కొత్తపల్లిలో ఉన్నతాధికారులు కొన్న వ్యవసాయ భూములు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల ఏర్పాటు సమాచారం ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులకు ముందే తెలియడం సహజం. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా, ఏదైనా భారీ ప్రాజెక్టు/ సంస్థ రాబోతుందంటే చాలు చకాచకా పావులు కదపడం, ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న భూముల్ని గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరకు కుటుంబసభ్యులు, బినామీల పేరిట కొనేయడం, సదరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చగానే ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించేసి కోట్లకు పడగలెత్తడం.. విషయం తెలిసిన రైతులు లబోదిబోమనడం.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విషయంలోనూ ఇదే జరిగింది.
ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు.
ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఇప్పటి ఓ మంత్రి సైతం ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం గమనార్హం. భూదాన్ భూములకూ కొందరు ఎసరు పెట్టడం కొసమెరుపు.
కుటుంబసభ్యులు, బినామీల పేరిట దందా
2017లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడంతో దేశవిదేశాలకు చెందిన 500కు పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమిని ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్నారనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందే తెలియడంతో బినామీలను, కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు.
ఓ మాజీ ఐపీఎస్ రైతుల్ని బెదిరించి..!
ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను బినామీల పేర్లపై కొనుగోలు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో భాగంగా ఎకరా రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల లోపే కొనుగోలు చేశారు. ఆయా గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూములను విక్రయించడానికి స్థానిక రైతులు కొందరు నిరాకరించినా, బినామీల ద్వారా రైతులను బెదిరింపులకు గురి చేసి భూములు అమ్మేలా ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి ఫార్మాసిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బినామీల పేరిట ఉన్న 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ఎకరం రూ.12.50 లక్షల చొప్పున ఫార్మాసిటీకి ఇచ్చేయడం గమనార్హం.
కురి్మద్ద, తాడిపర్తి, నానక్‌నగర్ గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని ఫార్మాసిటీకి ఇచ్చేసి నష్ట పరిహారం కింద రూ.కోట్లు సంపాదించారు. కేసీఆర్ సర్కార్‌లో చక్రం తిప్పిన కీలక అధికారులు కొందరు కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని దాదాపు 300 ఎకరాలకు పైగా పట్టాభూమిని ఫార్మాసిటీకి తీసుకోవాలని రియల్ వ్యాపారులే స్వయంగా ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు ఇవ్వడం గమనార్హం. కాగా తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, అధిక ధరలకు ఫార్మాసిటీకి అప్పగించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లపై మీర్‌ఖాన్‌పేటలోని హెచ్‌ఎండీఏ వెంచర్‌లో అదనంగా ఎకరాల కొద్దీ ప్లాట్లు మంజూరు అయ్యాయి.
భూదాన్ భూమిని కొల్లగొట్టిన నేతలు
తాడిపర్తి రెవెన్యూ సర్వే నంబర్ 104లో 468.34 ఎకరాల భూమి ఉంది. దాని యజమానులు అప్పట్లో 250 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారు. సదరు భూమిని తమ పేరున రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా 16/11/2005 లోనే భూదాన్‌బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకు పహణీల్లోనూ నమోదు చేశారు. అయితే ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎంపీ ఈ భూములను తమ బినామీ పేరున కొట్టేశారు. అంతేకాదు కొండలు, గుట్టలతో కూడిన ఈ భూమి సాగులో ఉన్నట్లు చూపించారు. భూ సేకరణలో భాగంగా ఈ భూములను ఫార్మాసిటీకి అప్పగించి ఎకరానికి రూ.16 లక్షల చొప్పున నష్టపరిహారం పొందారు.
ఇలా ప్రభుత్వం నుంచి రూ.40 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతేకాదు మీర్‌ఖాన్‌పేటలో ఎకరానికి 121 గజాల ఇంటి స్థలాన్ని కూడా పొందారు. ఈ భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన వారిలో స్థానికులు కాకుండా అంతా ఇతర ప్రాంతాలకు చెందిన నేతల బినామీలే ఉండటం గమనార్హం. ఈ అంశంపై తాడిపర్తి గ్రామస్తులు అప్పటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పట్లో ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన ఓ అధికారి భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఖజానాను భారీగా కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొత్తపల్లి పరిధిలో మాజీ సీఎస్ కొనుగోళ్లు
మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ తన భార్య పేరున యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249, 260లలో 25.19 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ పక్కనే సర్వే నంబర్ 244 నుంచి 269 వరకు ఉన్న 125 ఎకరాలు తన కుటుంబ సన్నిహితులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట కొనుగోలు చేయించారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా (2016 నుంచి 2018 వరకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు సీఎస్‌గా పని చేశారు) ఉన్నారు.
సాగుకు యోగ్యం లేని ఈ భూములకు రైతుబంధు పథకం కింద రూ.14 లక్షల వరకు లబ్ధి పొందినట్లు మాజీ సీఎస్‌పై ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ భూముల కొనుగోలుపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ బుధవారం యాచారం తహశీల్దార్ కార్యా లయానికి చేరుకుని పలు రికార్డులను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా తాను నిబంధనల ప్రకారమే భూములు కొన్నానని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని సోమేష్ చెబుతున్నారు.
మాజీ ఐపీఎస్ భూములు ఇచ్చింది వాస్తవమే
ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్తి గ్రామాల్లో దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించాడు. ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో నక్కర్తమేడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన 200 ఎకరాలకు పైగా భూమిని ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ఇచ్చేశాడు. ఆ అధికారి కొత్తపల్లి గ్రామంలో కూడా వందలాది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
– పాశ్ఛ భాషా, మాజీ సర్పంచ్ నక్కర్తమేడిపల్లి
Comments
Please login to add a commentAdd a comment