rapid development
-
భారత్ వృద్ధి పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కలిగి ఉందని, 2023లోనూ ఇదే హోదాను కొనసాగిస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మహమ్మారి, ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఎకానమీ వృద్ధి బాటన తన ప్రత్యేకతను చూటుకుంటోందని 9.35 లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. పటిష్ట వినియోగ విశ్వాసం, పెట్టుబడులు భారత్ వృద్ధి బాటకు మద్దతు నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలోకి వస్తుందన్న భరోసాను వెలిబుచ్చారు. టాటా సన్స్ విజయాలు... టాటా సన్స్ 2022లో అద్భుత విజయాలను సాధించినట్లు కూడా ఈ సందర్భంగా వివరించారు. గ్రూప్‌లోకి ఎయిర్ ఇండియాను తిరిగి తీసుకురావడం, కస్టమర్లకు చక్కటి సేవలకు సంబంధించి టాటాన్యూ ఆవిష్కరణ, క్యాలెండర్ ఇయర్లో 5,00,000 టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు, టాటా ఈవీ కార్ల 10 శాతం మార్కెట్ వాటా వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టాటా సంస్థలకు ఇదే విజయవంతమైన ప్రయాణం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘మనం మన సంస్థల పురోగతి, వ్యాపారాలు, వాటాదారుల ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా.. మన దేశం, ప్రజల సమోన్నతి సాధనకు భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో పురోగమిస్తాం. సాంకేతికత, తయారీ, స్థిరత్వ అంశాల్లో కొత్త ప్రమాణాలను మనం నెలకొల్పగలుగుతాము’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. -
శరవేగంగా గజ్వేల్ అభివృద్ధి
గజ్వేల్ : సీఎం కేసీఆర్ చొరవతో గజ్వేల్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని, ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికే నమూనాగా చూపడానికి ప్రయత్నం జరుగుతున్నని ‘గడ’ఓఎస్డీ హన్మంతరావు తెలిపారు. శనివారం గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కృషిని కొనియాడారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై కేసీఆర్ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత రూపురేఖలు మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, తూప్రాన్, కొండపాక మండలాల్లో 300 కిలోమీటర్లు ఆర్అండ్బీ, మరో 300 కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నిర్మాణం జరుగుతుండగా ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అదే విధంగా ప్రతి మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడమేగాకుండా వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఆడిటోరియం నిర్మాణం జరుగుతుందని, అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరలోనే చేపట్టబోతున్నామన్నారు. ఈ కార్యాలయ ప్రాంగణంలో 40 ప్రభుత్వ శాఖలు పనిచేస్తాయని చెప్పారు. భవన నిర్మాణానికి సంబంధించి కొద్దిపాటి మార్పులు చేయడానికి సీఎం నిర్ణయించడం వల్ల పనుల ప్రారంభంలో జాప్యం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ పనులకు కూడా అంకురార్పణ జరుగుతుందన్నారు. అదే విధంగా రూ. 100 కోట్లకు పైగా వ్యయంతో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. దీంతో పట్టణ పేదలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘మోడల్ కాలనీ’నిర్మాణ పనులకు సైతం మార్గం సుగమమైందన్నారు. మొదటి దశలో 1250 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. ప్రస్తుత జూనియర్ కళాశాల ప్రాంగణంలో అధునాతన హంగులతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి కావచ్చాయని, త్వరలో కొత్త భవనంలో వైద్య సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పాత భవనాన్ని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇవే కాకుండా మానవ అభివృద్ధి సూచికలైన శిశు మరణాల నివారణ, మహిళా సంక్షేమం, ఇతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, గజ్వేల్ ప్రెస్‌క్లబ్ కన్వీనర్ పి. ఎల్లారెడ్డి పాల్గొన్నారు. కాగా గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన తొలి ప్రెస్‌మీట్‌ని హన్మంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ సమస్యలపై హన్మంతరావుకు వినతిపత్రం అందజేశారు. -
ముచ్చెర్ల ఫార్మా సిటీని త్వరితగతిన అభివృద్ధిచేయాలి
టీఎస్ఐఐసీ, రంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి భేటీ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల కోసం కేటాయించిన భూముల అభివృద్ధిని వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల ఫార్మాసిటీ, ఇతర పరిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికసదుపాయాల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ), రంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముచ్చెర్ల ఫార్మాసిటీలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫార్మాసిటీకి అప్రోచ్ రోడ్డును వెంటనే నిర్మించాలని ఆదేశించారు. అలాగే పరిశ్రమల కోసం ఎంపిక చేసిన స్థలాల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు జిల్లాలో జరుగుతున్న పనులను వివరించారు. 6000 ఎకరాల అటవీ భూమిని సేకరించి దానికి బదులుగా వేరే చోట భూములు ఇచ్చే ప్రక్రియ సాగుతుందని చెప్పారు. నెలరోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న భూములను వెంటనే గుర్తించి సత్వర అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేయాలని జూపల్లి ఆదేశించారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ ఎండీ జయేష్ రంజన్, ఈడీ నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా జేసీ రజత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.