gajwel town
-
శరవేగంగా గజ్వేల్ అభివృద్ధి
గజ్వేల్ : సీఎం కేసీఆర్ చొరవతో గజ్వేల్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని, ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికే నమూనాగా చూపడానికి ప్రయత్నం జరుగుతున్నని ‘గడ’ఓఎస్డీ హన్మంతరావు తెలిపారు. శనివారం గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కృషిని కొనియాడారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై కేసీఆర్ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత రూపురేఖలు మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, తూప్రాన్, కొండపాక మండలాల్లో 300 కిలోమీటర్లు ఆర్అండ్బీ, మరో 300 కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నిర్మాణం జరుగుతుండగా ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అదే విధంగా ప్రతి మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడమేగాకుండా వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఆడిటోరియం నిర్మాణం జరుగుతుందని, అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరలోనే చేపట్టబోతున్నామన్నారు. ఈ కార్యాలయ ప్రాంగణంలో 40 ప్రభుత్వ శాఖలు పనిచేస్తాయని చెప్పారు. భవన నిర్మాణానికి సంబంధించి కొద్దిపాటి మార్పులు చేయడానికి సీఎం నిర్ణయించడం వల్ల పనుల ప్రారంభంలో జాప్యం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ పనులకు కూడా అంకురార్పణ జరుగుతుందన్నారు. అదే విధంగా రూ. 100 కోట్లకు పైగా వ్యయంతో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. దీంతో పట్టణ పేదలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘మోడల్ కాలనీ’నిర్మాణ పనులకు సైతం మార్గం సుగమమైందన్నారు. మొదటి దశలో 1250 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. ప్రస్తుత జూనియర్ కళాశాల ప్రాంగణంలో అధునాతన హంగులతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి కావచ్చాయని, త్వరలో కొత్త భవనంలో వైద్య సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పాత భవనాన్ని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇవే కాకుండా మానవ అభివృద్ధి సూచికలైన శిశు మరణాల నివారణ, మహిళా సంక్షేమం, ఇతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, గజ్వేల్ ప్రెస్‌క్లబ్ కన్వీనర్ పి. ఎల్లారెడ్డి పాల్గొన్నారు. కాగా గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన తొలి ప్రెస్‌మీట్‌ని హన్మంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ సమస్యలపై హన్మంతరావుకు వినతిపత్రం అందజేశారు. -
అక్రమ ‘హద్దురాళ్ల’ తొలగింపు
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలో కొనసాగుతున్న అక్రమ వెంచర్ల దందాపై ఈ నెల 26న ‘వెంచర్ వేసేయ్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో నగర పంచాయతీ అధికారులు అనుమతుల్లేని వెంచర్లపై కొరఢా ఝులిపిస్తున్నారు. శనివారం నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో గల 542 సర్వే నెంబరులోని రెండున్నర ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లో హద్దు రాళ్లను తొలగించారు. టీపీవో నర్సింహరాజు ఆధ్వర్యంలో ఈ తొలగింపు ప్రక్రియ సాగింది. ఈ కార్యక్రమంలో టీపీఎస్ పావని, చైన్‌మెన్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్ జిగేల్! రూపుమారుస్తా!
- చూడ చక్కని ఏర్పాట్లు చేస్తా - మంచి రోడ్లు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తా - ముఖ్యమంత్రి కేసీఆర్ - రూ.98.72కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన గజ్వేల్: ‘గజ్వేల్ పట్టణం సూడంగనే జిగేల్ మనాలి.. చూడ చక్కని రోడ్లు... అన్ని వసతులు.. ఉంటే గింటే గిసొంటి ఊళ్లో ఉండాలె... అని అందరూ అనుకునేలా రూపురేఖలు మారుస్తా. నేను మీకు ముందుగానే చెప్పిన.. ఇక కొత్త పట్టణాన్ని చూస్తారని! కొద్ది రోజుల్లో ఈ కల సాకారం కాబోతుంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటించారు. గజ్వేల్ నగర పంచాయతీతోపాటు ములుగు మండలం మర్కుక్‌లో రూ.98.72 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్‌లోని రాజీవ్ రిక్రియేషన్ పార్కులో సీఎం విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులతో గజ్వేల్ పట్టణానికి కొత్త రూపు రానున్నదని చెప్పారు. ముందుగా బాలుర జూనియర్ కళాశాలను, ఉన్నత పాఠశాలను ఎడ్యుకేషనల్ హబ్‌లోకి మారుస్తామన్నారు. తరువాత వాటి స్థానంలో అధునాతన వసతుల తో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటితోపాటు కొత్తగా చేపట్టే నిర్మాణాలతో కనువిందు చేసే పట్టణం అవతరించబోతుందన్నారు. ఫలితంగా పట్టణంలో స్థిర నివాసమేర్పరచుకోవడానికి పోటీ పెరిగి నగర పంచాయతీ మరింత విస్తరించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రత్యేకించి గృహనిర్మాణ పథకం కింద చేపడుతున్న మోడల్ కాలనీ పట్టణానికే మణిహారంగా మారనుందన్నారు. సాదాసీదాగా సీఎం టూర్... సీఎం కేసీఆర్ పర్యటన సాదాసీదాగా సాగింది. సీఎం ఆదేశాలతో అధికారులు సైతం సాధారణ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ఆద్యంతం ప్రణాళికాబద్ధంగా సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గజ్వేల్ చేరుకున్న సీఎం మధ్యాహ్నం 2గంటల వరకు ఇక్కడ పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గడ్డపార పట్టి... తట్ట మోసి.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయనున్న పాండవుల చెరువు పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తలపాగా చుట్టి, గడ్డపార చేత బూని, మట్టి తవ్వి.. తట్టలను మోశారు. ఆయన వెంట ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కూడా మట్టి తట్టలు మోశారు. ఈ సందర్భంగా చెరువు చరిత్ర, హద్దులు, శిఖం భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అంతకుముందు సీఎం మోడల్ కాలనీ కోసం శంకుస్థాన చేసిన పాలిటెక్నిక్ వెనుక భాగంలోని స్థలంలోనూ అధికారులతో చర్చలు జరిపారు. గృహాలు నిర్మించనున్న విధానం, సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. మిగితా అభివృద్ధి పనుల వివరాలనూ తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ వెంకట్రామ్రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్పర్సన్ దుంబాల అరుణభూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు తోట నరేందర్‌రావు, సంతోషిణి, నంగునూరి విజయలక్ష్మి, అల్వాల మాధవి, గజ్వేల్ నర్సింలు, రామదాసు, ఆర్కే శ్రీనివాస్, బోస్, నాయకులు ఆకుల దేవేందర్, పండరి రవీందర్రావు పాల్గొన్నారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
గజ్వేల్ : డబ్బు కోసం కట్టుకున్న భార్యను ఓ భర్త కడతేర్చాడు. భార్య ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి .. చీరతో ఉరేసి అంత్యంత కిరాతంగా హతమార్చాడు. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.. వివరాలిలా ఉన్నాయి. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ఎం శ్రీనివాస్ (34)కు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన రేణుక (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సందర్భంగా రూ. 2 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నం కింద ఇచ్చారు. వీరికి దీక్షిత (3), ధీరజ్ (10 నెలలు) లు ఉన్నారు. గజ్వేల్ మండలం కొడకండ్లలోని 400 కేవీ సబ్‌స్టేషన్‌లో వైర్మన్గా కాంట్రాక్ట్ ఉద్యోగం రావటం వల్ల భార్యాపిల్లలతో కలిసి గజ్వేల్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వాలని శ్రీనివాస్ రేణుకను తరుచూ వేధిస్తుండేవాడు. అంతేకాకుండా మద్యం పీకల దాక సేవించి శారీరకంగా హింసించేవాడు. ఈ విషయంలో ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కుమార్తె రేణుకను అల్లుడు వేధించినప్పుడల్లా రూ. 10 వేల వరకు అప్పగించేవారు. వీటితో కొంతకాలం బాగానే ఉంటూ తిరిగి డబ్బుల కోసం గొడవపెట్టేవాడు. కొన్ని రోజుల క్రితం రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రేణుక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో రూ. 10 వేల ఇచ్చి వెళ్లారు. అయినా తనకు ఈ డబ్బులు సరిపోవని హింసించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రేణుకను దిండుతో నోటిని కుక్కి ఊపిరాడకుండా చేయడమే కాకుండా చీరతో ఊరేసి హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికి గడియపెట్టి పిల్లలను తీసుకుని బయటకు వచ్చాడు. రాత్రి పది గంటల వరకు రోడ్డుపైనే తిరిగాడు. ఆ తర్వాత అక్కన్నపేటలోని తన తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబీకులకు శ్రీనివాస్ ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. దీంతో వారు ఇక్కడికి చేరుకుని పిల్లలను తమ వద్దకు తీసుకున్నారు. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ నేరుగా పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. దీంతో అదే రాత్రి సీఐ అమృతరెడ్డి, ఎస్ఐ జార్జిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారాన్ని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబీకులకు అందించారు. తెల్లవారుజామున వారు ఇక్కడికి చేరుకుని బోరున విలపించారు. ఈ సందర్భంగా రేణుక తండ్రి లింగయ్య విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కాలంగా నా బిడ్డను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నా.. మారుతాడోమేనని అనుకున్నాం.. ఎన్నోసార్లు అడిగి కాడికి డబ్బులిచ్చాం.. గిప్పుడు ప్రాణాలే తీసిండు.. అంటూ రోదించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అమృతరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే అభం శుభం తెలియని చిన్నారులు దీక్షిత, ధీరజ్‌లు పిన్న వయసులో కన్నతల్లిని కోల్పోవడం పలువురిని కలచి వేసింది. చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.