లెక్క తేలింది! | Bhudan land Calculation Found | Sakshi
Sakshi News home page

లెక్క తేలింది!

Published Wed, Jul 15 2015 11:03 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

లెక్క తేలింది! - Sakshi

లెక్క తేలింది!

- 1,923 ఎకరాలు పరాధీనం
భూదాన్ పెద్దలే అక్రమార్కులు చేతులు మారిన  పేదల భూములు రూ.కోట్లు విలువ చేసే భూమి ఆక్రమణ ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
భూదాన్ భూముల లెక్క తేలింది. అన్యాక్రాంతమైన భూముల చిట్టాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో భూముల వినియోగంపై రూపొందించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇటీవల శాసనసభా కమిటీ భూదాన్ యజ్ఞబోర్డు భూముల ధారాదత్తంపై లోతుగా చర్చించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జిల్లాలో పరాధీనమైన భూముల వివరాలను కూడా సేకరించిన రెవెన్యూ యంత్రాంగం.. ఆక్రమణల జాబితాను కూడా తయారు చేసింది. అయితే.. భూదాన్ బోర్డు లెక్కలకు, రెవెన్యూ రికార్డులకు భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పట్లో భూములను దానం చేస్తున్నామని ప్రకటించినప్పటికీ, చాలా చోట్ల ఆ భూములు బోర్డు స్వాధీనంలోకి రాలేదని, కొన్నిచోట్ల ఇప్పటికీ ఆయా కుటుంబాల పొజిషన్‌లోనే అవి ఉన్నట్లు యంత్రాంగం తేల్చింది. దీంతో 2,673 ఎకరాల మేర తేడా వచ్చింది. భూదాన్‌బోర్డు లెక్కల మేరకు 13693.25 ఎకరాలుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 11020.23 ఎకరాలుగా తేలింది. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం కూడా విస్తీర్ణంలో పొంతన కుదరకపోవడానికి కారణంగా కనిపిస్తోంది.
 
క్షేత్రస్థాయిలో సర్వే..
భూదాన్ బోర్డు పాలకవర్గం పాపాల పుట్టను తవ్విన సర్కారు... చేతులు మారిన భూముల చిట్టాను తయారు చేసింది. పాలకవర్గం ముసుగులో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చింది. క్షేత్రస్థాయిలో 10717.34 ఎకరాలున్నట్లు తేల్చిన అధికారులు.. దీంట్లో 6625.08 ఎకరాలు భూమిలేని పేదలకు అసైన్డ్ చే యగా, మిగతా దాంట్లో చాలావరకు పరాధీనమైనట్లు సర్వేలో గుర్తించింది. ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు భూదానోద్యమంలో దాతలు విరివిగా భూ వితరణ చేశారు. వీటిని నిరుపేదలకు పంపిణీ చేయకుండా.. భూములను కాపాడాల్సిన యజ్ఞ బోర్డే కంచే చేను మేసిన ట్లు కొల్లగొట్టింది. అసైన్డ్‌దారుల  సాగుబడిలో 4395.18 ఎకరాలుండగా, 1049.24 ఎకరాలు ఇతరులకు అసైన్ చేశారు. కాగా, మిగతాదాంట్లో 1923.13 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తేలింది.
 
రూ.కోట్ల భూములకు ఎసరు!

పేదలకు జీవనోపాధి కల్పించాలనే సదుద్దేశంతో దానం చేసిన భూములు ల్యాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయాయి. భూదాన్ బోర్డే రియల్టర్ అవతారమెత్తడంతో రూ.కోట్ల విలువైన భూములకు రెక్కలొచ్చాయి. శివార్లలో విలువైన భూముల్లో ఆక్రమణలు వెలిశాయి. మరీ ముఖ్యంగా సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 1015.23 ఎకరాలు పరాధీనమయ్యాయి.

దీంట్లో కాలేజీలు, ఫాంహౌస్‌లు, గోడౌన్లు, లే అవుట్లు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. బోర్డు సభ్యులు కొందరు సొంత ప్రయోజనాలకు భూములను మళ్లించుకున్నారు. బ డాబాబులు సైతం భూదాన్ భూములపై కన్నేయడం కూడా భూములు కరిగిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా దాదాపు 400 ఎకరాల పైచిలుకు భూములపై న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవడం సర్కారుకు తలనొప్పిగా మారింది. ఇటీవల భూదాన్ బోర్డును రద్దు చేసి... రికార్డులను స్వాధీనం చేసుకున్నప్పటికీ.. అన్యాక్రాంతమైన భూముల విషయంలో మాత్రం ముందడుగు వేయలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement