ముచ్చర్లలో ‘మోడల్ ఫార్మాసిటీ’
ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రత్యేకతలను చాటేలా సకల హంగులతో ‘మోడల్ ఫార్మాసిటీ’ని నిర్మించి.. పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 65 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ మోడల్ ఫార్మాసిటీలో ఫార్మా పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఆధునిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. రోడ్లు, విద్యుత్ తదితర మౌళిక సౌకర్యాలతో పాటు.. కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక ‘జీరో డిశ్చార్జి కాలుష్య శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా ఏర్పాటవుతున్న ఫార్మాసిటీకి.. జాతీయ పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి (నిమ్జ్) హోదా దక్కేందుకు కనీసం 12,500 పైగా ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 3వేల ఎకరాల మేర భూ సేకరణ పూర్తయింది. కనీసం 6వేల ఎకరాల్లో 2018 మధ్యకాలానికి ‘ఫార్మాసిటీ’ మొదటి దశ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు.
ప్రాజెక్టు పనుల కోసం ప్రత్యేక సంస్థ..
ఫార్మాసిటీ పనులను శరవేగంగా జరిగేలా ప్రత్యేక అధికారి నేతృత్వంలో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంతో ఫార్మాసిటీని అనుసంధానం చేసేందుకు ఆరు వరుసల రహదారి నిర్మించాలని ప్రతిపాదించారు. కాగా, ప్రాజెక్టు అభివృద్ధి పనుల నమూనాలకు బిడ్ల ఖరారు, ఒప్పందాలు తదితర ప్రక్రియలు పురోగతిలో ఉన్నాయి.