ఫార్మాసిటీలో ప్రపంచ స్థాయి సీఈటీపీలు
వాటి నిర్మాణ కంపెనీలతో భేటీలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న కాలుష్య శుద్ధీకరణ ప్లాంట్లను (సీ ఈటీపీ) అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఫార్మాసిటీతోపాటు రాష్ట్రంలోని ఇతర పారి శ్రామికవాడల్లో సీఈటీపీల నిర్మాణాలకు ఉన్న అవకాశాలపై ఈ రంగంలో అనుభవంగల కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఫార్మాసిటీలో నిర్మించే సీఈటీపీల ద్వారా కాలుష్య వ్యర్థాలను జీరో డిశ్చార్జి స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
చైనా, సింగపూర్, మలేసియాలోని పలు ఫార్మా కంపెనీల్లో ఏర్పాటు చేసిన కాలుష్య శుద్ధీకరణ ప్లాంట్లను ప్రభుత్వం పరిశీలించిందని.. అదే తరహాలో రాష్ట్రంలో ఫార్మాసిటీతోపాటు వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కులో అత్యాధునిక సీఈ టీపీలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుత పారిశ్రామిక పార్కులు కొత్తగా ఏర్పాటయ్యే పారిశ్రామికవాడల్లోనూ జీరో డిశ్చార్జి లక్ష్యంగా కాలుష్య శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా మన్నారు. ప్రభుత్వంపై తక్కువ ఆర్థిక భారం పడే నమూనాలకు ప్రాధాన్యం ఇస్తామని కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ స్పష్టం చేశారు.
ఔటర్ రింగురోడ్డు వెలుపలకు తరలించే పారిశ్రామికవాడల్లోనూ సీఈటీపీల నిర్మాణాలకు అవకాశం ఉందన్నారు. సమావేశానికి జీఈ, సెంబ్ కార్ప్, తాహాల్ వంటి పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఎపిట్రీ డైరక్టర్ జనరల్ కల్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.