
వికారాబాద్, సాక్షి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దుద్యాల మండలం లగచర్లకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగలడంతో పాటు గ్రామస్తులు దాడి చేశారు.
లగచర్లలో సోమవారం ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ జరిగింది. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ప్రజలతో చర్చించేందుకు కలెక్టర్ సహా అధికారులు వచ్చారు. అయితే ఫార్మా కంపెనీకి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగినట్లు సమాచారం.
ఆపై గ్రామస్తులు పట్టరాని కోపంతో అధికారుల వాహనాలపై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ వెంటనే అధికారులంతా అక్కడి నుంచి వెళ్లేపోయే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లగచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. భారీగా పోలీసులు మోహరించారు.
