‘దానం’ కేసులో పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
గతంలో తీర్పులుంటే తమ ముందుంచాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఒక ఓటర్ పిటిషన్ వేయవచ్చా? దీనిపై స్పీకర్ విధుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? ఆయన ముందు వినతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల ని చెప్పవచ్చా? అలా గతంలో ఏవైనా తీర్పులుంటే తమ ముందు ఉంచాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ‘2023, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో నేను ఆయనకు ఓటు వేశాను.
ఆ ఎన్నికల్లో గెలిచిన దానం.. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి.. మరో పార్టీలో చేరిన దానంను అనర్హుడిగా ప్రకటించాలని మార్చి 23న స్పీకర్‌కు ఈ–మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించాం. ఇంకా దానిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుని దానంను అనుర్హుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వండి’అని కోరుతూ ఖైరతాబాద్‌కు చెందిన బొల్లబోయిన రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేయడంలో పిటిషనర్‌కు ఎలాంటి అర్హత ఉందని అతని తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి మూడు నెలలు తిరగకుండానే కాంగ్రెస్‌కు విధేయుడిగా మారిన ఎమ్మెల్యేకు పిటిషనర్ ఓటేశారని న్యాయవాది చెప్పారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. గత తీర్పుల కాపీలుంటే తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment