
‘ముచ్చర్ల’లో హడావుడి
ముచ్చర్ల ప్రాంతంలో ఆదివారం ఉన్నతాధికారులు హడావుడి చేశారు.
ముచ్చర్ల ప్రాంతంలో ఆదివారం ఉన్నతాధికారులు హడావుడి చేశారు. ఫార్మాసిటీకి అనువైన భూములను పరిశీలించారు. 3న సీఎం కేసీఆర్‌తోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కందుకూరు మండలం ముచ్చర సమీపంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి బీఆర్ మీనా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, టీఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, కలెక్టర్ ఎన్.శ్రీధర్, మహబూబ్‌నగర్ కలెక్టర్ ప్రియదర్శిని, జేసీ చంపాలాల్ ముచ్చర్ల పరిసరాల్లో పర్యటించారు. సర్వే నంబర్లు, మ్యాప్‌లతో ప్రభుత్వ భూముల పరిధిపై ఆరా తీశారు. అదే రోజు సీఎం పర్యటించనున్న మంచాల సమీపంలోని రాచకొండ గుట్టల్లో ఓఎస్‌డీ అడిషనల్ ఎస్పీ రాధాకిషన్‌రావుతోపాటు పోలీస్ ఉన్నతాధికారులు మోహన్‌రెడ్డి, శివరాంరెడ్డి పర్యటించారు. సమీప తండాలను పోలీసు బృందాలు జల్లెడ పట్టాయి.
కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫార్మాసిటీ ఏర్పాటుకు అవసరమైన భూముల పరిశీలనకు ఉన్నతాధికారుల బృందం ఆదివారం కందుకూరు మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూములను పరిశీలించింది. ఈ నెల 3న మండల పరిధిలోని ముచ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్లు మండలం పరిధిలోని భూములను పరిశీలించడానికి సీఎం కేసీఆర్ తో పాటు ఫార్మారంగ సంస్థల అధినేత లు తరలిరానుండటంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలివచ్చింది. పరిశ్రమల ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, టీఎస్ ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు ఎన్.శ్రీధర్, ప్రియదర్శినిలతోపాటు ఆయా జిల్లాల ఉన్నతాధికారులు తరలివచ్చారు.
ఉన్నతాధికారులు ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 288లోని ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యాప్‌ల ద్వారా ఎక్కడ ఎంత భూమి లభ్యమవుతుందో తెలుసుకున్నారు. సర్వే నంబర్ 288లోని 2747 ఎకరాలతో పాటు మహబూబ్‌నగర్‌జిల్లా పరిధిలోని సర్వేనంబర్ 260లో ఉన్న 1800 ఎకరాల భూములు ఫార్మాసిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయా లేదా అనే విషయాన్ని సర్వే మ్యాప్‌ల ద్వారా పరిశీలించారు. సీఏం ఏరియల్ వీక్షణానికి వచ్చేటప్పటికీ సరిహద్దులు కన్పించేలా పెద్ద పెద్ద జెండాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండు జిల్లాల డీఎఫ్‌ఓలు, ఏడీఏలు, జేసీలు కూర్చొని రికార్డులను సిద్ధం చేయాలన్నారు. కాగా ఆ భూములకు దగ్గర్లో ఉన్న మీర్కాన్‌పేటలోని సర్వేనంబర్ 112, 120ల్లోని 1200 ఎకరాల భూమి విషయమై ఆరా తీశారు. అనంతరం హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేసి వెనుదిరిగారు.
నాలుగు హెలిప్యాడ్లు..
కాగా ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూముల పరిశీలనకు సీఎం బృందాన్ని తీసుకొచ్చే నాలుగు హెలికాప్టర్ల కోసం ఆ భూముల్లో అనువైన స్థలాలను ఎంపిక చేసి హెలిప్యాడ్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సిబ్బందిని ఆదేశించారు. భోజన వసతి, లోనికి వెళ్లడానికి మార్గాన్ని సిద్ధం చేయాలని సూచించారు. వారి వెంట రెండు జిల్లాల జేసీలు చంపాలాల్, శర్మ, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ టీవీ శశిధర్‌రెడ్డి, ఎల్‌బీనగర్ డీసీపీ రవివర్మ, ఆర్డీఓ యాదగిరిరెడ్డి, తహసీల్దార్ సుశీల, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింహ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆశ్చర్యంగా చూసిన స్థానికులు..
కాగా సీఎం కేసీఆర్ ఫార్మాసిటీ నెలకొల్పనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఉన్నతాధికారుల బృందం ఆఘమేఘాల మీద హెలికాప్టర్‌లో రావడంతో స్థానికులు ఆశ్చర్యంతోపాటు సంబరపడుతున్నారు. మహబూబ్‌నగర్‌జిల్లా పరిధిలోని పిరమిడ్ ప్రాంగణంలో హెలికాప్టర్‌లో ఉన్నతాధికారులు, వాహనాల్లో స్థానిక అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫార్మసిటీ ఏర్పాటుకు ఇంత వేగంగా పనులు జరుగుతుండటంపై స్థానికులు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.