నకిలీ విత్తనాలపై సమగ్ర నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ మిరప విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినందున దానిపై సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ వ్యవసాయ శాఖను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాలతో వేలాది మంది రైతన్నలు నష్టపోయారని గత ఆదివారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎస్ పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక పంపించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథిని ఆదేశించినట్లు తెలిసింది.
నకిలీ మిరప విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా, ‘సాక్షి’ కథనం నేపథ్యంలో నకిలీ విత్తన కంపెనీలపై అధికారులు దాడులు చేస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో అనేక కంపెనీల యజమానులు ఆఫీసులను మూసేసి పరారీలో ఉన్నారు.
డీఎన్‌ఏ పరీక్షలతో నాణ్యత గుర్తింపు..
ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మిరప విత్తనాల కల్తీపై విచారణకు ఏర్పాటైన రాష్ట్రస్థాయి శాస్త్రవేత్తలు, అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించి తాము రూపొందించిన నివేదికను మంగళవారం వ్యవసాయ కార్యదర్శి పార్థసారథికి అందజేసింది. ఈ సందర్భంగా భారత విత్తన చట్టంలో కల్తీ జరిగితే పరిహారం ఇచ్చే అంశం లేదని వారు ఆయన దృష్టికి తెచ్చారు.
ఆ మేరకు రాష్ట్రంలో చట్టాన్ని రూపొందిం చాలని కోరారు. అలాగే నర్సరీ చట్టాన్ని ఏపీ నుంచి అడాప్ట్ చేసుకోవాలని.. కూరగాయలను ఆ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. విత్తనాలను రైతులకు ఇచ్చేప్పుడు వాటి నాణ్యతను మండలస్థాయి ఏవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, దీనికి ఎక్కువ సమయం పడుతున్నందున లేబొరేటరీలోనే డీఎన్‌ఏ పరీక్ష జరిపి నిర్ధారణ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లకు రూ. 10 కోట్ల జరిమానా.. పదేళ్ల జైలుశిక్ష పడేలా కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు.
మిరప విత్తనాలను హైబ్రీడ్‌వి కాకుండా సూటి(దేశీయ) రకాలను రైతులకు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఈ సిఫారసులపై వెంటనే కార్యాచరణ చేపడతామని పార్థసారథి తెలిపారు. ఈ ఏడాదే విత్తన చట్టాన్ని రూపొందించేలా అధికారులతో మా ట్లాడుతానని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. పార్థసారథిని శాస్త్రవేత్తలు సైదయ్య తదితరులు కలిశారు.