సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పతంగుల హడావుడి మొదలైపోతుంది. తలెత్తి పైకి చూస్తే చాలు.. ఆకాశం రంగులు అద్దుకుందా అన్నట్టుగా మెరిసిపోతుంది. చిన్నా పెద్దా తేడా లేదు.. గల్లీల్లో, ఇళ్లపై, మైదానాల్లో ఎక్కడ చూసినా గాలిపటాలు ఎగరేస్తూనే కనిపిస్తారు. ఇలా మన దగ్గరే కాదు..ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ‘పతంగుల పండుగ’లు జరుగుతూనే ఉంటాయి. కొన్ని దేశాల్లో వారి సాంప్రదాయాలకు, ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా.. మరికొన్ని దేశాల్లో సరదాగా గాలిపటాలు ఎగరేస్తుంటారు. మరి పతంగుల ప్రత్యేకతలు, ఆ పండుగల విశేషాలు తెలుసుకుందామా..
– సాక్షి సెంట్రల్ డెస్క్
ధనికుల ఆట నుంచి..పిల్లల చేతిలోకి..
ఇప్పుడంటే చిన్న పిల్లలు కూడా గాలిపటాలు, దారాలు కొనుక్కుని ఎగరేస్తున్నారుగానీ.. ఒకప్పుడు పతంగులు అంటే రాజులు, బాగా డబ్బున్నవారి ఆట అని చరిత్రకారులు చెప్తున్నారు. తర్వాత మెల్లగా సాధారణ ప్రజలకు కూడా చేరిందని అంటున్నారు.
గాలిపటాలు ఎగరేయడమన్నది మొదట చైనాలో మొదలైంది. సుమారు వెయ్యేళ్ల కింద కొరియా మీదుగా భారత్‌కు, ఇతర దేశాలకు విస్తరించింది. పురాతత్వ ఆధారాల ప్రకారం.. చైనాకు చెందిన బౌద్ధ భిక్షువులు పట్టువస్త్రాలు, వెదురుపుల్లలతో తయారు చేసిన గాలిపటాలు ఎగురవేసేవారు. దైవాన్ని ప్రార్థిస్తూ వాటిలో సందేశాలు పెట్టేవారు. ఇక మన దేశంలో 500 ఏళ్ల కింద మొఘల్ పాలన సమయంలోనే పతంగులు ఎగరేసినట్టుగా పెయింటింగ్‌లు ఉన్నాయి.
‘కై పో చే’
గాలిపటాలు ఎగరేయడమే కాదు.. మన గాలిపటంతో అవతలివారి గాలిపటాలను తెంపేయడమూ ఈ ఆటలో భాగమే. అలా మనకు దగ్గరిలోని ఒక్కో గాలిపటాన్ని తెంపేస్తూ.. ఆ విజయ సంకేతంగా వెంటనే గట్టిగా కేకలు వేస్తుంటారు. గుజరాత్ ‘ఉత్తరాయణ్’ ఫెస్టివల్‌లో ఇలా వేరేవారి గాలిపటాలను తెంపేయగానే ‘కై పో చే (నేను తెంపేశానోచ్)’ అని బిగ్గరగా అరవడం అనేది పాపులర్.
ఏయే దేశాల్లో ఎలా?
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వేర్వేరు సందర్భాల్లో గాలిపటాలను ఎగురవేస్తారు. మనదేశంతోపాటు చైనా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇండోనేíసియా, వియత్నాంలో సాంప్రదాయంగా, పండుగల సమయంలో ప్రత్యేక ఆటగా భావిస్తారు. జపాన్‌లో మేలో జరిగే పిల్లల పండుగలో.. బ్రెజిల్, కొలంబియాల్లో కొత్త సంవత్సర సెలవుల్లో.. చిలీలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గయానాలో ఈస్టర్ సమయంలో పతంగులను ఎగురవేస్తారు.
►గాలిపటాలకు జన్మస్థానంగా భావించే చైనాలో జరిగే పతంగుల పండుగ ‘వీఫాంగ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ గాలిపటం ఏదైనా సరే.. చైనా ఆధ్యాత్మిక చిహ్నమైన డ్రాగన్‌గానీ, దాని ఆనవాళ్లుగానీ తప్పనిసరిగా ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గాలిపటాల మ్యూజియం వీఫాంగ్‌లోనే ఉంది.
►ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బొండి బీచ్‌లో ‘ఫెస్టివల్ ఆఫ్ ది విండ్స్’ పేరిట గాలిపటాల పండుగ నిర్వహిస్తారు. అక్కడ వేసవికాలం ప్రారంభానికి సూచికగా ఏటా సెప్టెంబర్‌లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రపంచంలోని పెద్ద పతంగుల పండుగల్లో ఇది ఒకటి.
►‘బ్లాసమ్ కైట్ ఫెస్టివల్’ పేరిట అమెరికాలోని వాషింగ్టన్ లాంగ్ బీచ్‌లో అతిపెద్ద కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. 55 ఏళ్లుగా ఏటా ఏప్రిల్ చివరిలో నిర్వహిస్తున్న ఈ పతంగుల పండుగకు.. ప్రతిసారీ ఒక థీమ్‌ను ఎన్నుకుంటారు.
►అత్యంత చిత్రమైన ఆకారాలు, డిజైన్లతో పతంగులు ఎగరేసే పండుగ ఫ్రాన్స్‌లోని ‘డిప్పె కైట్ ఫెస్టివల్’. డిప్పే పట్టణంలో సముద్రతీరాన రెండేళ్లకోసారి ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
►జపాన్‌లో సంప్రదాయంగా జరిగే పతంగుల పండుగ ‘హమమట్సు కైట్ ఫెస్టివల్’. 16వ శతాబ్దం నుంచి జరుగుతున్న ఈ ఫెస్టివల్‌లో ఎగరేసే పతంగులన్నీ చతురస్రాకారంలోనే ఉంటాయి. వేరే ఆకారాలను ఎగరవేయరు.
►వీటితోపాటు బ్రిటన్‌లో పోర్ట్స్‌మౌత్ ఫెస్టివల్, దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్ ఫెస్టివల్, ఇటలీలో సెర్వియా ఫెస్టివల్ వంటివి కూడా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాయి.
గుజరాత్‌లో ‘ఉత్తరాయణ్’గా..
మన దేశంలో హైదరాబాద్ సహా చాలాచోట్ల పతంగుల పండుగలు జరుగుతాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1989 నుంచి జరుగుతున్న ‘ఉత్తరాయణ్–ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టి వల్’ దేశంలోనే పెద్దది. సంక్రాంతి సమయంలో జరిగే ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా దేశాల నుంచి గాలిపటాలు ఎగరేసే వారు, పర్యాటకులు వస్తుంటారు. మొత్తంగా ఇరవై లక్షల మంది వరకు ఈ ఫెస్టివల్‌కు హాజరవుతారని అంచనా.
►గ్వాటెమాలాలో ఏటా నవంబర్‌లో జరిగే ‘బారిలెట్ ఫెస్టివల్’ చాలా విశిష్టమైనది. గుండ్రంగా ఉండే ప్రత్యేకమైన పతంగులు, వాటికి పెట్టే తోకలపై.. స్థానికులు తమ సందేశాలను రాసి ఎగురవేస్తారు. చనిపోయిన తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆ పతంగులపై సందేశాలను చదువుకుంటారని భావిస్తారు. మాయన్ నాగరికత కాలం నుంచీ ఈ సాంప్రదాయం ఉందని చెప్తారు.
►మనకు జీవితాన్నిచ్చిన దేవతలకు కృతజ్ఞతలు చెప్తూ పతంగులు ఎగరేసే సాంప్రదాయం ఇండోనేíసియాలో ఉంది. అక్కడి బాలి ద్వీపంలోని సనూర్ బీచ్‌లో ఏటా జూలైలో ‘బాలి కైట్ ఫెస్టివల్’ జరుగుతుంది. బాలి ప్రాంతంలో హిందూ జనాభా ఎక్కువ. దాంతో అక్కడ ఎగరేసే గాలిపటాల్లో హిందూ దేవతల చిత్రాలు కనిపిస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment