మర్రి రాజశేఖర్‌రెడ్డి , శంభీపూర్ రాజు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిపై బీఆర్‌ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. అలాంటి వారిపై కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది. అసంతృప్తి, అసమ్మతి పేరిట పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తే వేటు వేయడానికి కూడా వెనుకాడేది లేదన్న సంకేతాలను ఇస్తోంది.
ఈ సమయంలో మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు మంగళవారం సైతం.. తన కుమారునికి మెదక్ టికెట్ విషయంలో తాను పార్టీ పై కాని, సీఎంపై కానీ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అంటూనే తనను ఎవరు టచ్ చేసినా వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాట్లాడడం, హైదరాబాద్ వెళ్లాక కార్యాచరణ ప్రకటిస్తానంటూ వ్యాఖ్యానించడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది.
మైనంపల్లికి వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు గళం విప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం చేయడం, అదే సమయంలో ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం సంబంధిత అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక టికెట్లు రాక అసంతృప్తితో ఉన్న ఇతర నేతలను సాధ్యమైనంత వరకు బుజ్జగించే యత్నాలు చేస్తూనే, పార్టీ గీత దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
తెరపైకి కొత్తపేర్లు
మైనంపల్లి స్థానంలో ఇతరులకు టికెట్ కేటాయించేందుకు పార్టీ సన్నద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. మండలి సభ్యుడు శంభీపూర్ రాజు, పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ కార్మిక విభాగం నేత, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించి అభ్యరి్థగా ప్రకటించడంపైనా మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది.
మైనంపల్లికి కాంగ్రెస్ ఆఫర్!
తిరుమల పర్యటనకు వెళ్లిన మైనంపల్లి ఇంకా స్థానిక కేడర్‌కు అందుబాటులోకి రాలేదు. ఆయన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత మల్కాజిగిరి వ్యవహారంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మైనంపల్లికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. మైనంపల్లికి మల్కాజిగిరి, ఆయన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment