
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. శ్రీనివాసరావు మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఇటీవల ఆయన భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో శ్రీనివాసరావు తన సోదరి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అనకాపల్లి సమీపంలోని రేబాక వద్ద నివాసముంటున్న శ్రీనివాసరావు రాత్రి షిఫ్ట్‌లో డ్యూటీకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి)
ప్రమాదం జరిగిన సమయంలో అతని కోసం తోటి ఉద్యోగులు గాలించగా కనిపించలేదని చెప్పారు. మంగళవారం ఉదయం శిథిలాల మధ్య కనిపించిన మృతదేహాన్ని పరిశీలించగా అది శ్రీనివాసరావుదిగా ఉద్యోగులు గుర్తించారని భోరుమన్నారు. తండ్రి మృతితో అతని ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. శ్రీనివాసరావు తల్లి (80) కూడా ఆధారాన్ని కోల్పోయినట్టయింది. కంపెనీలో ఉద్యోగానికి వెళ్లిన తన సోదరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని శ్రీనివాసరావు సోదరి కన్నీరు మున్నీరైంది. (విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment