
సీఎం పర్యటన సాగిందిలా..
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఫార్మారంగ సంస్థల అధినేతలతో కలిసి నాలుగు హెలీకాప్టర్లలో బుధవారం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూములను సందర్శించారు.
* రెవెన్యూ భూములను హెలీకాప్టర్లలో ఏరియల్ సర్వే చేసిన సీఎం
* కట్టుదిట్టమైన భద్రత
కందుకూరు: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఫార్మారంగ సంస్థల అధినేతలతో కలిసి నాలుగు హెలీకాప్టర్లలో బుధవారం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూములను సందర్శించారు. దీంతో నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లను చేశారు. కాగా ఉదయం 11.30 గంటలకు మొదటి హెలీకాప్టర్ రాగా, 11.58 గంటలకు రెండో హెలీకాప్టర్ దిగింది. 12.20 గంటలకు మూడో హెలీకాప్టర్, 12.23 గంటలకు సీఎం కేసీఆర్ ఉన్న హెలీకాప్టర్ ల్యాండయింది.
వారంతా క్షేత్రస్థాయిలో అక్కడి భూములతోపాటు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 1.10 గంటల ప్రాంతంలో మూడు హెలీకాప్టర్లలో సీఎం బృందం ఏరియల్ సర్వే నిర్వహించి 1.30 గంటలకు తిరిగి ల్యాండయ్యాయి. అనంతరం 2.25 గంటల ప్రాంతంలో హెలీకాప్టర్లలో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కేసీఆర్‌తోపాటు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.
కట్టుదిట్టమైన భద్రత..
సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ నుంచి హన్మాస్‌పల్లి, జమ్ములబావి తండా మీదుగా మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 288లో ఏర్పాటు చేసిన ప్రాంతం వరకు ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. పాస్‌లు ఉన్నవారినే అనుమతించడంతో ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులు, వివిధ పార్టీల నేతలు నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది.
మీడియా నిరసన..
కాగా ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి మీడియాను అనుమతించకపోవడం, ఇతర నేతల్ని అనుమతించడంతో మీడియా ప్రతినిధులు కొద్దిసేపు ఆందోళన చేశారు. స్థానిక సీఐ సంతకంతో జారీచేసిన పాస్‌లతో వచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు, నేతలను అనుమతించారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సందర్భంలో పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఉత్సాహంతో వచ్చి నిరుత్సాహంగా..
ఎంతో ఉత్సాహంతో సీఎంను చూద్దామని వచ్చిన సమీప గ్రామాల ప్రజలకు నిరుత్సాహమే మిగిలింది. జమ్ములబావి తండా వరకు చేరుకున్న వారికి అక్కడి నుంచి ముందుకు అనుమతించకపోవడంతో చాలాసేపు నిరీక్షించి నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొందరు కొండలు, గుట్టలపై కూర్చొని మరీ చూసే ప్రయత్నం చేశారు.
స్థానికులకు అవస్థలు..
సీఎం పర్యటన కారణంగా ఆ ప్రాంతంలోని భూములతోపాటు సమీప భూముల్లో పశువులను మేపుకోవడానికి వె ళ్లే వారు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలకు అవస్థలు తప్పలేదు. పోలీసులు అటువైపు ఎవరినీ వెళ్లనీయకపోవడంతో రోజు వారీ పనులు చేసుకునే వారికి ఇబ్బంది తప్పలేదు.