ప్రమాద స్థలంలో ఎగసి పడుతున్న మంటలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు (సీఈటీపీ) సాల్వెంట్ పరిశ్రమలో సోమవారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయని, మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్ ఆర్‌కే మీనా తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖ సాల్వెంట్ కంపెనీ ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసి తిరిగి ఫార్మా కంపెనీలకు విక్రయిస్తుంటుంది. వ్యర్థాలను శుద్ధి చేసే క్రమంలో కంపెనీలో ఉన్న ఐదు కాలమ్‌లలో ఒక కాలమ్‌లో పేలుడు జరిగి, మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో కెమిస్టులు మల్లేష్ (42), మనోజ్, శ్రీనివాస్, సెక్యూరిటీ గార్డు చిన్నారావు మాత్రమే లోపల ఉన్నారు.
పేలుడుకు మల్లేష్‌కు గాయాలయ్యాయి. మిగతా వారంతా సురక్షితంగా బయటకు వచ్చేశారు. మల్లేష్‌ను గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకుంది. అదే సమయంలో కుండపోత వర్షం కురవడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందలేదు. అగ్నిమాపక శాఖకు చెందిన 5 ఫైర్ ఇంజన్లు, రాంకీ కంపెనీకి చెందిన మూడు ఫైరింజన్లు రెండున్నర గంటల్లో మంటలను అదుపు చేశాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, విశాఖ ఆర్డీవో కిషోర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment