
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీకి ప్రత్యేక రైల్వేలైన్ వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ఔషధరంగ దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో సరుకు రవాణాకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ప్రాజెక్టు సమగ్ర నివేదికలో పొందుపరిచింది. వారం రోజుల క్రితం యాచారం మండ లం మేడిపల్లిలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ’పై ప్రజాభిప్రాయసేకరణ జరిపిన సర్కారు.. ఇందులో ఈపీటీఆర్‌ఐ రూపొందించిన పర్యావరణ ప్రభావం, అంచనా(ఈఐఏ) నివేదికను బహిర్గతం చేసింది. ఈ క్రమంలోనే షాద్‌నగర్ నుంచి ప్రత్యేక రైల్వేలైన్‌ను ప్రస్తావించింది.
సికింద్రాబాద్ నుంచి కర్నూలు మీదుగా డోన్ వెళ్లే బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్‌ను అనుసంధానం చేస్తూ ఫార్మాసిటీకి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఔషధనగరికి దక్షిణం వైపు ఉత్తర–దక్షిణ దిశలో 33కి.మీ. (షాద్‌నగర్ చేరువలో)దూరంలో ఈ లైన్‌ను కలిపితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ రైలు మార్గాన్ని ప్రయాణికుల అవసరాలకు కాకుండా సరుకు రవాణాకే వినియోగించుకోవాలని ప్రతిపాదించింది. తద్వారా వివిధ పరిశ్రమలు తయారుచేసే ఉత్పత్తులను సులువుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చని అంచనా వేసింది. మరోవైపు ప్రాజెక్టుకు నలు దిశలా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
రీజినల్ రింగ్‌రోడ్డు సహా ప్రస్తుత ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ఫార్మాసిటీని కలుపుతూ ప్రత్యేక మార్గాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కందుకూరు– యాచారం మీదుగా నాగార్జునసాగర్ హైవేను లింకు చేస్తూ రోడ్డు విస్తరణ పనులను ఆర్‌అండ్‌బీ చేపట్టింది. మరోవైపు రావిర్యాల దగ్గర ఔటర్ ఎగ్జిట్ 13 నుంచి కూడా ఒక రహదారిని ప్రతిపాదించింది. శ్రీశైలం జాతీయ రహదారి–సాగర్ హైవేను అనుసంధానిస్తూ మరికొన్ని రోడ్లను నిర్మించనున్నట్టు ఈఐఏ నివేదికలో స్పష్టం చేసింది.
జిల్లాను రెండో జోన్‌లో కొనసాగించాలి
దోమ(పరిగి): వెనుకబడిన వికారాబాద్ జిల్లాను (పాత జోనల్) రెండో జోన్‌లోనే కొనసాగించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతయ్యగౌడ్, దోమ మండల అధ్యక్షుడు గిరమోని గోపాల్ అన్నారు. జిల్లాను పూర్వ రంగారెడ్డి జిల్లాలో కలపి రెండో జోన్‌లో కొనసాగించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు పీఆర్‌టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా జిల్లాను 1వ జోన్‌లో కలపడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అంగీకరించేది లేదని ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని రెండో జోన్‌లోనే కలపాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ముందు ముందు ఉపాధ్యయ సంఘాల తరుపున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పురందాస్, రాష్ట్ర కార్యదర్శి హరిలాల్, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment