విశాఖపట్నం, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఘోర ప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే.. అనకాపల్లిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అచ్యుతాపురం ఘటన తర్వాత.. పరిహార ప్రకటన, బాధిత కుటుంబాలతో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఇప్పుడు ఫార్మా సిటీ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వ నేతలు తలోమాట చెబుతూ గందరగోళాన్ని సృష్టిస్తోంది.
ఎంపీ సీఎం రమేష్ ఏమన్నారంటే..
సీనియర్ కెమిస్ట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగింది. సీనియర్ కెమిస్ట్ డ్రగ్ పౌడర్ మిక్స్ చేస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది.
హోం మంత్రి అనిత ఏమన్నారంటే..
ఇది మరో దురదృష్టకరమైన ఘటన. జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో ఉద్యోగికి.. మొత్తం నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులకు సేఫ్టీ సూట్‌లు ఇవ్వాలి. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక కమీటి వేసి,పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
అధికారులు ఏమన్నారంటే..
మానవ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు ఆధారంగా గుర్తించాం. వేపర్ క్లైండ్ బరస్ట్ కారణంగానే ప్రమాదం జరిగింది. కెమికల్ మిక్సింగ్‌టైంలో బయటకు ఆవిరి వచ్చి పేలింది.
అసలేం జరిగింది?
పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ సంస్ధలో గత అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు, విజయనగరానికి చెందిన మరో ఉద్యోగి(సీనియర్ కెమిస్ట్) తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. హుటాహుటిన నలుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించింది.
ఘటనపై ఈ ఉదయం జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. దీంతో హోం మంత్రి అనిత క్షతగాత్రుల్ని పరామర్శించారు.
సినర్జిన్ ప్రమాదంలో ఒకరికి 90 శాతం గాయాలు కాగా, మరో ముగ్గురికి 60 శాతం పైగా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో 17 మంది మృత్యువాత పడగా.. మరో ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇంకో నలుగురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment