Indo Pak tension
-
అరేబియా జలాల్లో నేవీ హై అలర్ట్
న్యూఢిల్లీ: పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత నావికా దళం అప్రమత్తమైంది. పాకిస్తాన్ పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు అణు జలాంతర్గాములు సహా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో కూడిన భారీ ఆయుధ సంపత్తిని ఉత్తర అరేబియా సముద్ర జలాల్లో మోహరించింది. పుల్వామా దాడి సమయంలో ట్రాపెక్స్–2019 పేరుతో నేవీ భారీ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో యుద్ధ వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అణు జలాంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ చక్రం, 60 యుద్ధ నౌకలు, 12 తీరరక్షక ఓడలు, 60 యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఈ మొత్తం ఆయుధ సంపత్తిని రక్షణ శాఖ పాక్‌తో సరిహద్దు జలాల్లోకి తరలించి యుద్ధ సన్నద్ధతను ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఈ బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయని నేవీ ప్రతినిధి తెలిపారు. -
ఇండో-పాక్ ఉద్రిక్తత : పెద్దన్న సంప్రదింపులు
వాషింగ్టన్ : భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలతో వియత్నాంలో గత వారం జరిగిన హనోయ్ సదస్సు వేదికగా అమెరికా సంప్రదింపులు జరిపింది. భారత్, పాకిస్తాన్ ప్రతినిధులతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రైవేట్ దౌత్య చర్చలు సాగించినట్టు వెల్లడైంది. చర్చల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పాల్గొన్నారు. భారత్, పాకిస్తాన్లతో పాంపియో నేరుగా దౌత్య సంప్రదింపులు జరిపి, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేలా కీలకంగా వ్యవహరించారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రాబర్ట్ పలాడినో తెలిపారు. ఇరు దేశాల నాయకులతో పాంపియో చర్చలు జరిపారని పేర్కొన్నారు. మరోవైపు భారత గగనతలంపై పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని ఉపయోగించడం పట్ల ట్రంప్ యంత్రాగం తీవ్రంగా పరిశీలిస్తోందని, ఈ విమానాల వాడకం పరిమితిపై విక్రయ ఒప్పందంలో పొందుపరిచిన నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీస్తోందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా, ఎఫ్ 16 విమానాలను పాక్ ప్రయోగించడంపై నివేదికలను తాము తీవ్రంగా పరిశీలిస్తున్నామని రాబర్ట్ స్పష్టం చేశారు. కాగా పుల్వామాలో జైషే ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో భారత్ పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడంతో భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. -
సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌కు బ్రేకు
లాహోర్/న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. తొలుత ఈ రైల్వే సేవలను నిలిపేస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకోగా, ఆ తర్వాత భారత్ కూడా సంఝౌతాను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ వెల్లడించగా, రైలులో ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఢిల్లీ నుంచి పాక్‌కు వెళ్లేందుకు భారత్ నుంచి వెళ్లే రైలులో 27 మంది ప్రయాణికులు గురువారమే సరిహద్దు వద్ద ఉన్న భారత్‌లోని అట్టారీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కానీ పాకిస్తాన్ నుంచి రావాల్సిన రైలును ఆ దేశ అధికారులు నిలిపేశారు. దీంతో 27 మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకున్నారు. రెండు రైళ్ల సేవలు నిలిచిపోవడంతో అట్టారీ స్టేషన్ వద్ద ఇరు దేశాలకు చెందిన దాదాపు 40 మంది చిక్కుకుపోయారని సమాచారం. సిమ్లా ఒప్పందంతో.. 1971లో భారత్–పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు 1976 జూలై 22న ప్రారంభమయ్యాయి. పాక్‌లోని లాహోర్ నుంచి ప్రతి సోమవారం, గురువారం బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు కూడా అట్టారీ స్టేషన్ వరకు వెళ్తాయి. లాహోర్ స్టేషన్లో రోదిస్తున్న భారత ప్రయాణికురాలు -
సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రద్దు : ఇండియన్ రైల్వేస్
న్యూఢిల్లీ : భారత్, పాక్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వేశాఖ ప్రకటించింది. మార్చి 4 నుంచి ఈ రైలును రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పుల్వామా ఉగ్ర దాడి - మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కూడా ఢిల్లీ - అతారీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును షెడ్యూల్ ప్రకారమే నడుపుతామని రైల్వే అధికారి ఒకరు నిన్న ప్రకటించారు. ఇలా ప్రకటించి 24 గంటల కూడా గడవకముందే ఆ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా పాక్ సంఝౌతా సేవలను ఇప్పటికే నిలిపివేసింది. ఫలితంగా పాక్ నుంచి అటారికి రావాల్సిన ప్రయాణికులు లాహోర్ రైల్వేస్టేషన్లోనే ఆగిపోయారు. వాళ్లని వేరే మార్గాల ద్వారా అటారి సరిహద్దుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ వారంలో రెండు రోజులు(బుధ, ఆదివారాలు) నడుస్తుంది. ఢిల్లీ నుంచి బయలుదేరి అటారీలో ప్రయాణికులను దించుతుంది. ఆ తరువాత ప్రయాణికులు వాఘాలో ఇదే పేరుతో నడిపే మరో రైలులోకి మారాల్సి ఉంటుంది. అయితే సంఝౌతా పేరు వెనక చిన్న హిస్టరీ ఉంది. 1971లో ఇండో - పాక్ మధ్య ప్రారంభమైన యుద్ధం సిమ్లా ఒప్పందతో ముగిసింది. ఈ ఒప్పందానికి చిహ్నంగా ఇరు దేశాల మధ్య1976 జూలై 22 నుంచి సంఝౌతా రైలు సర్వీస్ ప్రారంభమయ్యింది. సంఝౌతా అంటే ‘ఒప్పందం’ అని అర్థం. -
యుద్ధానికి పాక్ సన్నాహాలు
ఇస్లామాబాద్ : ఇండో-పాక్ సరిహద్దులో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత మెరుపుదాడులపై తీవ్ర అసహనంతో ఊగిపోతున్న పాక్ ప్రతిదాడులకు సిద్ధమని పేర్కొనడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతల గాంభీర్య ప్రకటనలకు తోడు అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సేనలు, ట్యాంక్‌లు మోహరించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో పదిమంది జవాన్లు గాయపడ్డారు. పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. భారత సేనలు ప్రతిఘటించడంతో పాక్ వైపు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. మంజికోట్,పూంచ్, నౌషెరా, రాజోరి, అఖ్నూర్, సియోల్‌కోట్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా దీటుగా ప్రతిస్పందించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. -
భారత్‌తో యుద్ధంలో మీకే మద్దతు: చైనా!
పాక్ మీడియా కథనాలు.. సమర్థించని చైనా న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు చైనా అండగా నిలబడుతుందని వచ్చిన వార్తలపై స్పందించడానికి ఆ దేశం మరోసారి నిరాకరించింది. ’ఒకవేళ విదేశీ దాడి జరిగితే, మా దేశం పాకిస్థాన్‌కు పూర్తిగా మద్దతునిస్తుంది’ అని లాహోర్‌లోని చైనా రాయబారి యు బోరెన్ పేర్కొన్నట్టు పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రచురించింది. ’కశ్మీర్ విషయంలో మేం ఇప్పుడు, భవిష్యత్తులోనూ పాకిస్థాన్‌కు అండగా ఉంటాం. భారత ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లోని నిరాయుధలైన కశ్మీరీలపై అరాచకాలకు పాల్పడటం సరికాదు. కశ్మీర్ సమస్యను అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు పరిష్కరించాలి’ అని యు బోరెన్ పేర్కొన్నట్టు పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ కథనాలపై స్పందించడానికిగానీ, వీటిని సమర్థించడానికిగానీ చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు. బీజింగ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ’ మీరు ప్రస్తావించిన విషయం గురించి నాకు తెలియదు. సంబంధిత విషయం మీద చైనా వైఖరి సుస్పష్టంగా, స్థిరంగా ఉంది’ అని పేర్కొన్నారు. ’కశ్మీర్ అంశాన్ని చాలాకాలంగా నలుగుతున్న అంశంగా మేం భావిస్తున్నాం. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరుపక్షాలు దీనిని శాంతియుతంగా పరిష్కరించుకుంటారని మేం భావిస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలోనూ పాకిస్థాన్ మీడియా కథనాలను సమర్థించడానికి చైనా ఒప్పుకోలేదు. కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్‌కు తాము మద్దతుగా ఉంటామని న్యూయార్క్‌లో నవాజ్ షరీఫ్‌తో భేటీ సందర్భంగా చైనా ప్రధాని లీ కెకియాంగ్ పేర్కొన్నట్టు డాన్ పత్రిక ప్రచురించింది. ఈ కథనాన్ని చైనా సమర్థించలేదు.