ts ipaas
-
ఫార్మాసిటీలో 1,700 కోట్ల పెట్టుబడి
యూనిట్ స్థాపనకు ముందుకొచ్చిన ఫెర్రింగ్ ఫార్మా ♦ సీఎం కేసీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ ♦ కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్ హెడ్క్వార్టర్స్గాగల ప్రముఖ బహుళజాతి సంస్థ ఫెర్రింగ్ ఫార్మా తెలంగాణలో నూతన యూనిట్ స్థాపనకు ముందుకొచ్చింది. ప్రతిపాదిత ఫార్మాసిటీలో 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 670 కోట్లు) నుంచి 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,700 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధులు సోమవారం సీఎం కేసీఆర్‌ను కలసి తమ ప్రతిపాదనలను వివరించారు. 1.5 బిలియన్ యూరోల (సుమారు రూ. 11 వేల కోట్లు) వార్షిక టర్నోవర్‌గల తమకు అర్జెంటీనా, చైనా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, ఇజ్రాయెల్, మెక్సికో, స్కాట్లాండ్, స్విట్జర్లాండ్లలో తొమ్మిది ప్లాంట్లతోపాటు ఇతర దేశాల్లో మరో తొమ్మిది చోట్ల పరిశోధన, అభివృద్ధి యూనిట్లు ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌లో ఇప్పటికే మహారాష్ట్రలో 2 ప్లాంట్లు ఏర్పాటు చేశామని...తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నామని కంపెనీ చైర్మన్ ఫ్రెడరిక్ పాల్సన్, సంస్థ భారత్ విభాగం చీఫ్ అశోక్ అలాటే సీఎంకు వివరించారు. తమ యూని ట్ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతామని, విషపూరిత రసాయనాలు వాడకుండా సురక్షిత ఔషధాలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ లో మూడింట ఒక వంతు హైదరాబాద్ పరిసరాల్లోని ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నవేనన్నారు. దీనివల్ల ప్రబలుతున్న కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసమే ఫార్మా పరిశ్రమల యూనిట్లను ఒకే చోటకు తెచ్చి హైదరాబాద్ శివారులోని ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఔషధాల ఉత్పత్తిలో అమెరికాతోపాటు స్కాండినేవియా (డెన్మార్క్, నార్వే, స్వీడెన్) తదితర దేశాలు పాటిస్తున్న జాగ్రత్తల్ని అధ్యయనం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఫార్మాసిటీకి అనుబంధం గా ప్రత్యేక టౌన్షిప్, కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా ఫార్మా వర్సిటీని కూడా స్థాపిస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటివరకు 82 కంపెనీలకు అనుమతి ఇచ్చినట్లు చెబుతూ టీఎస్ ఐపాస్ విధాన ప్రతిని సంస్థ ప్రతినిధులకు అందజేశారు. ఈ భేటీలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
'అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన టీఎస్ ఐపాస్ విధానం అమలులోనూ అంతే వేగంతో ముందుకు వెళుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రెండు వారాల్లోపే 17 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పెద్దపెద్ద కంపెనీలన్నీ ఆసక్తి చూపుతున్నాయన్నారు. తన అమెరికా పర్యటనలోనూ పలు కంపెనీలు తెలంగాణ వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. పరిశ్రమల్లో ఉపాధి పొందగోరే యువకుల కోసం పది జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఓటుకు కోట్లు కేసుపై స్పందిస్తూ దొరికిన దొంగ తప్పించుకునే ప్రయత్నాలు.. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధిని ఏ విధంగానూ ప్రభావం చూపవన్నారు. -
ఆచితూచి అనుమతులు
- పరిశ్రమల చిత్తశుద్ధిపై లోతుగా కసరత్తు - వడపోత తర్వాతే భూకేటాయింపులు - నిర్మాణం పూర్తయ్యాకే సేల్ డీడ్ ఇచ్చేలా నిబంధన - రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభించకుంటే భూములు వెనక్కి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్) ద్వారా పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరుస్తూనే పరిశ్రమలకు భూముల కేటాయింపులో పారదర్శకత కు పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు భూకేటాయింపు ప్రక్రియ వివాదాస్పదమైన నేపథ్యంలో ఆచితూచి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు పక్షం రోజుల్లోనే అనుమతులు ఇస్తామని సీఎం సహా అధికారులు ప్రకటించినా మెగా ప్రాజెక్టుల విషయంలో దరఖాస్తులను ప్రభుత్వం నిశితంగా పరిశీలించి వడపోయనుంది. పెట్టుబడిదారులతో సీఎం, పరిశ్రమలశాఖ అధికారులు సమావేశమై కంపెనీ శక్తి సామర్థ్యాలపై కసరత్తు చేయనున్నారు. కంపెనీల చిత్తశుద్ధిని అంచనా వేశాకే అనుమతులపై ముందడుగు వేయనున్నారు. దరఖాస్తుదారుడికి వాస్తవంగా ఎంత భూమి అవసరమనే అంశాన్ని నిగ్గు తేల్చేందుకు సాంకేతిక నిపుణులతో కూడిన బృందం సమగ్ర ప్రాజెక్టు నివేదికను మదింపు చేయనుంది. భూకేటాయింపు ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తుదారుడు టీఎస్ఐఐసీతో ‘అగ్రిమెంట్ ఆఫ్ సేల్’ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే సంబంధిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తైఉత్పత్తి ప్రారంభించాకే ‘సేల్ డీడ్’ ఇవ్వనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అగ్రిమెంట్ ఆఫ్ సేల్‌ను ఏ సమయంలోనైనా రద్దు చేసేలా నిబంధన విధించనున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించని సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోనున్నారు. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ సబ్స్టేషన్లు, పోలీసు ఔట్‌పోస్టులు, ఫైర్ స్టేషన్లు, ఈ-సేవా కేంద్రాలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు తదితర సౌకర్యాల కోసం కొంత భూమిని ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ భూముల కేటాయింపుల్లో పారదర్శకత కోసం మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. 3 సంస్థల ద్వారా కేటాయింపులు పెట్టుబడిదారులుకు పారదర్శకంగా భూకేటాయింపులు చేసే బాధ్యతను మూడు రకాల సంస్థలకు అప్పగించారు. రూ.200 కోట్లకుపైగా పెట్టుబడి ఉండే మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ (ఎస్ఐపీసీ) అనుమతులు ఇవ్వనుంది. రూ.5 కోట్ల పైబడి పెట్టుబడులు ఉండే పరిశ్రమలకు టీఎస్ఐఐసీ ఎండీ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి అలాట్మెంట్ కమిటీ (ఎస్ఎల్ఏసీ) అనుమతులు మంజూరు చేయనుంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ (డీఐపీసీ) అనుమతులు ఇవ్వనుంది. ధరల నిర్ణయం టీఎస్‌ఐఐసీదే! పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల ధరలను నిర్ణయించే బాధ్యత టీఎస్ఐఐసీ చేపట్టనుంది. ప్రభుత్వం గుర్తించిన పార్కుల్లో కాకుండా ప్రైవేటు భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపే వారి కోసం భూసేకరణ చట్టం నిబంధనల మేరకు టీఎస్ఐఐసీ భూసేకరణ జరుపుతుంది. ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం...మౌలిక సౌకర్యాలు మాత్రం టీఎస్ఐఐసీ నిబంధనల మేరకు ఉండాలని స్పష్టం చేస్తోంది. భూవినియోగం, లేఔట్ అనుమతి, పర్యావరణ అనుమతుల వంటి బాధ్యతలన్నీ టీఎస్ఐఐసీకి అప్పగిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన 1.45 లక్షల ఎకరాలను గుర్తించి టీఎస్ఐఐసీకి రెవెన్యూశాఖ బదిలీ చేసింది.