సమావేశంలో మాట్లాడుతున్న ముదిరెడ్డి కోదండరెడ్డి
యాచారం(ఇబ్రహీంపట్నం) : కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రియల్ వ్యాపారం చేస్తుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని కుర్మిద్దలో మంగళవారం ఫార్మాసిటీ భూబాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఫార్మాసిటీని నెలకొల్పుతుందని మండిపడ్డారు. భూసేకరణ చట్టం మేరకు రైతులకు పరిహారం అందజేయలేదు, వర్షాలు కురిస్తే ఫార్మాకిచ్చిన భూముల్లో సాగుచేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఫార్మాసిటీని రద్దుచేసే వరకు పోరాటం..
ఫార్మా ఏర్పాటైతే ఈ ప్రాంతం నష్టపోతుందన్నారు. నింబంధనలకు విరుద్ధంగా, రైతులను భయపెట్టి, ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని కోర్టును ఆశ్రయించి రద్దు చేయిస్తామన్నారు. ఫార్మాసిటీ పేరుతో గ్రామాలకు ఏ అధికారి వచ్చినా తిరగబడాలని రైతులకు సూచించారు. కేసీఆర్ రైతుబంధు పథకం తప్పుల తడక అన్నారు. పథకంలో పాసు పుస్తకాలు, చెక్కుల్లో తప్పులు దొర్లుతున్నాయన్నారు. జిల్లా కలెక్టరే స్వయంగా పర్యవేక్షణ చేసి అడ్డుకోవాలని కోరారు. రైతులు తిరగబడక ముందే రికార్డులు సరిచేయాలన్నారు.
20న ఫార్మా టూర్.... డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలతో ఆ ప్రాంతాల్లో పర్యావరణం, వాతావరణ , నీటి కాలుష్యం ఏ మేరకు సర్వనాశనమవుతుందో , ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ ఫార్మా బాధితులకు తెలపడానికి ఫార్మాటూర్ ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. ఫారా>్మ కంపెనీల వల్ల జరిగే నష్టాలను నక్కర్తమేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల ప్రజలకు చూపిస్తే తీవ్రత తెలుస్తుందని అన్నారు. పర్యావరణవేత్త నర్సింహరెడ్డి మాట్లాడుతూ ఫార్మాసిటీ వద్దని ప్రతి రైతు అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు.
ఫార్మాసిటీ ఏర్పాటయితే 750కి పైగా కంపెనీలు ఒకే చోట ఏర్పాటు అవుతాయని , వాటితో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలు నష్టపోతాయన్నారు. కాంగ్రెస్ యాచారం మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పర్యావరణవేత్తలు ఇంద్రసేనరెడ్డి, సరస్వతి, కుర్మిద్ద మాజీ ఎంపీటీసీ యాదయ్య చారి, యాచారం మండల కిసాన్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, నాయకులు సిద్దంకి కృష్ణరెడ్డి, శంకర్‌గౌడ్, మంకాల దాసు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment