నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్
ఇరు దేశాల మధ్యా పరస్పరం అవిశ్వాసం, అపనమ్మకం అధికంగా ఉన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య చైనాలోని వుహాన్ నగరంలో రెండురోజులపాటు అనధికార శిఖరాగ్ర సమావేశం జరిగింది. ప్రకటనలు వేర్వేరుగా చేసినా ఇద్దరు అధినేతలూ ఈ సమావేశం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. డోక్లాం తరహా పరిస్థితులు తలెత్తకుండా ఇకపై తరచు పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవాలని, సంప్రదించుకోవాలని తమ తమ సైనిక దళాలకు నేతలిద్దరూ మార్గ నిర్దేశం చేశారు. ఇప్పుడున్న స్థితి నుంచి మరింత ఎదగాలని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా రూపొందాలని రెండు ఇరుగు పొరుగు దేశాలూ బలంగా వాంఛిస్తున్నప్పుడు సహజంగానే వైరుధ్యాలు ఏర్పడతాయి. అవి ఒకటి రెండు సమావేశాల వల్లనే పరిష్కారం కావు. అందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఒక కీలకమైన అంశంలో రెండూ ఏకాభిప్రాయానికొచ్చాయి.
ఉగ్రవాదం, అమెరికా సేనల ఆగడాల పర్యవసానంగా సుదీర్ఘకాలం నుంచి ఘర్షణలతో అట్టుడుకుతూ శిథిలావస్థకు చేరుకున్న అఫ్ఘానిస్తాన్‌లో సంయుక్తంగా ఒక అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించాయి. ఏడేళ్లక్రితం మన దేశం చైనాకు చేసిన ఈ ప్రతిపాదనకు ఇన్నాళ్లుగా అటునుంచి సానుకూల స్పందన రాలేదు. మౌలిక సదుపాయాల రంగంలో, ముఖ్యంగా సహజ వనరులను వెలికితీయడంలో ఉమ్మడిగా కృషి చేద్దామని మన దేశం అప్పట్లో ప్రతిపాదించింది. పాక్‌కు సహజంగానే ఇది మింగుడు పడని వ్యవహారం. అసలు అఫ్ఘాన్‌లో మన ఉనికి దానికి ససేమిరా ఇష్టం లేదు. అలాగని మనకు పోటీగా భారీయెత్తున అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాలుపంచుకునే ఆర్థిక స్థోమత దానికి లేదు. కనుకనే చైనా–పాకిస్తాన్ కారిడార్‌లో అఫ్ఘాన్‌ను కూడా చేర్చి విస్తృతపరచాలని ఇప్పటికే అది ప్రతిపాదించింది.
భారత్‌తో చేతులు కలపడం తన చిరకాల మిత్ర దేశానికి బాధ కలిగిస్తుందని అటు చైనాకు కూడా తెలుసు. కానీ ఆ విషయంలో దాని మాట వినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే అధికమని ఆ దేశం భావిస్తోంది. ఎందుకంటే ఆర్థికంగా మరింతగా ఎదగాలని కోరుకుంటున్న చైనాకు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న మన దేశాన్ని విస్మరించడం అంత సులభం కాదు. అలాగే పాకిస్తాన్‌తో తన మైత్రి బలపడేకొద్దీ భారత్ ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటుందని చైనాకు బాగా తెలుసు. ఇప్పటికే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మన దేశానికి అమెరికా ప్రాధాన్యమివ్వడం మొదలుపెట్టింది. అదే జరిగితే ముందూ మునుపూ ఆ ప్రాంతంలో భారత్ తనకు అవరోధంగా మారే అవకాశమున్నదని చైనాకు తెలుసు. ఈ రెండు కారణాలరీత్యా మన ప్రతిపాదనవైపే అది మొగ్గు చూపింది. వాస్తవానికి గత డిసెంబర్‌లో చైనా పాక్, అఫ్ఘాన్‌ల విదేశాంగ మంత్రులతో కలిసి త్రైపాక్షిక సమావేశం నిర్వహించింది. అందులో మనకు చోటీయలేదు. కానీ ఇప్పుడు చైనా అందుకు భిన్నమైన మార్గాన్ని అనుసరించడం దౌత్యపరంగా మనకు అనుకూలాంశం.
ప్రపంచం ఇప్పుడు అయోమయావస్థలో ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలు నిలకడగా ఉండటం లేదు. ఆయన ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు, సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి దిగారు. దానికి ప్రతిగా అటు చైనా సైతం వాణిజ్యంలో తాను చేయగలిగింది తాను చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో వైషమ్యాలను సాధ్యమైనంతవరకూ తగ్గించుకోవడం శ్రేయస్కరమని చైనా భావిస్తోంది. అలాగే ప్రస్తుత అనిశ్చితిలో తాను ఎదగడానికి అందివచ్చే దేన్నీ వదులుకోకూడదని అనుకుంటోంది. అందువల్లే ప్రస్తుత అనధికార శిఖరాగ్ర సమావేశానికి కీలక ప్రాధాన్యముంది. సరిహద్దు వివాదాలను, ఇతర విభేదాలను పక్కనబెట్టి వాణిజ్య రంగంలో పరస్పరం సహకరించుకోవాలని రాజీవ్‌గాంధీ హయాంలో 1988లో రెండు దేశాలూ అంగీకారానికొచ్చాయి. కానీ గత రెండేళ్లుగా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.
రాన్రాను పరిస్థితి దిగజారుతున్నదని, దీనికి ఎక్కడో అక్కడ ఫుల్‌స్టాప్ పడాలని ఇరు దేశాల నేతలూ భావించబట్టే ఇప్పుడీ సమావేశం జరిగింది. పద్ధతి ప్రకారం జరిగే శిఖరాగ్ర సమావేశాలకు చాలా లాంఛనాలుంటాయి. ఇరు దేశాల దౌత్యాధికారులు పలు సమావేశాలు జరిపి, నిర్దిష్టమైన ఎజెండా ఖరారు చేస్తారు. ఆమోదయో గ్యమైనవేవో, కానివేవో నిర్ణయించుకుంటారు. ఏ విషయంలో అంగీకారానికి రావాలన్న అవగాహనకొస్తారు. పర్యవసానంగా అధినేతల చర్చలు ఆ ఎజెండాకు పరిమితమవుతాయి. ప్రస్తుత సమావేశానికి అలాంటి ఎజెండాల జంజాటం లేదు. దేనిపైన అయినా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సంయుక్త ప్రకటన విడుదల లాంఛనం ఉండదు గనుక ఫలానా అంశంపై అవతలివారిని ఒప్పించాలన్న ఆత్రుత ఉండదు. ఇప్పుడు సమావేశం ముగిశాక అధినేతలిద్దరూ వేర్వేరుగా దానిపై తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందులో ఉగ్రవాద నిరోధంలో సహకరించుకోవడం, శాంతిపూర్వక చర్చల ద్వారా విభేదాల పరిష్కారం వగైరా స్థూల అంశాలున్నాయి తప్ప నిర్దిష్టత లేదు. అయినా ఈ తరహా సమావేశాలు అంతిమంగా మేలే చేస్తాయి.
మరో నెలన్నరలో చైనాలో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) అధినేతల సమావేశం జరగబోతోంది. దానికి ఎటూ నరేంద్రమోదీ హాజరవుతారు. ఆ సందర్భంగా ఇరువురు అధినేతలూ కలుస్తారు. అయినా ఈలోగానే ఒకసారి విడిగా కలుసుకుని అన్ని అంశాలపైనా మాట్లాడుకోవాలని నిర్ణయించడం మంచిదే. చైనా సహకారం లేనిదే మనకు అణు సరఫరాదార్ల బృందంలో సభ్యత్వం లభించదు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమైనా అంతే. అలాగే మనతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే ప్రపంచంలో చైనా ప్రతిష్ట పెరుగుతుంది. దాని స్థానం సుస్థిరమవుతుంది. ఇలాంటి సమావేశాలు మున్ముందు మరిన్ని జరిగితే అవి రెండు దేశాల ఎదుగుదలకూ దోహదపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment