జోనల్ రద్దుకు ‘రూట్ మ్యాప్’
► విధివిధానాలపై నివేదిక
► సీఎస్‌కు ప్రభుత్వ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జోనల్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, దానికి సంబంధించి విధివిధానాలు రూపొందించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. పలు స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు, చర్చలు జరిపి సమగ్ర నివేదిక రూపొందించాలని పేర్కొంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం మూడంచెల విధానం అమల్లో ఉంది. రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిల్లో పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియ జరుగుతోంది. దీన్ని రద్దు చేసి రెండంచెల విధానమే ఉండేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్వర్యంలో ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.
అందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విధివిధానాలు, మార్గదర్శకాలపై నివేదికను సిద్ధం చేసే బాధ్యతలను సీఎస్‌కు అప్పగిస్తూ సాధారణ పరిపాలన విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1975లో ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్, రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్ అమల్లోకి వచ్చింది. తెలం గాణలోనూ ఇప్పటికీ ఈ ఉత్తర్వులే అమల్లో ఉన్నాయి.
పాలనా సౌలభ్యం తదితరాల కోసం పది జిల్లాల తెలం గాణను 31 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించారు. రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా కొత్తగా ఏర్పడ్డాయి. దాంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడమో, లేక కొత్త ఉత్తర్వులను అమల్లోకి తేవడమో అవసరమని తాజా జీవోలో ప్రభుత్వం పేర్కొంది. జిల్లా, రాష్ట్ర స్థాయితో రెండంచెల విధానం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత రాష్ట్ర, జోనల్, జిల్లా పోస్టులను తదనుగుణంగా పునర్విభ జించాలని, ప్రజాప్రయోజనాలు, పాలనా అవసరాలకు తగ్గట్టుగా ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది.