ఫార్మాసిటీలో 1,700 కోట్ల పెట్టుబడి
యూనిట్ స్థాపనకు ముందుకొచ్చిన ఫెర్రింగ్ ఫార్మా
♦ సీఎం కేసీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ
♦ కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్ హెడ్‌క్వార్టర్స్‌గాగల ప్రముఖ బహుళజాతి సంస్థ ఫెర్రింగ్ ఫార్మా తెలంగాణలో నూతన యూనిట్ స్థాపనకు ముందుకొచ్చింది. ప్రతిపాదిత ఫార్మాసిటీలో 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 670 కోట్లు) నుంచి 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,700 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధులు సోమవారం సీఎం కేసీఆర్‌ను కలసి తమ ప్రతిపాదనలను వివరించారు. 1.5 బిలియన్ యూరోల (సుమారు రూ. 11 వేల కోట్లు) వార్షిక టర్నోవర్‌గల తమకు అర్జెంటీనా, చైనా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, ఇజ్రాయెల్, మెక్సికో, స్కాట్లాండ్, స్విట్జర్లాండ్‌లలో తొమ్మిది ప్లాంట్లతోపాటు ఇతర దేశాల్లో మరో తొమ్మిది చోట్ల పరిశోధన, అభివృద్ధి యూనిట్లు ఉన్నట్లు వెల్లడించారు.
భారత్‌లో ఇప్పటికే మహారాష్ట్రలో 2 ప్లాంట్లు ఏర్పాటు చేశామని...తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నామని కంపెనీ చైర్మన్ ఫ్రెడరిక్ పాల్సన్, సంస్థ భారత్ విభాగం చీఫ్ అశోక్ అలాటే సీఎంకు వివరించారు. తమ యూని ట్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతామని, విషపూరిత రసాయనాలు వాడకుండా సురక్షిత ఔషధాలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ లో మూడింట ఒక వంతు హైదరాబాద్ పరిసరాల్లోని ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నవేనన్నారు. దీనివల్ల ప్రబలుతున్న కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అందుకోసమే ఫార్మా పరిశ్రమల యూనిట్లను ఒకే చోటకు తెచ్చి హైదరాబాద్ శివారులోని ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఔషధాల ఉత్పత్తిలో అమెరికాతోపాటు స్కాండినేవియా (డెన్మార్క్, నార్వే, స్వీడెన్) తదితర దేశాలు పాటిస్తున్న జాగ్రత్తల్ని అధ్యయనం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఫార్మాసిటీకి అనుబంధం గా ప్రత్యేక టౌన్‌షిప్, కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా ఫార్మా వర్సిటీని కూడా స్థాపిస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటివరకు 82 కంపెనీలకు అనుమతి ఇచ్చినట్లు చెబుతూ టీఎస్ ఐపాస్ విధాన ప్రతిని సంస్థ ప్రతినిధులకు అందజేశారు. ఈ భేటీలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.