Assault on the collector వెనక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించం
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు
కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందం
కేసీఆర్ బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటికొచ్చి మాట్లాడాలి
విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఏదైనా సమస్య ఉంటే అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, వారితో చర్చించడం, న్యాయ స్థానాలకు వెళ్లడం వంటి అవకాశాలుండగా, బీఆర్‌ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. భట్టి బుధవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దని, అభివృద్ధి జరగొద్దనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ కోసం భూసేకరణ చేపట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా రైతుల పక్షాన గొంతెత్తాం. అధికారులను కలిశాం. న్యాయస్థానాలకు వెళ్లాం. పత్రికల ద్వారా నిరసనను తెలియజేశాం. కానీ ఏనాడు ఇలా దాడులకు తెగబడలేదు’అని భట్టి అన్నారు. ఇలా దాడులు చేయించడం సబబేనా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఈ అంశంపై మాట్లాడాలని కోరారు. అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుట్రపూరిత దాడుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగులు అధైర్యపడకుండా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని హితవు పలికారు.
అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు...
ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అత్యంత వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుచేసి పరిశ్రమల అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.
భూములు కోల్పోతున్న రైతులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి.. ఇక్కడికొచ్చే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంలో భాగంగానే రీజినల్ రింగ్ రోడ్– ఔటర్ రింగ్ రోడ్ మధ్య పరిశ్రమల ఏర్పాటుకు క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
బీజేపీ పెద్దలతో కేటీఆర్ ఒప్పందం
ఫార్ములా ఈ–రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దలను కలిసి ఒప్పందం చేసుకున్నాడని భట్టి ఆరోపించారు. అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయమని పిలుపునిచ్చి బీజేపీకి ఓటేయాలని కేటీఆర్ పరోక్షంగా చెప్పారని ఆరోపించారు.
గవర్నర్‌పై సంపూర్ణమైన విశ్వాసం ఉందని, ఫార్ములా ఈ–రేస్ కేసు విచారణకు ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. గవర్నర్ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ఏం చేయాలో అదేవిధంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారని, అధికారులపై దాడిని వారు కనీసం ఖండించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment