ఫార్మాసిటీకి రూ.1,500 కోట్లు ఇవ్వండి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ విజ్ఞప్తి
- వివిధ అంశాలపై వినతి
- మరో ఇద్దరు కేంద్ర మంత్రులనూ కలసిన కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇవ్వాలని ఐటీ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసిన కేటీఆర్... ఈ మేరకు పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్మా సిటీ నిర్మాణంపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని...తొలి విడతగా రూ. 200 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారన్నారు. ఎస్‌ఈజడ్‌లకు సంబంధించి వైజాగ్ కేంద్రంగా ఏపీ, తెలంగాణకు ఒక్క కమిషనర్ మాత్రమే ఉన్నారని, తెలంగాణ కు హైదరాబాద్ కే ంద్రంగా ప్రత్యేక కమిషనర్ ఉండేలా చూడాలని కోరినట్టు తెలిపారు.
‘‘హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ట్రేడ్ సెంటర్‌కు కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరాం. విభజన అనంతరం ఏపీ, తెలంగాణకు ఇవ్వాల్సిన పన్ను రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాల విషయంలో పురోగతి లేదనే అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణలో ఏర్పాటు చేయ తలపెట్టిన రెండు పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. దీనిపైనా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలని కూడా నిర్మలా సీతారామన్‌ను కోరాం. ఈ అంశాలపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతాం. తెలంగాణలో బయో ఫార్మాపై దృష్టిపెట్టాలని సూచించారు. కేం ద్రం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యటించే ట్రేడ్ ప్రమోషన్ ప్రతినిధి బృందంలో తెలంగాణ ప్రతినిధికి అవకాశం ఇవ్వాలని కోరాం’’ అని కేటీఆర్ వివరించారు.
‘హరితహారా’నికి విచ్చేయండి...
కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమైన మంత్రి కేటీఆర్...ఫార్మా సిటీకి అనుమతులివ్వాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే ఆదిలాబాద్‌లోని జిన్నారం, నిర్మల్ ప్రాంతాల్లో ఇనుప ఖనిజాలున్నాయని జాతీయ భూగర్భశాఖ చెబుతున్న నేపథ్యంలో వాటి తవ్వకాలకు పర్యావరణ అనుమతులివ్వాలని కేటీఆర్ కోరారు. దేశంలో 9 నగరాల్లో గాలి నాణ్యతను పరీక్షించే విధానాన్ని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కేటీఆర్‌కు వివరించగా హైదరాబాద్‌లోనూ వాయు నాణ్యతను తెలిపే డిజిటల్ బోర్డుల ఏర్పాటుకు అవసరమైన సాంకేతికతను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతేడాదిలాగానే హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని జవదేకర్‌ను కోరగా అందుకు ఆయన సమ్మతించారు. జూలై 11న 25 లక్షల మొక్కలు నాటుతున్నట్లు కేటీఆర్ కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతున్న హరితహారాన్ని జవదేకర్ ప్రశంసించారు.
జాతీయ డ్రగ్ కంట్రోల్ అకాడమీ కోసం..
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫార్మా కంపెనీలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో నేషనల్ డ్రగ్ కంట్రోల్ అకాడమీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ లో కేటీఆర్ కోరారు. ఈ అకాడమీ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నడ్డా త్వరలో అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతానని హామీ ఇచ్చారని కేటీఆర్ మీడియాకు తెలి పారు. కేంద్ర మంత్రులను కలసిన ప్రతినిధి బృందం లో కేటీఆర్ వెంట ఎంపీ లు సీతారాంనాయక్, బీబీపాటిల్ ఉన్నారు.
పరిశ్రమలు ‘ఔటర్’ వెలుపలికి..
కేంద్ర మంత్రులను కలవడానికి ముందు మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను రింగ్‌రోడ్డు బయటకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వాటిని ఒకేచోట కేంద్రీకరించకుండా వివిధ ప్రాంతాలకు తరలించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతమున్న ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల మరో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మించే ప్రతిపాదన ఉందని, ఇందుకు అవసరమైన స్థల సేకరణను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో చేపట్టనున్నట్టు వివరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ప్రతిపక్షాలు చెబుతున్న 2013 చట్టం ఆధారంగా పరిహారం చెల్లిస్తే రైతులు నష్టపోతారని పేర్కొన్నారు.