సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని కందుకూరు వద్ద ఫార్మా సిటీ నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో పర్యావరణహితమైన మెగా టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఫార్మాసిటీ ఉండకూడదని.. దాన్ని నగరానికి దూరంగా తరలించడం మంచిదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు గత ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్‌బీనగర్ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పలు అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి, సీఎంఓ అధికారులు వి.శేషాద్రి, బి.శివధర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే ఔటర్‌రింగ్‌రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ నగరం నలువైపులా సమంగా అభివృద్ధి చెందాల్సి ఉందని, ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్ మార్చాలని పేర్కొన్నారు.
ఆ రెండు రూట్ల మీదుగా..
‘‘హైదరాబాద్ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్‌మెంట్ మార్చాలి. ఈ మేరకు ఎంజీబీఎస్, ఓల్డ్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు.. అలాగే ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట రూట్‌లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలి. అలాగే మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, పీ–7 రోడ్, లేదా బార్కాస్, పహడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు రూట్లను కూడా పరిశీలించాలి..’’ అని రేవంత్ సూచించారు. ఈ రూట్లలో మెట్రో నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచనా వేయాలని మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా ఉండే మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ఓల్డ్ సిటీ మెట్రో ఎందుకు చేపట్టలేదు?
పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ను ఎల్‌అండ్‌టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందినా ఓల్డ్‌సిటీ మెట్రోను పూర్తి చేయకపోవడం సరికాదన్నారు. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్‌మెంట్ నిలిపివేత నేపథ్యంలో.. జీఎంఆర్‌తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక కోరారు.
నగర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని రేవంత్ ఆదేశించారు. మూసీ సుందరీకరణ చేపట్టాలన్నారు. తూర్పు నుంచి పడమర వరకు మూసీ మార్గంలో నాగోల్ నుంచి గండిపేట్ దాకా ఎంజీబీఎస్‌ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండాలని సూచించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉందని చెప్పారు. భవిష్యత్తులో 3 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
నేడు కేబినెట్ భేటీ
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయి, సభ వాయిదా పడ్డాక ఈ భేటీని నిర్వహించనున్నారు.
ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్‌షిప్
Published Thu, Dec 14 2023 4:32 AM | Last Updated on Thu, Dec 14 2023 8:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment