
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం సంభవించింది. స్మైలెక్స్ ఫార్మా సంస్థలో విషవాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదకరమైన ట్రైఫోజెన్ గ్యాస్ లీకవ్వడంతో వాటిని ఇద్దరు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో వరుసగా ఇది రెండో ప్రమాద ఘటన. జేఎన్ ఫార్మాసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరి పరి స్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్‌శ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలోనూ విషవాయువుల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఫార్మా కంపెనీలు నాసిరకం మాస్కులు ఇస్తుండటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, విషవాయువుల వల్ల ప్రాణాలు పోతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై పరవాడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.