కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాం.. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆఫర్
రూ.25 వేల కోట్ల విలువైన భూములను ఆక్రమించారని ఆరోపణ
సాక్షి, మేడ్చల్ జిల్లా: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని కండ్ల కోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మామ మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి సహా మేడ్చల్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రూ.25 వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం భూములను ఆక్రమించారు.
అలాంటి భూకబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. అలాంటి వారు చేరేందుకు వస్తే.. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా ఎదుర్కొంటుంది..’’అని మైనంపల్లి పేర్కొన్నారు. చెరువులోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. ఇకమీద తాము దగ్గరుండి కూల్చివేతలకు సహకరిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాలను బయటపెడతామన్నారు. శనివారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కండ్లకోయలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ శంఖారావం సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment