సాగర్- కర్నూలు రహదారులకు మహర్దశ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీ స్థాపనతో నాగార్జునసాగర్-కర్నూలు రహదారులకు మహర్దశ పట్టనుంది. ఈ రెండు రోడ్లను అనుసంధానం చేస్తూ నాలుగు లేన్ల మార్గాన్ని నిర్మించడానికి ప్రభుత్వం సముఖత చూపుతోంది. ముచ్చర్లలో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జరిపిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ రెండు రహదారులను కలుపుతూ కొత్త మార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుందని ఫార్మా కంపెనీల అధినేతలు అభిప్రాయపడ్డారు.
దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోడ్డు నిర్మాణం అవసరమని, ఇందుకోసం ప్రతిపాదనలు సమర్పించాలని టీఐఐసీ, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఫార్మాతోపాటు ఫ్యాబ్‌సిటీ, ప్లాస్టిక్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, రైస్‌హాబ్‌లు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించారు. కరెంట్ అవసరాలు తీర్చేందుకు భారీ సామర్థ్యంగల సబ్‌స్టేషన్లను ఇక్కడ ఏర్పాటు చేస్తామని, నీటికొరత రాకుండా కృష్ణాజలాలను కూడా విరివిగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
శభాష్ శ్రీధర్..!
కలెక్టర్ శ్రీధర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఫార్మా రంగ దిగ్గజాలను ఆకట్టుకునేలా ఘనమైన ఆతిథ్యం ఇచ్చారని అభినందించారు. తన పర్యటన ఖరారైన రెండు రోజుల్లోనే ప్రతిపాదిత ఫార్మాసిటీ ప్రాంతం రూపురేఖలు మార్చేలా ఏర్పాట్లు చేశారని కితాబునిచ్చారు.