సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ కేసులో ప్రకటన, అవార్డులు, పరిహారం డిపాజిట్ సహా తదుపరి అన్ని చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులైన 180 మంది పిటిషనర్ల నుంచి మళ్లీ అభ్యంతరాలను తీసుకొని, భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. భూసేకరణలో చేపట్టాల్సిన కనీస విధానాన్ని కూడా పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేసింది.
ఏదైనా భూమిని సేకరించేటప్పుడు అనుసరించాల్సిన విధానంపై 2017లో ప్రధాన కార్యదర్శి మెమోను జారీ చేసినా, దాన్ని అర్థం చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గుర్తించలేదని, తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో మూడేళ్లు గడిచినా ప్రతిష్టాత్మకమైన ఫార్మా సిటీ నిర్మాణం కూడా ముందుకుసాగలేదని పేర్కొంది.
ఈ క్రమంలో ప్రభుత్వం 2020, జూలై 23న జారీ చేసిన భూసేకరణ ప్రకటనను కొట్టివేస్తున్నామని వెల్లడించింది. భూసేకరణ, పునరావాసం చట్టంలోని సెక్షన్ 15 కింద అభ్యంతరాలను 3 నెలల వ్యవధిలోగా తీసుకుని, మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.
తీర్పు తేదీ ప్రామాణికంగా మార్కెట్ విలువ పేర్కొనాలి
భూసేకరణ, పునరావాస చట్టప్రకారం తమకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదని, ఇతర చర్యలు చేపట్టడం లేదని మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున రవికుమార్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ పరిషద్ వాదనలు అందకుముందు వినిపించారు. ‘రెండు వారాల్లో పిటిషనర్లు అభ్యంతరాలను తెలియజేయాలి. అధికారులకు సహకరించాలి.
ఈ తీర్పు తేదీని ప్రామాణికంగా తీసుకుని అధికారులు మార్కెట్ విలువ నిర్ణయించాలి. ఇరుపక్షాలు చర్చలతో ప్రయోజనాలను పొందాలి. 2015లోనే ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించింది. చట్టపరమైన అడ్డంకులు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. చట్టాలు ఏం చెబుతున్నాయో కూడా ఐఏఎస్ అధికారులు అర్థం చేసుకోకపోవడం, భూసేకరణ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్నది కూడా తెలియకపోవడం ఆక్షేపణీయం.
దీని కారణంగానే రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2017, అక్టోబర్ 23న మోమో జారీ చేయాల్సి వచ్చింది. అందులో 2013 భూ సేకరణ చట్ట ప్రకారం.. సేకరణ సమయంలో అనుసరించాల్సిన విధానం ఏంటీ అన్నది చెబుతూ పలు మార్గదర్శకాలు వెల్లడించారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుడ్డిగా తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. దీని కారణంగా ఎంతో విలువైన కోర్టు సమయం మూడేళ్లుగా వృథా అవుతూ వచ్చింది’అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment