జీవనాధారమైన భూముల్ని ఫార్మా విలేజ్‌లకు అప్పగించబోమంటున్న రైతులు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఫార్మా సిటీకి బదులు పదిచోట్ల ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం
తొలి విడత ముచ్చర్ల ‘ఫార్మా సిటీ’లో రెండు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి ఏర్పాటుకు నిర్ణయం
ఎక్కడికక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్న యోచనలో ప్రభుత్వం
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ వాదన
ఫార్మా పరిశ్రమలతో గాలి, భూగర్భ జలాలు కలుషితమవుతాయంటున్న స్థానికులు
తమ విలువైన భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదంటూ అభ్యంతరం
వికారాబాద్, సంగారెడ్డిలో రైతుల ఆందోళన.. ఇటీవల లగచర్లలో కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులపై దాడి
భవిష్యత్తులో భూసేకరణ కష్టంగా మారొచ్చు: అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సమీకృత గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల (ఫార్మా విలేజ్‌లు) ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సవాలుగా మారుతోంది. భూ సేకరణకు జారీ చేస్తున్న నోటిఫికేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం అవు తున్నాయి. తమ గ్రామాల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దంటూ రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా రు. వ్యవసాయమే జీవనోపాధిగా బతుకుతున్న తాము భూములు అప్పగించేది లేదని తేల్చి చెబుతున్నారు.
ఫార్మా కంపెనీల ఏర్పాటుతో గాలి, భూ గర్భ జలాలు విషతుల్యమవుతాయని, తాము కాలుష్యం కోరల్లో చిక్కుకుంటామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ విలువైన భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదని కూడా అంటున్నారు. బహిరంగ మార్కెట్లో భూమి ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇవ్వజూపుతున్న మొత్తం చాలా తక్కువగా ఉందని పేర్కొంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టే ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
భూముల పరిశీలనకు, అభిప్రాయ సేకరణకు వస్తున్న అధికారులను అడ్డుకుంటుండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే దీనికంతటికీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీయే కారణమని, రైతులను రెచ్చగొడుతూ అభివృద్ధిని, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఫార్మాసిటీకి బదులుగా ఫార్మా విలేజ్‌లు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19 వేల ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎనిమిదేళ్ల క్రితం భూ సేకరణ ప్రారంభించి సుమారు 14 వేల ఎకరాలు సేకరించింది. మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా.. గత ఏడాది డిసెంబర్‌లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో సకల వసతులతో కూడిన ఫోర్త్ సిటీని నిర్మిస్తామని, ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పది ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అభివృద్ధి వికేంద్రీకరణ
ఫార్మా రంగాన్ని రాష్ట్రమంతటా విస్తరించడం ద్వారా ఎక్కడికక్కడే విద్యావంతులకు, పరోక్షంగా అంతగా చదువుకోని వారికి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చెబుతోంది. చిన్నచిన్న క్లస్టర్ల ద్వారా కాలుష్య రహితంగా వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
తొలిదశలో నాలుగు ఫార్మా విలేజ్‌లు
తొలిదశలో నాలుగు ప్రాంతాల్లో ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహలు ప్రారంభించింది. ‘ఫార్మా సిటీ’ఏర్పాటుకు ఇప్పటికే సేకరించిన భూముల్లో రెండు ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటితో పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఒకటి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్ మండలంలో మరో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కొడంగల్ ఫార్మా విలేజ్ ఏర్పాటుకు 1,358.38 ఎకరాలు, జహీరాబాద్‌లో ఫార్మా విలేజ్‌కు 2,003 ఎకరాలు అవసరమని లెక్కలు వేశారు. భూ సేకరణ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. పట్టా, అసైన్డ్ భూములు అనే తేడా లేకుండా ఒక్కో ఎకరానికి రూ.15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. కలెక్టర్లు భూముల పరిశీలనకు, ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరం ధర రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోందని రైతులు చెబుతున్నారు. దీనితో పాటు కాలుష్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫార్మా విలేజ్‌ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.
తమకు జీవనాధారమైన భూముల్ని ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ కలెక్టర్ తదితర ఉన్నతాధికారులపై లగచర్లలో దాడికి దిగారు. దాడి చేసిన వారితో పాటు దాడికి కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోనూ రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఫార్మా విలేజ్‌లకు భూ సేకరణ కష్టంగా మారుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది.
నోటికాడి కూడు తీసుకుంటారా?
తరాలుగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నమాకు భూములే జీవనాధారం. వ్యవసాయం తప్ప మరో పని చేయడం మాకు తెలియదు. ఇప్పుడు ఫార్మా విలేజ్ పేరిట మానోటి కాడ కూడును తీసుకుంటామంటున్నారు. అదే జరిగితే మా కుటుంబాలు రోడ్డు మీద పడి ఆగమవుతాయి. మూడు పంటలు పండే బంగారం లాంటి భూములను ప్రభుత్వానికి ఇచ్చేదిలేదు. ఇక్కడ ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం ఏ మూలకూ సరిపోదు. – బేగరి విఠల్, రైతు, డప్పూర్, సంగారెడ్డి జిల్లా
ఎన్ని పైసలు ఇచ్చినా భూమి ఇవ్వం
మా కుటుంబానికి ఉన్న రెండున్నర ఎకరాలే జీవనాధారం. ఈ భూమిలో 15 ఏళ్లుగా పుదీనా పండిస్తూ నారాయణఖేడ్ మార్కెట్లో అమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం మా భూములను లాక్కుంటే మేం ఎక్కడికి పోవాలి? ఎన్ని డబ్బులు ఇచ్చినా మా భూములు అప్పగించం. పచ్చటి భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి.
– అజీమొద్దీన్, రైతు, మల్గి, సంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment