
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం నదీజల మార్గాలపై దృష్టి సారించాలని టీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సూచించారు. రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పోలిస్తే నదీ జలమార్గాల ద్వారా తక్కువ ఖర్చుతో సరుకుల రవాణా చేయవచ్చన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు నదీజల రవాణా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఒడిస్సీ లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతి థిగా కేటీఆర్ పాల్గొన్నారు.
1952–2014 మధ్యకాలంలో తెలంగాణలో 2,600 కి.మీ పొడవైన రహదారులు ఉండగా, గత ఐదేళ్లలో మరో 2,800 కి.మీ మేర జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి రంగంలో క్రమంగా వ్యయం పెరుగుతోందని, రాబోయే రోజుల్లో ఉత్పత్తి రంగంలో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న మానవ వ్యాక్సి న్లలో మూడోవంతు హైదరాబాద్‌లోనే తయారు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఫార్మా, వ్యాక్సిన్, వైద్య ఉపకరణాలు తదితర రంగాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఎగుమతులు పెరగనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఫార్మాసిటీ పనులు వేగవంతం చేస్తాం..
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 19వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ ఫార్మాసిటీ పనులు వేగవంతం చేస్తామని కేటీఆర్ తెలిపా రు. ఫార్మాసిటీకి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో లాజిస్టిక్స్ రంగానికి మరింత ఊపు వస్తుందన్నారు. తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పటికే హెచ్‌ఎండీఏ 2 లాజిస్టిక్స్ పార్కులను నిర్మిస్తోందని, మరో 6 లాజిస్టిక్స్ పార్కులను ఔటర్‌రింగు సమీపంలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, శ్రీనివాస్ గుప్తా, అభిషేక్ ఠాకూర్, విఘ్నేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment