సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో ప్రకటనను ఆయన విడుదల చేశారు. మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు.మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మైనంపల్లి తన కుమారుడు రోహిత్‌కు మెదక్ నుంచి పార్టీ టికెట్ ఆశించారు.
ఈ క్రమంలో గత నెల 21న బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్ కేటాయించిన కేసీఆర్.. రోహిత్‌కు మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా బీఆర్‌ఎస్ వేచి చూసే ధోరణి అవలంభించింది. ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌పై త్వరలో ప్రకటన
నెల రోజుల క్రితం మైనంపల్లి ధిక్కార స్వరం వినిపించిన మరుక్షణం నుంచే కేసీఆర్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
ఎంపీగా పోటీ చేసిన మర్రి
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచే ఆయన పోటీ చేస్తారని భావించినా, తాజా పరిణామాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను ఇచ్చి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయించే యోచన లో కేసీఆర్ ఉన్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment