hanmantha rao
-
కబ్జా భూములను సరెండర్ చెయ్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని కండ్ల కోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మామ మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి సహా మేడ్చల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.25 వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం భూములను ఆక్రమించారు. అలాంటి భూకబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. అలాంటి వారు చేరేందుకు వస్తే.. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా ఎదుర్కొంటుంది..’’అని మైనంపల్లి పేర్కొన్నారు. చెరువులోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. ఇకమీద తాము దగ్గరుండి కూల్చివేతలకు సహకరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాలను బయటపెడతామన్నారు. శనివారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కండ్లకోయలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ శంఖారావం సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
మీ దూకుడూ ...సాటెవ్వరు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా రాత్రికి రాత్రే పార్టీలు మారిపోతున్నారు. నిన్నటిదాకా తిట్టిపోసిన పార్టీల్లోనే దర్జాగా చేరుతూ తమను అక్కున చేర్చుకున్న పార్టీలను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సమయంలో నిన్నటిదాకా తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలను దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార బీఆర్ఎస్తోపాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రేఖా నాయక్, మైనంపల్లితో మొదలు... బీఆర్ఎస్ దాదాపు రెండున్నర నెలల కిందటే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అప్పట్లో ఒకరిద్దరు నేతలు మినహా మరెవరూ ఆ పార్టీని వీడలేదు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో ఆమె అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. ఎస్టీ మహిళనైన తనను పార్టీ బలిపశువు చేసిందని , మహిళలను గౌరవించని పార్టీలో కొనసాగలేనంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తాజా జాబితాలో రేఖానాయక్ భర్త శ్యాం నాయక్‌కు టికెట్ కేటాయించింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రెండు టికెట్లు ఆశించి భంగపడటంతో ఏకంగా మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా తనకు, తన కుమారునికి టికెట్లు ఖాయం చేసుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి యూటర్న్...: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించే పార్టీ బీజేపీయేనని... అందుకే ఆ పార్టీలోకి చేరినట్లు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో రేవంత్‌రెడ్డి కూడా రాజగోపాల్‌రెడ్డిని దూషించారు. అదే రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు తన అభిమానులు, కార్యకర్తలంతా కలసి బీఆర్ఎస్ను ఓడించడం ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌కే సాధ్యమవుతుందని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి మునుగోడు టికెట్ తెచ్చుకున్నారు. ఆల్ పార్టీ నేత నాగం...: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఒక్కప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011లో టీడీపీకి రాజీనామా చేశాక సొంత పార్టీ పెట్టిన ఆయన 2013లో బీజేపీలో చేరిపోయారు. 2018లో ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్ ఆయనకు నాగర్‌కర్నూల్ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని దుర్భాషలాడుతూ అధికార బీఆర్ఎస్లో చేరిపోయారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో ఏకంగా కోర్టుకెక్కిన నాగం... తాజాగా అదే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరిదీ అదే దారి... ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే టికెట్లు పొందారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తనకు టికెట్ లభించే అవకాశం ఉన్న బీజేపీలో జాయిన్ అయ్యారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా నామినేట్ అయిన కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, ఆయన సతీమణి బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరగా ఆ వెంటనే ఆయనకు శేరిలింగంపల్లి టికెట్ లభించింది. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకునిగా ఉన్న మనోహర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆయనకు తాండూరు టికెట్ లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి జంప్ కాగానే ఆయనకు కల్వకుర్తి సీటు ఖరారైంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరగానే ఆయనకు టికెట్ కేటాయించిందా పార్టీ. నేరేడుచర్ల మున్సిపల్ వైస్–చైర్పర్సన్ శ్రీలతారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఆమెకు హుజూర్నగర్ టికెట్ దక్కే అవకాశం ఉంది. కొందరికి భవిష్యత్ పై హామీలు... కాంగ్రెస్, బీజేపీలో టికెట్ల రగడతో బీఆర్ఎస్లోకి సైతం భారీగానే మాజీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. అయితే వారికి ఇప్పటికిప్పుడు సీట్లు కేటాయించే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని అధికార పార్టీ హామీలు ఇస్తోంది. ఇలా చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు/మంత్రులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎ.చంద్రశేఖర్, ఎర్ర శేఖర్, గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, మెదక్ డీసీసీ అధక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, రాగిడి లక్ష్మారెడ్డి, నిర్మల్ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కొత్తగూడెం బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని తదితరులు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించడంతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
అధికారమే లక్ష్యంగా కొట్లాడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా కొట్లాడాలని ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ సహా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మేడ్చల్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్, భువనగిరి నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. నేతలందరినీ రాహుల్‌కు రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి నేతలను ఆహ్వనించిన రాహుల్, వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇప్పటికే పార్టీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే పార్టీ విజయం తథ్యమన్నారు. కొత్త, పాత తారతమ్యాలను పక్కనపెట్టి నేతలంతా ఒక్కటిగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. -
TS: టికెట్ దక్కని సిట్టింగ్‌లకు ‘పవర్’ కట్
సాక్షి, హైదరాబాద్: ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించి నెల రోజులు కావస్తోంది. మరో నాలుగు నియోజకవ ర్గాలు జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లిలో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేశారు. మల్కాజిగిరి స్థానం నుంచి టికెట్ ఇచ్చినా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీ నామా చేయడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేస్తూ, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న పార్టీ అభ్యర్థులను బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రాథోడ్ బాపూరావు (బోథ్), భేతి సుభాష్‌రెడ్డి (ఉప్పల్), తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘన్పూర్), రాములు నాయక్ (వైరా), చెన్నమనేని రమేశ్ బాబు (వేములవాడ), గంప గోవర్ధన్ (కామారెడ్డి) టికెట్ దక్కకున్నా పార్టీలోనే కొనసాగుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు కేసీఆర్ భరోసా ఇవ్వడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటనలు చేశారు. కామారెడ్డిలో స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండటంతో గంప గోవర్ధన్ పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు. అధికారాలకు కత్తెర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ ఇతరులకు అవకాశం ఇచ్చిన నియోజ కవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పనితీరును సీఎం కె.చంద్రశేఖర్‌రావు మదింపు చేశారు. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు పార్టీ అభ్యర్థి ఇద్దరూ క్షేత్రస్థాయి లో పర్యటనలు చేస్తుండటంతో పార్టీ కేడర్ అయోమయా నికి గురవు తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఇన్నాళ్లూ కలిసి పనిచేసిన నేతలు పార్టీ అభ్యర్థుల వెంట తిరిగేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితి పార్టీకి నష్టం చేస్తుందనే అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ పార్టీ అధికారిక అభ్యర్థితో కలిసి పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులోభాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి అందే ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవద్దనే సంకేతాలు స్థానిక నేతలకు వెళ్లాయి. మరోవైపు అధికారిక యంత్రాంగానికి కూడా ఇదే తరహా సంకేతాలు అందినట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గ స్థాయిలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహాయ నిరాకరణ ఎదురవు తోంది. స్థానిక నేతలు, పార్టీ కేడర్ ఒకరొకరుగా అధికారిక అభ్యర్థికి చేరువవుతుండగా, అధికార కార్యకలా పాల్లో వీరి పాత్ర నామమాత్రంగా మారు తోంది. దీంతో తమను అధికార కార్యకలాపాలకు దూరంగా పెట్టడంపై టికెట్ దక్కని సిట్టింగులు అసంతృప్తికి లోనవుతున్నారు. వేములవాడ చెన్న మనేని రమేశ్ బాబును వ్యవసాయ రంగ ప్రధాన సలహా దారుగా నియమించడంతో ఆయన నియోజకవర్గానికి ఇప్పటికే దూరంగా ఉంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకపోయినా ఆయన నియోజకవర్గంలో విస్తృ తంగా పర్యటించగా తాజాగా పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజీ కుదిరింది. రాజయ్యకు ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కేడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుండగా, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా ఇప్పటికే పార్టీ కీలక నేతలు దూరం పాటిస్తున్నారు. -
బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో ప్రకటనను ఆయన విడుదల చేశారు. మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు.మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మైనంపల్లి తన కుమారుడు రోహిత్‌కు మెదక్ నుంచి పార్టీ టికెట్ ఆశించారు. ఈ క్రమంలో గత నెల 21న బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్ కేటాయించిన కేసీఆర్.. రోహిత్‌కు మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా బీఆర్ఎస్ వేచి చూసే ధోరణి అవలంభించింది. ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌పై త్వరలో ప్రకటన నెల రోజుల క్రితం మైనంపల్లి ధిక్కార స్వరం వినిపించిన మరుక్షణం నుంచే కేసీఆర్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఎంపీగా పోటీ చేసిన మర్రి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచే ఆయన పోటీ చేస్తారని భావించినా, తాజా పరిణామాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను ఇచ్చి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయించే యోచన లో కేసీఆర్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
కార్యాచరణపై రేపు మైనంపల్లి భేటీ
అల్వాల్: ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన కోసం పార్టీ శ్రేణులు, అనుచరులతో శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో ఆయన చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తనతోపాటు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంత్రి హరీశ్ వైఖరి పట్ల ఘాటు విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యల పట్ల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తమదైన శైలిలో స్పందించారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం జరుగున్న ఈ సమావేశంలో తాను తీసుకునే నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు, అనుచరులకు మైనంపల్లి వెల్లడించే అవకాశం ఉంది. పార్టీ మారుతారనే ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న సమావేశంపై అంతటా ఆసక్తి నెలకొంది. శనివారం 10 గంటలకు దూపల్లిలోని తన నివాసం వద్ద ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు అందరు హాజరు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన సమాచారం అందించారు. దీంతోపాటు మైనంపల్లికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సొంత పార్టీ నేతలపై మైనంపల్లి అనుచరులు ఎదురు దాడికి దిగుతున్నారు. -
మైనంపల్లికి ప్రత్యామ్నాయం!.. తెరమీదకు మర్రి,శంభీపూర్ రాజు పేర్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. అలాంటి వారిపై కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది. అసంతృప్తి, అసమ్మతి పేరిట పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తే వేటు వేయడానికి కూడా వెనుకాడేది లేదన్న సంకేతాలను ఇస్తోంది. ఈ సమయంలో మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు మంగళవారం సైతం.. తన కుమారునికి మెదక్ టికెట్ విషయంలో తాను పార్టీ పై కాని, సీఎంపై కానీ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అంటూనే తనను ఎవరు టచ్ చేసినా వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాట్లాడడం, హైదరాబాద్ వెళ్లాక కార్యాచరణ ప్రకటిస్తానంటూ వ్యాఖ్యానించడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. మైనంపల్లికి వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు గళం విప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం చేయడం, అదే సమయంలో ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం సంబంధిత అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక టికెట్లు రాక అసంతృప్తితో ఉన్న ఇతర నేతలను సాధ్యమైనంత వరకు బుజ్జగించే యత్నాలు చేస్తూనే, పార్టీ గీత దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తెరపైకి కొత్తపేర్లు మైనంపల్లి స్థానంలో ఇతరులకు టికెట్ కేటాయించేందుకు పార్టీ సన్నద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. మండలి సభ్యుడు శంభీపూర్ రాజు, పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ కార్మిక విభాగం నేత, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించి అభ్యరి్థగా ప్రకటించడంపైనా మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. మైనంపల్లికి కాంగ్రెస్ ఆఫర్! తిరుమల పర్యటనకు వెళ్లిన మైనంపల్లి ఇంకా స్థానిక కేడర్‌కు అందుబాటులోకి రాలేదు. ఆయన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత మల్కాజిగిరి వ్యవహారంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మైనంపల్లికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. మైనంపల్లికి మల్కాజిగిరి, ఆయన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
ముగిసిన కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు భేటీ అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం సీనియర్‌నేత వీ. హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చించామని, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై మాట్లాడినట్లు తెలిపారు. అధిష్టానం దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తామని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాలని వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరారని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం రావాలని దానిపై చర్చించామని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని అన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సమావేశంలో బయట జరుగుతున్న ఊహాగానాలు ఏమి లేవని, ఆదివారం సోనియా గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంపై చర్చించామని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని చర్చించామని తెలిపారు. ఆ కుటుంబం అడుగుజాడల్లో కార్యకర్తలు నడుస్తారని అన్నారు. పార్టీతో కొన్ని ఏళ్లుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలుగా చర్చించుకున్నామని చెప్పారు. ఢిల్లీ సమావేశం పైనే చర్చించామని, వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై మాట్లాడినట్లు తెలిపారు. -
ఒక్కసారి వాడిపడేసినా నిషేధం
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడానికి కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నెల 2 బుధవారం నుంచి ప్లాస్టిక్ భూతానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా ఒక్కసారి ఉపయోగించి పారవేసే గ్లాసులు, స్ట్రాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ సంచుల నిషేధం అమలులోకి రానుంది. ప్రధాని పిలుపుమేరకు జిల్లా యంత్రాంగం దీని నిషేధానికి ఇప్పటికే అవగాహన కల్గిస్తోంది. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా పచ్చదనం.. పరిశుభ్రతలో ప్లాస్టిక్ బ్యాగుల నిషేధానికి ప్రాధాన్యత నిస్తున్నారు. సాక్షి, సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా 647 గ్రామాల్లో 26 రోజులుగా ‘30 రోజుల ప్రణాళిక’ అమలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. ప్రతీ గ్రామసభలోనూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై నిషేధం విషయాన్ని ప్రముఖంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ భూతం వల్ల వాతావరణ, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని గురించి వివరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇందుకు గాను ప్రత్యేకంగా గ్రామసభలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన కూడా ఏ గ్రామానికి వెళ్లినా ప్లాస్టిక్ వినియోగంతో వస్తున్న అనర్థాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొత్తానికి కాకున్నా ఈ విషయంలో ఎంతో కొంత అవగాహన కల్పించడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. దుకాణాల యజమానులు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న క్యారీబ్యాగ్‌లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే విక్రయించాలని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దుకాణదారులతోనే కాకుండా ప్రజలు, వినియోగదారులు సైతం స్వచ్ఛందంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను వాడడం మానేస్తేనే ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రతీ రోజు 6 నుంచి 8 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మన జిల్లాలో ప్రతీ రోజు సుమారుగా 6 నుంచి 8 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటకు వస్తున్నాయని సమాచారం. జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలోనే ఎక్కువ శాతం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణాలు, కూరగాయల వ్యాపారులు, హోటళ్లు, తోపుడు బండ్ల వ్యాపారులు ఈ ప్లాస్టిక్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు. వీరికి ఆయా మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, తదితర వస్తువులను మాత్రమే వాడాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలు, పట్టణ, మండల కేంద్రాలలో తరచుగా దుకాణాలపై దాడులు నిర్వహిస్తుండడంతో వీటి వినియోగం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. కాగా గ్రామాలలో మాత్రం వీటి వినియోగం ఎక్కువైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో టీస్టాల్స్, దుకాణాలలో, విందులు, పెళ్లిళ్ల సమయంలో ఎక్కువగా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లను వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సూచించడంతో ఇప్పటికైనా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడడం తగ్గుతుందేమో వేచి చూడాల్సిందే. గ్రామాల్లోచెత్త బుట్టల పంపిణీ: ప్లాస్టిక్‌తో పాటుగా చెత్తాచెదారాన్ని ఎక్కడంటే అక్కడ పారబోయకుండా ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. 30 రోజుల పల్లె ప్రణాళికలో భాగంగా ప్రతి రోజు వినియోగిస్తున్న వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి బుట్టలలో ప్రత్యేకంగా వేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రభుత్వం ఆకుపచ్చ, నీలం చెత్త బుట్టలను ఇంటింటికీ పంపిణీ చేసింది. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. స్వయంగా శ్రమదానంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ లేదా గ్రామపంచాయతీ వారు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డులలో వేయాల్సి ఉంటుంది. అక్కడవేసి మేనేజ్మెంట్ ప్రక్రియ ద్వారా రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. డంపింగ్ యార్డులు జిల్లాలో దాదాపుగా 70శాతం గ్రామాలలో అందుబాటులో లేకపోవడంతో ఎక్కడంటే అక్కడే చెత్తను పారబోసేవారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుతో పాటుగా శ్మశాన వాటికలకు స్థలాలను కేటాయిస్తున్నారు. వీటి నిర్మాణాలు కూడా జిల్లాలోని చాలా గ్రామాలలో ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణాలు పూర్తయితే ఇక ఏ గ్రామంలోనూ రోడ్లపై చెత్త వేసే అవకాశమే లేకుండా పోతుంది. గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచడానికి మనవంతు కృషిచేయడమే జాతిపితకు మనం అర్పించే ఘన నివాళిగా పేర్కొనవచ్చు. -
శరవేగంగా గజ్వేల్ అభివృద్ధి
గజ్వేల్ : సీఎం కేసీఆర్ చొరవతో గజ్వేల్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని, ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికే నమూనాగా చూపడానికి ప్రయత్నం జరుగుతున్నని ‘గడ’ఓఎస్డీ హన్మంతరావు తెలిపారు. శనివారం గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కృషిని కొనియాడారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై కేసీఆర్ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత రూపురేఖలు మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, తూప్రాన్, కొండపాక మండలాల్లో 300 కిలోమీటర్లు ఆర్అండ్బీ, మరో 300 కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నిర్మాణం జరుగుతుండగా ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అదే విధంగా ప్రతి మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడమేగాకుండా వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఆడిటోరియం నిర్మాణం జరుగుతుందని, అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరలోనే చేపట్టబోతున్నామన్నారు. ఈ కార్యాలయ ప్రాంగణంలో 40 ప్రభుత్వ శాఖలు పనిచేస్తాయని చెప్పారు. భవన నిర్మాణానికి సంబంధించి కొద్దిపాటి మార్పులు చేయడానికి సీఎం నిర్ణయించడం వల్ల పనుల ప్రారంభంలో జాప్యం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ పనులకు కూడా అంకురార్పణ జరుగుతుందన్నారు. అదే విధంగా రూ. 100 కోట్లకు పైగా వ్యయంతో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. దీంతో పట్టణ పేదలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘మోడల్ కాలనీ’నిర్మాణ పనులకు సైతం మార్గం సుగమమైందన్నారు. మొదటి దశలో 1250 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. ప్రస్తుత జూనియర్ కళాశాల ప్రాంగణంలో అధునాతన హంగులతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి కావచ్చాయని, త్వరలో కొత్త భవనంలో వైద్య సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పాత భవనాన్ని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇవే కాకుండా మానవ అభివృద్ధి సూచికలైన శిశు మరణాల నివారణ, మహిళా సంక్షేమం, ఇతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, గజ్వేల్ ప్రెస్‌క్లబ్ కన్వీనర్ పి. ఎల్లారెడ్డి పాల్గొన్నారు. కాగా గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన తొలి ప్రెస్‌మీట్‌ని హన్మంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ సమస్యలపై హన్మంతరావుకు వినతిపత్రం అందజేశారు.