
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. మిగతా కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయంవరకల్లా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వెల్లడించారు.
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు తగిన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. పరవాడ ఫార్మా కంపెనీ లో ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రాథమిక విచారణ నివేదిక అనంతరం ప్రమాద కారణాలు తెలుస్తాయని చెప్పారు.
ప్రమాద ఘటనపై హోంమంత్రి ఆరా
సాక్షి, గుంటూరు: విశాఖపట్నం ఫార్మాసిటీలో జరిగిన పేలుడు ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోంమంత్రి సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, విశాఖ ఆర్డీవో కిషోర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
(విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment