Pharma City land
-
ఫార్మాకు ‘భూ’ గ్రహణం!
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సమీకృత గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల (ఫార్మా విలేజ్‌లు) ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సవాలుగా మారుతోంది. భూ సేకరణకు జారీ చేస్తున్న నోటిఫికేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం అవు తున్నాయి. తమ గ్రామాల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దంటూ రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా రు. వ్యవసాయమే జీవనోపాధిగా బతుకుతున్న తాము భూములు అప్పగించేది లేదని తేల్చి చెబుతున్నారు.ఫార్మా కంపెనీల ఏర్పాటుతో గాలి, భూ గర్భ జలాలు విషతుల్యమవుతాయని, తాము కాలుష్యం కోరల్లో చిక్కుకుంటామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ విలువైన భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదని కూడా అంటున్నారు. బహిరంగ మార్కెట్లో భూమి ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇవ్వజూపుతున్న మొత్తం చాలా తక్కువగా ఉందని పేర్కొంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టే ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.భూముల పరిశీలనకు, అభిప్రాయ సేకరణకు వస్తున్న అధికారులను అడ్డుకుంటుండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే దీనికంతటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీయే కారణమని, రైతులను రెచ్చగొడుతూ అభివృద్ధిని, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఫార్మాసిటీకి బదులుగా ఫార్మా విలేజ్‌లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19 వేల ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎనిమిదేళ్ల క్రితం భూ సేకరణ ప్రారంభించి సుమారు 14 వేల ఎకరాలు సేకరించింది. మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా.. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో సకల వసతులతో కూడిన ఫోర్త్ సిటీని నిర్మిస్తామని, ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పది ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి వికేంద్రీకరణ ఫార్మా రంగాన్ని రాష్ట్రమంతటా విస్తరించడం ద్వారా ఎక్కడికక్కడే విద్యావంతులకు, పరోక్షంగా అంతగా చదువుకోని వారికి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చెబుతోంది. చిన్నచిన్న క్లస్టర్ల ద్వారా కాలుష్య రహితంగా వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. తొలిదశలో నాలుగు ఫార్మా విలేజ్‌లు తొలిదశలో నాలుగు ప్రాంతాల్లో ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహలు ప్రారంభించింది. ‘ఫార్మా సిటీ’ఏర్పాటుకు ఇప్పటికే సేకరించిన భూముల్లో రెండు ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటితో పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఒకటి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్ మండలంలో మరో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.కొడంగల్ ఫార్మా విలేజ్ ఏర్పాటుకు 1,358.38 ఎకరాలు, జహీరాబాద్‌లో ఫార్మా విలేజ్‌కు 2,003 ఎకరాలు అవసరమని లెక్కలు వేశారు. భూ సేకరణ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. పట్టా, అసైన్డ్ భూములు అనే తేడా లేకుండా ఒక్కో ఎకరానికి రూ.15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. కలెక్టర్లు భూముల పరిశీలనకు, ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరం ధర రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోందని రైతులు చెబుతున్నారు. దీనితో పాటు కాలుష్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫార్మా విలేజ్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.తమకు జీవనాధారమైన భూముల్ని ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ కలెక్టర్ తదితర ఉన్నతాధికారులపై లగచర్లలో దాడికి దిగారు. దాడి చేసిన వారితో పాటు దాడికి కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోనూ రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఫార్మా విలేజ్‌లకు భూ సేకరణ కష్టంగా మారుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. నోటికాడి కూడు తీసుకుంటారా?తరాలుగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నమాకు భూములే జీవనాధారం. వ్యవసాయం తప్ప మరో పని చేయడం మాకు తెలియదు. ఇప్పుడు ఫార్మా విలేజ్ పేరిట మానోటి కాడ కూడును తీసుకుంటామంటున్నారు. అదే జరిగితే మా కుటుంబాలు రోడ్డు మీద పడి ఆగమవుతాయి. మూడు పంటలు పండే బంగారం లాంటి భూములను ప్రభుత్వానికి ఇచ్చేదిలేదు. ఇక్కడ ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం ఏ మూలకూ సరిపోదు. – బేగరి విఠల్, రైతు, డప్పూర్, సంగారెడ్డి జిల్లాఎన్ని పైసలు ఇచ్చినా భూమి ఇవ్వం మా కుటుంబానికి ఉన్న రెండున్నర ఎకరాలే జీవనాధారం. ఈ భూమిలో 15 ఏళ్లుగా పుదీనా పండిస్తూ నారాయణఖేడ్ మార్కెట్లో అమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం మా భూములను లాక్కుంటే మేం ఎక్కడికి పోవాలి? ఎన్ని డబ్బులు ఇచ్చినా మా భూములు అప్పగించం. పచ్చటి భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి. – అజీమొద్దీన్, రైతు, మల్గి, సంగారెడ్డి జిల్లా -
ఫార్మాసిటీ భూసేకరణ రద్దు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ కేసులో ప్రకటన, అవార్డులు, పరిహారం డిపాజిట్ సహా తదుపరి అన్ని చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులైన 180 మంది పిటిషనర్ల నుంచి మళ్లీ అభ్యంతరాలను తీసుకొని, భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. భూసేకరణలో చేపట్టాల్సిన కనీస విధానాన్ని కూడా పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా భూమిని సేకరించేటప్పుడు అనుసరించాల్సిన విధానంపై 2017లో ప్రధాన కార్యదర్శి మెమోను జారీ చేసినా, దాన్ని అర్థం చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గుర్తించలేదని, తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో మూడేళ్లు గడిచినా ప్రతిష్టాత్మకమైన ఫార్మా సిటీ నిర్మాణం కూడా ముందుకుసాగలేదని పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం 2020, జూలై 23న జారీ చేసిన భూసేకరణ ప్రకటనను కొట్టివేస్తున్నామని వెల్లడించింది. భూసేకరణ, పునరావాసం చట్టంలోని సెక్షన్ 15 కింద అభ్యంతరాలను 3 నెలల వ్యవధిలోగా తీసుకుని, మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. తీర్పు తేదీ ప్రామాణికంగా మార్కెట్ విలువ పేర్కొనాలి భూసేకరణ, పునరావాస చట్టప్రకారం తమకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదని, ఇతర చర్యలు చేపట్టడం లేదని మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున రవికుమార్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ పరిషద్ వాదనలు అందకుముందు వినిపించారు. ‘రెండు వారాల్లో పిటిషనర్లు అభ్యంతరాలను తెలియజేయాలి. అధికారులకు సహకరించాలి. ఈ తీర్పు తేదీని ప్రామాణికంగా తీసుకుని అధికారులు మార్కెట్ విలువ నిర్ణయించాలి. ఇరుపక్షాలు చర్చలతో ప్రయోజనాలను పొందాలి. 2015లోనే ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించింది. చట్టపరమైన అడ్డంకులు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. చట్టాలు ఏం చెబుతున్నాయో కూడా ఐఏఎస్ అధికారులు అర్థం చేసుకోకపోవడం, భూసేకరణ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్నది కూడా తెలియకపోవడం ఆక్షేపణీయం. దీని కారణంగానే రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2017, అక్టోబర్ 23న మోమో జారీ చేయాల్సి వచ్చింది. అందులో 2013 భూ సేకరణ చట్ట ప్రకారం.. సేకరణ సమయంలో అనుసరించాల్సిన విధానం ఏంటీ అన్నది చెబుతూ పలు మార్గదర్శకాలు వెల్లడించారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుడ్డిగా తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. దీని కారణంగా ఎంతో విలువైన కోర్టు సమయం మూడేళ్లుగా వృథా అవుతూ వచ్చింది’అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. -
ఫార్మాసిటీతో రియల్ వ్యాపారమా?
యాచారం(ఇబ్రహీంపట్నం) : కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రియల్ వ్యాపారం చేస్తుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని కుర్మిద్దలో మంగళవారం ఫార్మాసిటీ భూబాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఫార్మాసిటీని నెలకొల్పుతుందని మండిపడ్డారు. భూసేకరణ చట్టం మేరకు రైతులకు పరిహారం అందజేయలేదు, వర్షాలు కురిస్తే ఫార్మాకిచ్చిన భూముల్లో సాగుచేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఫార్మాసిటీని రద్దుచేసే వరకు పోరాటం.. ఫార్మా ఏర్పాటైతే ఈ ప్రాంతం నష్టపోతుందన్నారు. నింబంధనలకు విరుద్ధంగా, రైతులను భయపెట్టి, ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని కోర్టును ఆశ్రయించి రద్దు చేయిస్తామన్నారు. ఫార్మాసిటీ పేరుతో గ్రామాలకు ఏ అధికారి వచ్చినా తిరగబడాలని రైతులకు సూచించారు. కేసీఆర్ రైతుబంధు పథకం తప్పుల తడక అన్నారు. పథకంలో పాసు పుస్తకాలు, చెక్కుల్లో తప్పులు దొర్లుతున్నాయన్నారు. జిల్లా కలెక్టరే స్వయంగా పర్యవేక్షణ చేసి అడ్డుకోవాలని కోరారు. రైతులు తిరగబడక ముందే రికార్డులు సరిచేయాలన్నారు. 20న ఫార్మా టూర్.... డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలతో ఆ ప్రాంతాల్లో పర్యావరణం, వాతావరణ , నీటి కాలుష్యం ఏ మేరకు సర్వనాశనమవుతుందో , ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ ఫార్మా బాధితులకు తెలపడానికి ఫార్మాటూర్ ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. ఫారా>్మ కంపెనీల వల్ల జరిగే నష్టాలను నక్కర్తమేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల ప్రజలకు చూపిస్తే తీవ్రత తెలుస్తుందని అన్నారు. పర్యావరణవేత్త నర్సింహరెడ్డి మాట్లాడుతూ ఫార్మాసిటీ వద్దని ప్రతి రైతు అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటయితే 750కి పైగా కంపెనీలు ఒకే చోట ఏర్పాటు అవుతాయని , వాటితో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలు నష్టపోతాయన్నారు. కాంగ్రెస్ యాచారం మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పర్యావరణవేత్తలు ఇంద్రసేనరెడ్డి, సరస్వతి, కుర్మిద్ద మాజీ ఎంపీటీసీ యాదయ్య చారి, యాచారం మండల కిసాన్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, నాయకులు సిద్దంకి కృష్ణరెడ్డి, శంకర్‌గౌడ్, మంకాల దాసు పాల్గొన్నారు. -
డ్రోన్‌తో భూ సర్వే
♦ ఫార్మాసిటీ భూముల్లో సర్వే ముమ్మరం ♦ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే ♦ హద్దులను గుర్తిస్తున్న టీఎస్‌ఐఐసీఓ ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం కందుకూరు, యాచారం మండలాల్లో తీసుకోవడానికి నిర్ణయించిన 10 వేల ఎకరాల్లో టీఎస్ఐఐసీ సంస్థ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే చేయిస్తోంది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసుకున్న కందుకూరు - యాచారం మండలాల్లోని ముచ్చర్ల, మీరాఖాన్‌పేట, పంజగూడ, కుర్మిద్ద తదితర గ్రామాల్లో సర్వే పూర్తి చేసిన ఏజెన్సీ ప్రతినిధులు గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 తదితర సర్వే నంబర్లల్లో సర్వే చేశారు. రిమోట్‌తో డ్రోన్ (చిన్న విమానం) ను భూములపైకి పంపించి ఆ భూముల్లో రాళ్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, అటవీశాఖ భూములను సర్వే చేశారు. యాచారం : ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం తీసుకోవా లనుకున్న భూముల్లో టీఎస్‌ఐఐసీఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే చేయిస్తోంది. కందుకూరు - యాచారం మండలాల్లోని పలు గ్రామాల్లో 10 వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను తీసుకున్న టీఎస్‌ఐఐసీఓ.. ఇప్పటికే రెండు వేల ఎకరాలకు పైగా అర్హులైన రైతులకు పరిహారం చెక్కులను కూడా పంపిణీ చేసింది. తాజాగా మిగిలిన భూముల్లో సాంకేతిక పరంగా సర్వేలు చేయిస్తోంది. ఇప్పటికే కందుకూరు - యాచారం మండలాల్లోని ముచ్చర్ల, మీరాఖాన్‌పేట, పంజగూడ, కుర్మిద్ద తదితర గ్రామాల్లో ఏజెన్సీ ప్రతినిధులు సర్వే పూర్తి చేశారు. గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 తదితర సర్వే నంబర్లలో రిమోట్ సాయంతో డోన్ (చిన్న విమానం)ను ఉపరితలంపైకి పంపించి ఆ భూముల్లో రాళ్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, అటవీశాఖ భూములను సర్వే చేయించారు. డ్రోన్ ప్రతిసారి రెండు కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లీ ఆ భూముల హద్దులను తన కెమెరాలో రికార్డు చేసింది. సాంకేతిక సిబ్బంది డ్రోన్ తిరుగుతున్న ప్రదేశాన్ని ల్యాప్‌టాప్‌ల్లో చూస్తూ రికార్డు చేశారు. ఇదే విషయమై టీఎస్‌ఐఐసీఓ ప్రతినిధి పద్మజను సంప్రదించగా ఫార్మాసిటీ కోసం తీసుకోనున్న భూ ముల్లో అటవీ భూముల హద్దులు, అసైన్డ్, పట్టా భూముల హద్దులు తెలుసుకోవడానికి ఈ సర్వే చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు.