శరవేగంగా గజ్వేల్‌ అభివృద్ధి | Rapid development in Gajwel | Sakshi
Sakshi News home page

శరవేగంగా గజ్వేల్‌ అభివృద్ధి

Published Sat, Aug 27 2016 8:55 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న హన్మంతరావు

గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న హన్మంతరావు

గజ్వేల్‌ : సీఎం కేసీఆర్‌ చొరవతో గజ్వేల్‌ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని, ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికే నమూనాగా చూపడానికి ప్రయత్నం జరుగుతున్నని ‘గడ’ఓఎస్‌డీ హన్మంతరావు తెలిపారు. శనివారం గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కృషిని కొనియాడారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై కేసీఆర్‌ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు.

ఈ ప్రాంత రూపురేఖలు మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలోని గజ్వేల్‌, ములుగు, వర్గల్‌, జగదేవ్‌పూర్‌, తూప్రాన్‌, కొండపాక మండలాల్లో 300 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బీ, మరో 300 కిలోమీటర్లు పంచాయతీరాజ్‌ శాఖ రోడ్ల నిర్మాణం జరుగుతుండగా ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అదే విధంగా ప్రతి మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

విద్య, వైద్యం, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడమేగాకుండా వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ నగర పంచాయతీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఆడిటోరియం నిర్మాణం జరుగుతుందని, అదే విధంగా ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం త్వరలోనే చేపట్టబోతున్నామన్నారు. ఈ కార్యాలయ ప్రాంగణంలో 40 ప్రభుత్వ శాఖలు పనిచేస్తాయని చెప్పారు.

భవన నిర్మాణానికి సంబంధించి కొద్దిపాటి మార్పులు చేయడానికి సీఎం నిర్ణయించడం వల్ల పనుల ప్రారంభంలో జాప్యం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ పనులకు కూడా అంకురార్పణ జరుగుతుందన్నారు. అదే విధంగా రూ. 100 కోట్లకు పైగా వ్యయంతో ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. దీంతో పట్టణ పేదలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘మోడల్‌ కాలనీ’నిర్మాణ పనులకు సైతం మార్గం సుగమమైందన్నారు. మొదటి దశలో 1250 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు.

ప్రస్తుత జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో అధునాతన హంగులతో వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి కావచ్చాయని, త్వరలో కొత్త భవనంలో వైద్య సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పాత భవనాన్ని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇవే కాకుండా మానవ అభివృద్ధి సూచికలైన శిశు మరణాల నివారణ, మహిళా సంక్షేమం, ఇతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ, గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌ కన్వీనర్‌ పి. ఎల్లారెడ్డి పాల్గొన్నారు. కాగా గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన తొలి ప్రెస్‌మీట్‌ని హన్మంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ సమస్యలపై హన్మంతరావుకు వినతిపత్రం అందజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement