భారత్‌తో యుద్ధంలో మీకే మద్దతు: చైనా!
- పాక్ మీడియా కథనాలు.. సమర్థించని చైనా
న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు చైనా అండగా నిలబడుతుందని వచ్చిన వార్తలపై స్పందించడానికి ఆ దేశం మరోసారి నిరాకరించింది. ’ఒకవేళ విదేశీ దాడి జరిగితే, మా దేశం పాకిస్థాన్‌కు పూర్తిగా మద్దతునిస్తుంది’ అని లాహోర్‌లోని చైనా రాయబారి యు బోరెన్ పేర్కొన్నట్టు పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రచురించింది.
’కశ్మీర్ విషయంలో మేం ఇప్పుడు, భవిష్యత్తులోనూ పాకిస్థాన్‌కు అండగా ఉంటాం. భారత ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లోని నిరాయుధలైన కశ్మీరీలపై అరాచకాలకు పాల్పడటం సరికాదు. కశ్మీర్ సమస్యను అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు పరిష్కరించాలి’ అని యు బోరెన్ పేర్కొన్నట్టు పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఈ కథనాలపై స్పందించడానికిగానీ, వీటిని సమర్థించడానికిగానీ చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు. బీజింగ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ’ మీరు ప్రస్తావించిన విషయం గురించి నాకు తెలియదు. సంబంధిత విషయం మీద చైనా వైఖరి సుస్పష్టంగా, స్థిరంగా ఉంది’ అని పేర్కొన్నారు. ’కశ్మీర్ అంశాన్ని చాలాకాలంగా నలుగుతున్న అంశంగా మేం భావిస్తున్నాం. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరుపక్షాలు దీనిని శాంతియుతంగా పరిష్కరించుకుంటారని మేం భావిస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలోనూ పాకిస్థాన్ మీడియా కథనాలను సమర్థించడానికి చైనా ఒప్పుకోలేదు. కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్‌కు తాము మద్దతుగా ఉంటామని న్యూయార్క్‌లో నవాజ్ షరీఫ్‌తో భేటీ సందర్భంగా చైనా ప్రధాని లీ కెకియాంగ్ పేర్కొన్నట్టు డాన్ పత్రిక ప్రచురించింది. ఈ కథనాన్ని చైనా సమర్థించలేదు.