లగచర్ల, రోటిబండ, పులిచర్లకుంట తండాల్లో టెన్షన్ టెన్షన్
అర్ధరాత్రి గ్రామాలను చుట్టుముట్టిన300 మంది పోలీసులు
50 మంది రైతులు, యువకుల అరెస్టు.. ముందే తండాలు వదిలివెళ్లిన కొందరు
రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపినమహిళలు, చిన్నారులు, వృద్ధులు
ఉదయం 8 గంటలకల్లా 3 గ్రామాలూ ఖాళీ
కొడంగల్/దుద్యాల్/పరిగి/పూడూరు: కలెక్టర్‌పై జరిగిన దాడితో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో సోమవారం రాత్రి భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయానికల్లా మూడు గ్రామాలూ నిర్మానుష్యంగా మారిపోయాయి.
ఇక్కడ ఫార్మా సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానికులు భూ సేకరణ సమావేశానికి హాజరైన కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాత్రి ఒంటిగంట సమయంలో లగచర్లకు చేరుకున్న సుమారు 300 మంది సాయుధ పోలీసులు 2 గంటల ప్రాంతంలో లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాలను అష్ట దిగ్బంధనం చేశారు.
ఇళ్లలో నిద్రిస్తున్న రైతులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. పిలిచినా స్పందించని వారి తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లారు. మూడు గ్రామాల్లో సుమారు 50 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అనుమానితులను గుర్తించిన పోలీసులు వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఏ ఇంటిని చూసినా తాళాలే..
అర్ధరాత్రి వేళ పోలీసులు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంతో మహిళలు భయాందోళనకు గుర య్యారు. అయితే ఎప్పుడైనా పోలీసులు దాడి చేసే అవకాశం ఉందని ఊహించిన పలువురు సాయంత్రంలోపే బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.
రాత్రి వేళ పోలీసులు రావడంతో భయకంపితులైన మిగిలిన వారు ఉదయాన్నే ఇతర గ్రామాలకు తరలివెళ్లారు. దీంతో ఉదయం 8 గంటల లోపే గ్రామాలు ఖాళీ అయిపోయాయి. గ్రామాల్లో ఏ ఇంటిని చూసి నా తాళాలే దర్శనమిచ్చాయి. పశువులు, గొర్రెలు, మేకలు మాత్రం దొడ్లలోనే ఉన్నాయి.
పోలీసుల అదుపులోనే 16 మంది
అనుమానంతో అదుపులోకి తీసుకున్న సుమారు 50 మందిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూపిస్తూ విచారణ నిర్వహించారు. దాడికి పాల్పడిన వారి, ఇందుకు ప్రేరేపించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఘటనతో సంబంధం ఉన్న 16 మందిని పీఎస్‌లోనే ఉంచుకుని మిగిలిన వారిని వదిలేశారు. 16 మందికి పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వీరిని కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రైతుల దాడిలో గాయపడిన కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి సోమవారం సాయంత్రం నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు.
బీఆర్‌ఎస్ నేతల అరెస్టు
లగచర్లలో ఫార్మా బాధిత రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు.. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, కార్తీక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి లగచర్లకు వెళ్తుండగా చన్గోముల్ పోలీస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సుమారు 40 నిమిషాల తర్వాత హైదరాబాద్ పంపించేశారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల బతుకులను బజారుకీడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని అన్నారు. ఫార్మా కంపెనీ కోసం తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కుని, వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు.
రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోని పక్షంలో బీఆర్‌ఎస్ తరఫున ఆందోళన తప్పదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, ప్రతీకారేచ్ఛతోనే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బీఆర్‌ఎస్ ఏనాడూ అధికారులపై దాడులను ప్రోత్సహించలేదన్నారు.
ఫోన్ లాక్కెళ్లారు.. పరీక్షలు ఉన్నాయన్నా వినలేదు
అర్ధరాత్రి వేళ పోలీసులు వచ్చారు. అప్పుడు మా అత్త దేవీబాయి, నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం. ఇల్లంతా వెతికిన పోలీసులు మగవారు ఎవరూ లేరని గమనించి నా ఫోన్ లాక్కెళ్లారు. నేను పరిగిలోని పల్లవి కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. మంగళవారం ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని, ఫోన్ ద్వారా ప్రిపేర్ కావాలి సార్ అని బతిమాలినా వినలేదు. – అనూష, పులిచెర్లకుంట తండా
Comments
Please login to add a commentAdd a comment