జిన్‌పింగ్- మోదీ భాయీభాయీ! | india and China sign 3 pacts within hours of Xi Jinping's arrival to develop sister cities Ahmedabad and Guangzhou | Sakshi
Sakshi News home page

జిన్‌పింగ్- మోదీ భాయీభాయీ!

Published Thu, Sep 18 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

జిన్‌పింగ్- మోదీ భాయీభాయీ!

జిన్‌పింగ్- మోదీ భాయీభాయీ!

అహ్మదాబాద్: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భారత పర్యటన తొలి రోజున గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి చైనా అధ్యక్షుడు మూడు రోజుల భారత పర్యటనను ప్రారంభించారు. ఒక చైనా అధ్యక్షుడు గుజరాత్‌లో పర్యటించటం ఇదే తొలిసారి. జిన్‌పింగ్, ఆయన ప్రతినిధి బృందంతో కూడిన ఎయిర్ చైనా ప్రత్యేక విమానం బుధవారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే రాష్ట్ర అధికారులు రెడ్ కార్పెట్‌తో సాదరంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద చైనా అధ్యక్షుడికి పోలీసు వందనం సమర్పించడంతో పాటు, సంప్రదాయ గుజరాతీ నృత్యం ఏర్పాటు చేశారు. జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలుకుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో మండారిన్, గుజరాతీ, ఇంగ్లిష్ భాషల్లో భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు.

జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లకు హయత్ హోటల్ వద్ద ప్రధాని మోదీ పూలగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. చైనాలోని గ్వాంఘు్జ నగరాన్ని, గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని సోదరి నగరాలు (సిస్టర్ సిటీలు)గా అభివృద్ధి చేయడం; గుజరాత్‌లో చైనా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడం, చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్, గుజరాత్ మధ్య సాంస్కృతిక, సామాజిక సంబంధాల అభివృద్ధి - మొత్తం మూడు అంశాలపై చైనా-గుజరాత్‌ల మధ్య ఒప్పందాలు కుది రాయి. జిన్‌పింగ్, మోదీల సమక్షంలో ఆయా రాష్ట్రాలు, సంస్థల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. గుజరాత్ సీఎం ఆనందిపటేల్,  మంత్రివర్గ సహచరులు, రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, చైనా ప్రతినిధి బృందం  పాల్గొన్నారు.

మహాత్ముని ఆశ్రమం సందర్శన...

తొలిసారి గుజరాత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడిని.. అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం సందర్శనకు ప్రధాని మోదీ తీసుకెళ్లారు. ఆశ్రమం గేటు వద్ద జిన్‌పింగ్‌కు మోడీ ఖద్దరు దండలు వేసి స్వాగతం పలికారు. ఆయనకు ఖద్దరు జాకెట్ (పై కోటు)ను బహూకరించారు. చైనా అధ్యక్షుడు ఈ ఖద్దరు పై కోటును ధరించి ఆశ్రమంలో పర్యటించారు. ఆశ్రమం చారిత్రక ప్రాధాన్యతను ఆయనకు వివరించారు. మహాత్ముడి విగ్రహానికి జిన్‌పింగ్ నివాళులర్పించారు. గాంధీ వినియోగించిన వ్యక్తిగత గది ‘హృదయకుంజ్’ను సందర్శించిన చైనా అధ్యక్షుడు అక్కడ గాంధీ చిత్రపటానికి ఖద్దరు దండ వేసి నివాళులర్పించారు. చరఖాను తిప్పి నూలు వడికారు. గాంధీ ప్రబోధనలను మోదీ  వివరించారు. ఈ సందర్భంగా చైనా భాషలో రచించిన భగవద్గీత పుస్తకాన్ని జిన్‌పింగ్‌కు మోదీ బహూకరించారు. అలాగే గాంధీ పుస్తకాలు, గాంధీ వర్ణచిత్రంతో పాటు పలు మెమొంటోలను బహుమానాలుగా అందించారు. 1915లో దక్షిణాఫ్రికాలోని చైనా సంతతి ప్రజలు గాంధీకి ఇచ్చిన ధృవపత్రం నకలును కూడా జిన్‌పింగ్‌కు అందించారు.
 
సబర్మతీ తీరంలో సేదతీరిన దేశాధినేతలు..


ఆశ్రమంలో పర్యటన అనంతరం.. జిన్‌పింగ్ దంపతులను మోదీ సబర్మతి నదీ తీరానికి తీసుకెళ్లారు. రంగురంగుల దీపాలు, నీటి ఫౌంటైన్లతో వెలుగులీనుతున్న తీరంలో అతిథుల కోసం గుజరాతీ సంప్రదాయం, సంస్కృతులను ప్రతిబింబిస్తూ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు ఏశారు. వీటిలో గార్బా నృత్యం, జానపద నృతం, తబలా కచేరీ, తదితర కళారూపాలను ప్రదర్శించారు. జిన్‌పింగ్ దంపతులు సంప్రదాయబద్ధమైన మంచంపై ఆశీనులై ఈ కార్యక్రమాలను వీక్షించారు. జిన్‌పింగ్, మోదీలు ఈ సందర్భంగా కొంతసేపు ఊయలపై కూర్చున్నారు. ఇరువురు నేతలూ కొంత సేపు తీరంలో విహరిస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం జిన్‌పింగ్ దంపతులకు ప్రత్యేకంగా నిర్మించిన గుమ్మటాల్లో ప్రధాని రాత్రి విందు ఇచ్చారు. అతిథులకు గుజరాతీ శాకాహార వంటకాలను వడ్డించి అతిథ్యమిచ్చారు. ఇరువైపుల నుంచీ దేశాధ్యక్షులతో సహా 11 మంది చొప్పున ఈ విందులో పాల్గొన్నారు. జిన్‌పింగ్ వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో చైనా ప్రభుత్వ సలహాదారు యాంగ్ జేచి, విదేశాంగ మంత్రి వాంగ్ యి, వాణిజ్య మంత్రి గావో హుచెంగ్, పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర నేతలు ఉన్నారు. అనంతరం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

వివాదాల మధ్య సుహృద్భావ పర్యటన...

భారత్‌లో పర్యటిస్తున్న మూడో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. అంతకుముందు 1996లో జియాంగ్‌జెమిన్, 2006లో హుజింటావో భారత పర్యటనకు వచ్చారు. చైనా - భారత్‌ల మధ్య సరికొత్త సరిహద్దు వివాదం తలెత్తిన పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడి భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లడఖ్ ప్రాంతంలో సాగునీటి కాల్వ పనులపై నిరసన వ్యక్తం చేస్తూ చైనా సంచార ప్రజలు కొందరు తమ దేశ సైనిక బలగాల సాయంతో లడఖ్‌లోని డేమ్‌చాక్ ప్రాంతంలో భారత భూభాగంలో శిబిరాలు వేసుకుని ఉండటం ఈ వివాదానికి దారితీసింది. అహ్మదాబాద్‌లో కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడుకున్న మోదీ, జిన్‌పింగ్ గురువారం ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరపనున్నారు.  
 
భారీ పెట్టుబడులకు అవకాశం...


ఆర్థిక, వాణిజ్య రంగాలపై కేంద్రీకరించిన జింగ్‌పింగ్.. భారతీయ రైల్వేల ఆధునీకరణ, పారిశ్రామిక పార్కుల స్థాపన, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 3,000 కోట్ల డాలర్ల వరకూ  పెట్టుబడులను ప్రకటించే అవకాశముందని అధికార వర్గాల సమాచారం.
 
‘టిబెట్’పై చర్చించండి: ప్రధానికి టిబెట్ సంస్థల విజ్ఞప్తి
 
ధర్మశాల: చైనా అధ్యక్షుడి భారత పర్యటన నేపధ్యంలో ఆయనతో భేటీ సందర్భంగా టిబెట్ అంశంపై చర్చించాలని ధర్మశాలలోని టిబెట్ సంస్థలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశాయి. ‘‘చైనా అధ్యక్షుడి భారత పర్యటనలో భారత ప్రజాస్వామ్యపు సౌందర్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, అది ఎలా పనిచేస్తుందనేదాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాం. చాలా భాషలు, చాలా జాతులు భారత్‌లో సుహృద్భావంగా మనగలగటానికి కారణం స్వేచ్ఛ అనేది పునాదిగా ఉండటమే. అదే భారత్‌ను సమైక్యంగా ఉంచుతోంది. భారత పునాది భయం కాదు’’ అని ప్రవాసంలోని టిబెట్ ప్రధానమంత్రి లోబ్సాంగ్‌సాంగే బుధవారం ధర్మశాలలో మీడియాతో వ్యాఖ్యానించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement