సాక్షి, హైదరాబాద్: ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించి నెల రోజులు కావస్తోంది. మరో నాలుగు నియోజకవ ర్గాలు జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లిలో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేశారు. మల్కాజిగిరి స్థానం నుంచి టికెట్ ఇచ్చినా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీ నామా చేయడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేస్తూ, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న పార్టీ అభ్యర్థులను బలోపేతం చేసే దిశగా బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రాథోడ్ బాపూరావు (బోథ్), భేతి సుభాష్‌రెడ్డి (ఉప్పల్), తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘన్‌పూర్), రాములు నాయక్ (వైరా), చెన్నమనేని రమేశ్ బాబు (వేములవాడ), గంప గోవర్ధన్ (కామారెడ్డి) టికెట్ దక్కకున్నా పార్టీలోనే కొనసాగుతున్నారు.
వారి రాజకీయ భవిష్యత్తుకు కేసీఆర్ భరోసా ఇవ్వడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటనలు చేశారు. కామారెడ్డిలో స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండటంతో గంప గోవర్ధన్ పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు.
అధికారాలకు కత్తెర
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ ఇతరులకు అవకాశం ఇచ్చిన నియోజ కవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పనితీరును సీఎం కె.చంద్రశేఖర్‌రావు మదింపు చేశారు. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు పార్టీ అభ్యర్థి ఇద్దరూ క్షేత్రస్థాయి లో పర్యటనలు చేస్తుండటంతో పార్టీ కేడర్ అయోమయా నికి గురవు తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఇన్నాళ్లూ కలిసి పనిచేసిన నేతలు పార్టీ అభ్యర్థుల వెంట తిరిగేందుకు వెనుకంజ వేస్తున్నారు.
ఈ పరిస్థితి పార్టీకి నష్టం చేస్తుందనే అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ పార్టీ అధికారిక అభ్యర్థితో కలిసి పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులోభాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి అందే ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవద్దనే సంకేతాలు స్థానిక నేతలకు వెళ్లాయి. మరోవైపు అధికారిక యంత్రాంగానికి కూడా ఇదే తరహా సంకేతాలు అందినట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గ స్థాయిలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహాయ నిరాకరణ ఎదురవు తోంది. స్థానిక నేతలు, పార్టీ కేడర్ ఒకరొకరుగా అధికారిక అభ్యర్థికి చేరువవుతుండగా, అధికార కార్యకలా పాల్లో వీరి పాత్ర నామమాత్రంగా మారు తోంది.
దీంతో తమను అధికార కార్యకలాపాలకు దూరంగా పెట్టడంపై టికెట్ దక్కని సిట్టింగులు అసంతృప్తికి లోనవుతున్నారు. వేములవాడ చెన్న మనేని రమేశ్ బాబును వ్యవసాయ రంగ ప్రధాన సలహా దారుగా నియమించడంతో ఆయన నియోజకవర్గానికి ఇప్పటికే దూరంగా ఉంటున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకపోయినా ఆయన నియోజకవర్గంలో విస్తృ తంగా పర్యటించగా తాజాగా పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజీ కుదిరింది. రాజయ్యకు ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ కేడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుండగా, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా ఇప్పటికే పార్టీ కీలక నేతలు దూరం పాటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment