ఫార్మా సిటీ.. వెరీ పిటీ | There Is No Funds To Pharma City From Central Govt | Sakshi
Sakshi News home page

ఫార్మా సిటీ.. వెరీ పిటీ

Published Sat, May 11 2019 1:54 AM | Last Updated on Sat, May 11 2019 1:54 AM

There Is No Funds To Pharma City From Central Govt - Sakshi

జడ్చర్లలో ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూములు

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు హైదరాబాద్‌ సమీపంలోని 18,304 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తొలి సమీకృత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) పరిధిలో ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ‘హైదరాబాద్‌ ఫార్మా సిటీ లిమిటెడ్‌’పేరిట స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాలు పూర్తి చేసి.. 2019 నాటికి ఔత్సాహిక ఫార్మా సంస్థలకు భూ కేటాయింపులు, అనుమతులు ఇచ్చేలా టీఎస్‌ఐఐసీ షెడ్యూలు రూపొందించింది. తొలి విడతలో 9,212 ఎకరాలకు గాను 6,719 ఎకరాలను సేకరించగా, మిగతా భూమిని సేకరించడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టింది. తొలి విడత భూ సేకరణకు హడ్కో ద్వారా టీఎస్‌ఐఐసీ రూ.725 కోట్లు రుణం తీసుకోవడంతో పాటు, ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల కోసం ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ)కు ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్‌ (జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి) హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం (డిప్‌) 2017 ఏప్రిల్‌లో సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 

నయా పైసా విదల్చని ‘డిప్‌’
హైదరాబాద్‌ ఫార్మాసిటీకి నిమ్జ్‌ హోదా దక్కడంతో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం ‘డిప్‌’కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు నాటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ వినతిపత్రం కూడా ఇచ్చారు. తొలి విడతలో రూ.1,500 కోట్లు విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినా, రెండేళ్లుగా ఫార్మా సిటీకి కేంద్రం నుంచి నయాపైసా విదల్చలేదు. ఫార్మా సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్‌ హోదా ద్వారా కనీసం రూ.6 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకుని మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో 2019 మే నాటికి ఔత్సాహికులకు ఫార్మాసిటీలో భూ కేటాయింపులు చేస్తామనే ప్రకటన ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

వడివడిగా టీఎస్‌ఐఐసీ అడుగులు...
ఫార్మాసిటీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్‌ఐఐసీ మొదట్లో వడివడిగా అడుగులు వేసింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టింది. మరోవైపు పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, సింగపూర్‌కు చెందిన సుర్బాన జురోంగ్‌ కన్సల్టెంట్స్‌ ద్వారా సమీకృత మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రణాళిక తుది దశలో ఉంది. సమీకృత కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు (సీఈటీపీ), జీరో లిక్విడ్‌ డిశ్చార్జి (జడ్‌ఎల్‌డీ) ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను 2017లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించి, 8 కంపెనీలను వడపోతలో ఎంపిక చేశారు.

జహీరాబాద్‌ నిమ్జ్‌పైనా ప్రభావం...
దేశ వ్యాప్తంగా మొత్తం 22 భారీ పారిశ్రామిక వాడలకు నిమ్జ్‌ హోదా దక్కగా, ఇందులో రాష్ట్రంలో రెండు ఉన్నాయి. ఫార్మాసిటీకి నిమ్జ్‌ హోదా సూత్రప్రాయంగా దక్కగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నిమ్జ్‌కు తుది ఆమోదం లభించింది. అయితే జహీరాబాద్‌ నిమ్జ్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3 వేల కోట్లివ్వాలని టీఎస్‌ఐఐసీ ప్రతిపాదించినా కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో ఫార్మాసిటీ తరహాలో జహీరాబాద్‌ నిమ్జ్‌ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది.

కేంద్రం నుంచి స్పందన కరువు...
ఫార్మా సిటీకి నిమ్జ్‌ హోదా నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులివ్వాల్సిందిగా టీఎస్‌ఐఐసీ కేంద్రాన్ని కోరింది. జీరో లిక్విడ్‌ డిశ్చార్జి గ్రాంటు కోసం కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్‌ విభాగానికి ప్రతిపాదనలు సమర్పించింది. సీఈటీపీ నిధుల కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. గ్రీన్‌క్లైమేట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫండ్‌ ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖకూ లేఖ రాసింది. అయితే ప్రతిపాదనలు పంపించి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి నిధుల విడుదల విషయంలో కనీస స్పందన కానరావడం లేదు. కేంద్రం నుంచి గ్రాంటు విషయంలో స్పష్టత లేకపోవడంతో సీఈటీపీ, జడ్‌ఎల్‌డీ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఎంపిక చేసిన 8 కంపెనీల వడపోత ప్రక్రియను టీఎస్‌ఐఐసీ నిలిపివేసింది. 

ఫార్మాసిటీ ప్రత్యేకతలు..
పెట్టుబడుల అంచనా:    రూ.64 వేల కోట్లు
ఫార్మా ఎగుమతులు (ఏటా):    రూ.58 వేల కోట్లు
ప్రత్యక్ష ఉపాధి:    1.70 లక్షల మందికి
పరోక్ష ఉపాధి:    3.90 లక్షల మందికి
కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు, మెటీరియల్‌ టెస్టింగ్‌ ల్యాబ్, క్వాలిటీ సర్టిఫికేషన్‌ ల్యాబ్, లాజిస్టిక్‌ హబ్, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఎన్విరాన్‌ మేనేజ్‌మెంట్‌ సెల్, సమీకృత నివాస గృహాల సముదాయం, ఫార్మా ఉత్పత్తి యూనిట్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితో పాటు ఫార్మా సిటీ ప్రాంగణంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (ఐఐఎస్‌ఈఆర్‌) ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement