న్యూఢిల్లీ: చైనా దుష్ట పన్నాగాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి సుదీర్ఘ కాలం తన సైన్యం పీఎల్‌ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) మకాం వేసేందుకు వీలుగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వీటిలో తిష్ట వేసి ఉండే బలగాలు అవసరమైన పరిస్థితుల్లో తక్షణమే ఎల్‌ఏసీ వద్దకు చేరుకునేందుకు వీలవుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కాంక్రీట్ నిర్మాణాలను తాము చూసినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఉత్తర సిక్కింలోని ‘నకు లా’కు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఇటువంటి కాంక్రీట్ క్యాంప్ ఒకటి ఉందని పేర్కొన్నాయి.
ఇలాంటి నిర్మాణాలే, భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్, తూర్పులద్దాఖ్ సమీపంలోనూ ఉన్నాయని సైనిక వర్గాలు వివరించాయి. కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రహదారులను కూడా చైనా మెరుగుపర్చిందనీ, దీనివల్ల ఎల్‌ఏసీ వెంట తలెత్తే ఎటువంటి పరిస్థితుల్లోనైనా వేగంగా స్పందించేందుకు పీఎల్‌ఏకు అవకాశం ఏర్పడుతుందన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన ఈ నిర్మాణాల కారణంగా డ్రాగన్ సైన్యం భారత భూభాగం వైపు వేగంగా కదిలే గణనీయంగా సామర్థ్యం మెరుగైందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
సరిహద్దు కొండ ప్రాంతాల్లోని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించే బలగాల్లో 90 శాతం వరకు అతిశీతల పరిస్థితుల కారణంగా చైనా వెంటవెంటనే మార్చాల్సి వస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, అదనపు భద్రత హంగులు సమకూర్చిన కాంక్రీట్ నిర్మాణాలతో ఆ అవసరం తప్పుతుందని అంటున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి, అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని సైనిక వర్గాలు చెప్పాయి. గత ఏడాది నుంచి ఎల్‌ఏసీ వెంట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారత, చైనా బలగాలు సిక్కింలోని నకు లా ప్రాంతంతోపాటు తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో బాహాబాహీ తలపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment