ముచ్చెర్ల ఫార్మా సిటీని త్వరితగతిన అభివృద్ధిచేయాలి
టీఎస్‌ఐఐసీ, రంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి భేటీ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల కోసం కేటాయించిన భూముల అభివృద్ధిని వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల ఫార్మాసిటీ, ఇతర పరిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికసదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ), రంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముచ్చెర్ల ఫార్మాసిటీలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఫార్మాసిటీకి అప్రోచ్ రోడ్డును వెంటనే నిర్మించాలని ఆదేశించారు. అలాగే పరిశ్రమల కోసం ఎంపిక చేసిన స్థలాల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు జిల్లాలో జరుగుతున్న పనులను వివరించారు. 6000 ఎకరాల అటవీ భూమిని సేకరించి దానికి బదులుగా వేరే చోట భూములు ఇచ్చే ప్రక్రియ సాగుతుందని చెప్పారు. నెలరోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న భూములను వెంటనే గుర్తించి సత్వర అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేయాలని జూపల్లి ఆదేశించారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్ రంజన్, ఈడీ నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా జేసీ రజత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.