- చూడ చక్కని ఏర్పాట్లు చేస్తా
- మంచి రోడ్లు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తా
- ముఖ్యమంత్రి కేసీఆర్
- రూ.98.72కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గజ్వేల్: ‘గజ్వేల్ పట్టణం సూడంగనే జిగేల్ మనాలి.. చూడ చక్కని రోడ్లు... అన్ని వసతులు.. ఉంటే గింటే గిసొంటి ఊళ్లో ఉండాలె... అని అందరూ అనుకునేలా రూపురేఖలు మారుస్తా. నేను మీకు ముందుగానే చెప్పిన.. ఇక కొత్త పట్టణాన్ని చూస్తారని! కొద్ది రోజుల్లో ఈ కల సాకారం కాబోతుంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటించారు. గజ్వేల్ నగర పంచాయతీతోపాటు ములుగు మండలం మర్కుక్‌లో రూ.98.72 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్‌లోని రాజీవ్ రిక్రియేషన్ పార్కులో సీఎం విలేకరులతో మాట్లాడారు.
అభివృద్ధి పనులతో గజ్వేల్ పట్టణానికి కొత్త రూపు రానున్నదని చెప్పారు. ముందుగా బాలుర జూనియర్ కళాశాలను, ఉన్నత పాఠశాలను ఎడ్యుకేషనల్ హబ్‌లోకి మారుస్తామన్నారు. తరువాత వాటి స్థానంలో అధునాతన వసతుల తో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటితోపాటు కొత్తగా చేపట్టే నిర్మాణాలతో కనువిందు చేసే పట్టణం అవతరించబోతుందన్నారు. ఫలితంగా పట్టణంలో స్థిర నివాసమేర్పరచుకోవడానికి పోటీ పెరిగి నగర పంచాయతీ మరింత విస్తరించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రత్యేకించి గృహనిర్మాణ పథకం కింద చేపడుతున్న మోడల్ కాలనీ పట్టణానికే మణిహారంగా మారనుందన్నారు.
సాదాసీదాగా సీఎం టూర్...
సీఎం కేసీఆర్ పర్యటన సాదాసీదాగా సాగింది. సీఎం ఆదేశాలతో అధికారులు సైతం సాధారణ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ఆద్యంతం ప్రణాళికాబద్ధంగా సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గజ్వేల్ చేరుకున్న సీఎం మధ్యాహ్నం 2గంటల వరకు ఇక్కడ పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
గడ్డపార పట్టి... తట్ట మోసి..
మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయనున్న పాండవుల చెరువు పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తలపాగా చుట్టి, గడ్డపార చేత బూని, మట్టి తవ్వి.. తట్టలను మోశారు. ఆయన వెంట ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కూడా మట్టి తట్టలు మోశారు. ఈ సందర్భంగా చెరువు చరిత్ర, హద్దులు, శిఖం భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అంతకుముందు సీఎం మోడల్ కాలనీ కోసం శంకుస్థాన చేసిన పాలిటెక్నిక్ వెనుక భాగంలోని స్థలంలోనూ అధికారులతో చర్చలు జరిపారు. గృహాలు నిర్మించనున్న విధానం, సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. మిగితా అభివృద్ధి పనుల వివరాలనూ తెలుసుకున్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ వెంకట్‌రామ్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్‌పర్సన్ దుంబాల అరుణభూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు తోట నరేందర్‌రావు, సంతోషిణి, నంగునూరి విజయలక్ష్మి, అల్వాల మాధవి, గజ్వేల్ నర్సింలు, రామదాసు, ఆర్‌కే శ్రీనివాస్, బోస్, నాయకులు ఆకుల దేవేందర్, పండరి రవీందర్‌రావు పాల్గొన్నారు.
గజ్వేల్ జిగేల్! రూపుమారుస్తా!
Published Sun, May 10 2015 12:53 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM
Advertisement
Advertisement