18 నుంచి 30 వరకు విదేశాలకు కలెక్టర్
♦ జర్మనీ, ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ల లో పర్యటన
♦ ఆయా దేశాల్లో ఫార్మాసిటీల సందర్శన
♦ కాలుష్య శుద్ధి పద్ధతులపై అవగాహన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు విదేశాలకు వెళ్తున్నారు. అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, జర్మనీ దేశాల్లోని ఔషధనగరాల్లో అమలు చేస్తున్న కాలుష్య శుద్ధి యంత్రాల తీరును అధ్యయనం చేసేందుకు ఈ నెల 18 నుంచి 30వ తేదీవరకు ఆయా దేశాల్లో పర్యటించనున్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వం వహించే ప్రతినిధి బృందంలో మన జిల్లా కలెక్టర్ సహా.. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి శాంతికుమారి కూడా ఉన్నారు. కందుకూరు మండలం ముచ్చర్లలో దాదాపు 13వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఔషధనగరిలో కాలుష్య ఉద్గారాలను నియంత్రించేందుకు ప్రపంచస్థాయిలో మెరుగైన పద్ధతులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది. ఈ క్రమంలో విదేశాల్లో కాలుష్య కారకాలను శుద్ధికి అవలంభిస్తున్న విధానాల పరిశీలనకు అధికారుల బృందాన్ని పంపిస్తోంది. కాగా, రఘునందన్‌రావు విదేశీ పర్యటనకు వెలుతున్నందున... ఆయన స్థానే జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్‌షైనీ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఇదిలా ఉండగా, 18వ తేదీ అమెరికాతో జరిగే పర్యటనకు వెళ్లకుండా నేరుగా ఇంగ్లాండ్, జర్మనీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు.