో ఈ అనధికార శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ భేటీలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వివాదాస్పద అంశాల పరిష్కారం, అంతర్జాతీయ సమస్యలు.. తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. రెండు దేశాలకు దీర్ఘకాలిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు వీలు కల్పించే దిశగా చర్చలు కొనసాగనున్నాయి. అయితే, ఈ సందర్భంగా ఎలాంటి ప్రతినిధుల స్థాయి చర్చలుండబోవని, ఎలాంటి ఒప్పందాలు కుదరబోవని, కేవలం ఇద్దరు నేతలు ఏకాంతంగా చర్చలు జరుపుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డోక్లాం సహా పలు సరిహద్దు వివాదాలు, ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడం, ఉగ్రవాది మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా మోకాలడ్డడం తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు మోదీ చైనా పర్యటనకు వస్తున్నారని భారత్, చైనాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, వాంగ్ యి ఆదివారం సంయుక్తంగా ప్రకటించారు. ‘భారత్, చైనాల మధ్య విబేధాల కన్నా ప్రయోజనాలే ముఖ్యమైనవి. పరస్పర ప్రయోజనపూరిత అభివృద్ధికి రెండు దేశాల మధ్య సహకారం అవసరం’ అని వాంగ్ యి పేర్కొన్నారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య భేటీ ఏర్పాట్లపై వాంగ్ యితో చర్చించినట్లు సుష్మాస్వరాజ్ తెలిపారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం సుష్మ చైనాలో పర్యటిస్తున్నారు. జూన్ 9, 10 తేదీల్లోనూ ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనా వెళ్తారు. మానస సరోవర యాత్రకు చైనా ఓకే వాంగ్ యితో భేటీ అనంతరం సుష్మ మాట్లాడుతూ సిక్కింలోని నాథూ లా కనుమ మార్గంలో కైలాశ్ మానస సరోవర యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందన్నారు. డోక్లాం వివాదం తర్వాత నాథూ లా మార్గం గుండా మానస సరోవర యాత్రను నిలిపివేయడం తెలిసిందే. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సుష్మ కరచాలనం -
జిన్‌పింగ్- మోదీ భాయీభాయీ!
అహ్మదాబాద్: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భారత పర్యటన తొలి రోజున గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి చైనా అధ్యక్షుడు మూడు రోజుల భారత పర్యటనను ప్రారంభించారు. ఒక చైనా అధ్యక్షుడు గుజరాత్లో పర్యటించటం ఇదే తొలిసారి. జిన్‌పింగ్, ఆయన ప్రతినిధి బృందంతో కూడిన ఎయిర్ చైనా ప్రత్యేక విమానం బుధవారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే రాష్ట్ర అధికారులు రెడ్ కార్పెట్‌తో సాదరంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద చైనా అధ్యక్షుడికి పోలీసు వందనం సమర్పించడంతో పాటు, సంప్రదాయ గుజరాతీ నృత్యం ఏర్పాటు చేశారు. జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలుకుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో మండారిన్, గుజరాతీ, ఇంగ్లిష్ భాషల్లో భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లకు హయత్ హోటల్ వద్ద ప్రధాని మోదీ పూలగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. చైనాలోని గ్వాంఘు్జ నగరాన్ని, గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని సోదరి నగరాలు (సిస్టర్ సిటీలు)గా అభివృద్ధి చేయడం; గుజరాత్లో చైనా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడం, చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్, గుజరాత్ మధ్య సాంస్కృతిక, సామాజిక సంబంధాల అభివృద్ధి - మొత్తం మూడు అంశాలపై చైనా-గుజరాత్ల మధ్య ఒప్పందాలు కుది రాయి. జిన్‌పింగ్, మోదీల సమక్షంలో ఆయా రాష్ట్రాలు, సంస్థల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. గుజరాత్ సీఎం ఆనందిపటేల్, మంత్రివర్గ సహచరులు, రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, చైనా ప్రతినిధి బృందం పాల్గొన్నారు. మహాత్ముని ఆశ్రమం సందర్శన... తొలిసారి గుజరాత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడిని.. అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం సందర్శనకు ప్రధాని మోదీ తీసుకెళ్లారు. ఆశ్రమం గేటు వద్ద జిన్‌పింగ్‌కు మోడీ ఖద్దరు దండలు వేసి స్వాగతం పలికారు. ఆయనకు ఖద్దరు జాకెట్ (పై కోటు)ను బహూకరించారు. చైనా అధ్యక్షుడు ఈ ఖద్దరు పై కోటును ధరించి ఆశ్రమంలో పర్యటించారు. ఆశ్రమం చారిత్రక ప్రాధాన్యతను ఆయనకు వివరించారు. మహాత్ముడి విగ్రహానికి జిన్‌పింగ్ నివాళులర్పించారు. గాంధీ వినియోగించిన వ్యక్తిగత గది ‘హృదయకుంజ్’ను సందర్శించిన చైనా అధ్యక్షుడు అక్కడ గాంధీ చిత్రపటానికి ఖద్దరు దండ వేసి నివాళులర్పించారు. చరఖాను తిప్పి నూలు వడికారు. గాంధీ ప్రబోధనలను మోదీ వివరించారు. ఈ సందర్భంగా చైనా భాషలో రచించిన భగవద్గీత పుస్తకాన్ని జిన్‌పింగ్‌కు మోదీ బహూకరించారు. అలాగే గాంధీ పుస్తకాలు, గాంధీ వర్ణచిత్రంతో పాటు పలు మెమొంటోలను బహుమానాలుగా అందించారు. 1915లో దక్షిణాఫ్రికాలోని చైనా సంతతి ప్రజలు గాంధీకి ఇచ్చిన ధృవపత్రం నకలును కూడా జిన్‌పింగ్‌కు అందించారు. సబర్మతీ తీరంలో సేదతీరిన దేశాధినేతలు.. ఆశ్రమంలో పర్యటన అనంతరం.. జిన్‌పింగ్ దంపతులను మోదీ సబర్మతి నదీ తీరానికి తీసుకెళ్లారు. రంగురంగుల దీపాలు, నీటి ఫౌంటైన్లతో వెలుగులీనుతున్న తీరంలో అతిథుల కోసం గుజరాతీ సంప్రదాయం, సంస్కృతులను ప్రతిబింబిస్తూ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు ఏశారు. వీటిలో గార్బా నృత్యం, జానపద నృతం, తబలా కచేరీ, తదితర కళారూపాలను ప్రదర్శించారు. జిన్‌పింగ్ దంపతులు సంప్రదాయబద్ధమైన మంచంపై ఆశీనులై ఈ కార్యక్రమాలను వీక్షించారు. జిన్‌పింగ్, మోదీలు ఈ సందర్భంగా కొంతసేపు ఊయలపై కూర్చున్నారు. ఇరువురు నేతలూ కొంత సేపు తీరంలో విహరిస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం జిన్‌పింగ్ దంపతులకు ప్రత్యేకంగా నిర్మించిన గుమ్మటాల్లో ప్రధాని రాత్రి విందు ఇచ్చారు. అతిథులకు గుజరాతీ శాకాహార వంటకాలను వడ్డించి అతిథ్యమిచ్చారు. ఇరువైపుల నుంచీ దేశాధ్యక్షులతో సహా 11 మంది చొప్పున ఈ విందులో పాల్గొన్నారు. జిన్‌పింగ్ వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో చైనా ప్రభుత్వ సలహాదారు యాంగ్ జేచి, విదేశాంగ మంత్రి వాంగ్ యి, వాణిజ్య మంత్రి గావో హుచెంగ్, పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర నేతలు ఉన్నారు. అనంతరం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వివాదాల మధ్య సుహృద్భావ పర్యటన... భారత్‌లో పర్యటిస్తున్న మూడో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. అంతకుముందు 1996లో జియాంగ్‌జెమిన్, 2006లో హుజింటావో భారత పర్యటనకు వచ్చారు. చైనా - భారత్‌ల మధ్య సరికొత్త సరిహద్దు వివాదం తలెత్తిన పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడి భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లడఖ్ ప్రాంతంలో సాగునీటి కాల్వ పనులపై నిరసన వ్యక్తం చేస్తూ చైనా సంచార ప్రజలు కొందరు తమ దేశ సైనిక బలగాల సాయంతో లడఖ్‌లోని డేమ్చాక్ ప్రాంతంలో భారత భూభాగంలో శిబిరాలు వేసుకుని ఉండటం ఈ వివాదానికి దారితీసింది. అహ్మదాబాద్‌లో కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడుకున్న మోదీ, జిన్‌పింగ్ గురువారం ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరపనున్నారు. భారీ పెట్టుబడులకు అవకాశం... ఆర్థిక, వాణిజ్య రంగాలపై కేంద్రీకరించిన జింగ్పింగ్.. భారతీయ రైల్వేల ఆధునీకరణ, పారిశ్రామిక పార్కుల స్థాపన, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 3,000 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులను ప్రకటించే అవకాశముందని అధికార వర్గాల సమాచారం. ‘టిబెట్’పై చర్చించండి: ప్రధానికి టిబెట్ సంస్థల విజ్ఞప్తి ధర్మశాల: చైనా అధ్యక్షుడి భారత పర్యటన నేపధ్యంలో ఆయనతో భేటీ సందర్భంగా టిబెట్ అంశంపై చర్చించాలని ధర్మశాలలోని టిబెట్ సంస్థలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశాయి. ‘‘చైనా అధ్యక్షుడి భారత పర్యటనలో భారత ప్రజాస్వామ్యపు సౌందర్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, అది ఎలా పనిచేస్తుందనేదాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాం. చాలా భాషలు, చాలా జాతులు భారత్‌లో సుహృద్భావంగా మనగలగటానికి కారణం స్వేచ్ఛ అనేది పునాదిగా ఉండటమే. అదే భారత్‌ను సమైక్యంగా ఉంచుతోంది. భారత పునాది భయం కాదు’’ అని ప్రవాసంలోని టిబెట్ ప్రధానమంత్రి లోబ్సాంగ్సాంగే బుధవారం ధర్మశాలలో మీడియాతో వ్యాఖ్యానించారు.