
వేగంగా ఫార్మాసిటీ పనులు
అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో తలపెట్టిన ఫార్మాసిటీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు పురోగతిపై గురువారం ఆయన టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్‌పై మంత్రి అధికారులతో చర్చించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్న కన్సల్టెన్సీ ప్రతినిధులు ప్రణాళికలో ఉండే విశేషాలను మంత్రికి వివరించారు. పూర్తిగా కాలుష్య రహిత ప్రాజెక్టుగా ఫార్మాసిటీ నిర్మాణం జరిగే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు.
ఫార్మాసిటీ ప్రాజెక్టుకు రోడ్డు సదుపాయంపై మంత్రి ఆరా తీశారు. మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మాసిటీలో నిర్మించనున్న ఫెసిలిటీ భవనం గురించి మంత్రి తెలుసుకున్నారు. భూసేకరణపై రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి చర్చించారు. ఫార్మాసిటీ తొలి దశ కోసం ఇప్పటిదాకా సుమారు 5,500 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు తెలియజేశారు. టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు సంస్థ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు.